ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నారింజ రంగులు - వారు జెండాలు ఎత్తి పట్టుకొని, వేదిక దాటి నడిచారు. పచ్చని దుపట్టాలతో తలలు కప్పుకున్న మహిళా రైతుల బృందం కవాతు చేస్తూ వచ్చింది. ట్రాక్టర్‌లపై అనేక మంది పురుషుల బృందం వచ్చారు, వారి తలపాగాలు ఆఫ్-వైట్ - మెరూన్, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. భుజాలపై జెండాలు పట్టుకుని వివిధ సమూహాలు రోజంతా వేదికపైకి నడిచాయి - ప్రతి రంగు ఒక పురాణంలోని పద్యంలా మెరుస్తూ ఉంది.
నవంబర్ 26, 2020 నుండి పూర్తి సంవత్సరం పూర్తయింది, పార్లమెంటు ఆమోదించిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ వారిలో చాలా మంది ఢిల్లీ గేట్‌లకు చేరుకున్నారు. ఈ వార్షికోత్సవంతో వారొక మైలురాయిని దాటారు. ఈ సందర్బంగా, రైతులు, వారి మద్దతుదారులు గత శుక్రవారం సింగు, తిక్రి, ఘాజీపూర్‌లలో నిరసన ప్రదేశాలను చేరారు.
ఇది విజయవంతమైన రోజు. కన్నీళ్లు, జ్ఞాపకాలు, భవిష్యత్తు ప్రణాళికల రోజు. మూడు చట్టాలను రద్దు చేస్తామని నవంబర్ 19న ప్రధాని చేసిన ప్రకటన పై సింగులో ఉన్న 33 ఏళ్ల గుర్జీత్ సింగ్, ఇది యుద్ధంలో గెలుపు మాత్రమే, అంతిమ విజయం కాదు, అన్నారు. ఈయన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జిరా తహసీల్‌లోని తన గ్రామమైన అరయన్‌వాలాలో సింగ్ 25 ఎకరాలు సాగు చేస్తున్నారు.
'ఈ విజయం ప్రజలదే. మేము ఒక మొండి నిర్వాహకుడిని ఓడించినందుకు సంతోషంగా ఉన్నాము,” అని 45 ఏళ్ల గుర్జీత్ సింగ్ ఆజాద్ అన్నారు, ఆ రోజు ఆజాద్ కూడా సింగులో ఉన్నారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని కహ్నువాన్ తహసీల్‌లోని ఆజాద్ గ్రామమైన భట్టియాన్‌లో, అతని మేనమామలు అతనికి ఉన్న రెండు ఎకరాల్లో గోధుమలని, వరిని సాగు చేస్తారు. "ఈ యుద్ధం నవంబర్ 26న ప్రారంభం కాలేదు. ఆ రోజు, అది ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నదంతే," అన్నారాయన. “బిల్లులు చట్టాలుగా మారకముందే రైతులు నిరసనలు ప్రారంభించారు. సెప్టెంబరు 2020లో మూడు వ్యవసాయ చట్టాలు ఆమోదించబడిన తర్వాత, ఢిల్లీకి రావాలని పిలుపు ఇచ్చారు. మేము ఆ పిలుపును అనుసరించాము.”
అతను గత సంవత్సరం జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు: “మేము మా రాజధాని వైపు వెళ్ళినప్పుడు, ప్రభుత్వం నీటి ఫిరంగులను ఉపయోగించింది. వారు కందకాలు తవ్వారు. కానీ కంచెలు ముళ్ల తీగలతో ఆపేంత అవసరం లేదు. మేమేమి ఆవేశపూరిత యుద్ధానికి రావడం లేదు. (గత సంవత్సరం, 62 ఏళ్ల జోగరాజ్ సింగ్ నాతో చెప్పాడు, తనలాంటి రైతులే పోలీసులకు ఆహారం ఇస్తారు, అందుకని పోలీసులు కూడా వారి పిల్లలే - కాబట్టి వారి లాఠీలకు కూడా 'తినిపించడం' అవసరమైతే, అప్పుడు రైతులు వారి వీపుని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.)




















