"నేను... నేను..." నేనడిగిన ప్రశ్నకు అందరికన్నా ముందే జవాబు చెప్పాలని అమన్ మహమ్మద్ ఆత్రపడిపోతున్నాడు. పన్నెండుమందికి పైగా ఉన్న ఆ పిల్లల బృందాన్ని, ఈ ఏడాది వినాయక చవితికి మీ పండాల్ ప్రధాన నిర్వాహకుడెవరని నేనడిగాను. "అమన్ ఒక్కడే సొంతంగా రెండువేల రూపాయల చందా వసూలు చేశాడు," అందర్లోకీ పెద్దపిల్ల టి. రాగిణి చెప్పింది. అందువలన బృందంలోని మరెవరూ అమన్ హక్కుగా చెప్పుకున్నదానికి అడ్డురాలేదు.
అవును. ఈ పండాల్ నిర్వాహకుల బృందం వసూలు చేసిన మొత్తం మూడువేల రూపాయలలో మూడింట రెండువంతులు అమన్ సేకరించిందే. ఆంధ్రప్రదేశ్ రాష్టం, అనంతపూర్ పట్టణంలో తాముండే సాయినగర్ వీధిలోకి వచ్చేపోయే వాహనాల నుంచి ఈ పిల్లల బృందం విరాళాలు సేకరించింది.
వినాయక చవితి తనకెంతో ఇష్టమైన పండుగని అమన్ అన్నపుడు నాకేం ఆశ్చర్యమనిపించలేదు.
2018లో సాయినగర్‌లో వినాయక చవితి వచ్చివెళ్ళిన కొన్ని వారాల తర్వాత ఓ ఆదివారంపూట నలుగురు పిల్లలు తామే కల్పించుకొన్న ఒక ఆటను ఆడుతూ కనిపించారు. దాన్ని నేను ఫోటోలు తీశాను. వాళ్ళంతా పిల్లలకెంతో ఇష్టమైన 'అవ్వ అప్పచ్చి’ అన్న ఆటను తగుమాత్రంగా మార్చి ఆడుతున్నారు. ఆ పిల్లాడు గణేశుడన్నమాట - హిందూ దేవుడైన గణేశుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. మరో ఇద్దరు పిల్లలు వాడ్ని ఊరేగింపుగా తిప్పి, చివరికి నేలను దించుతున్నారు - అంటే గణేశ్ నిమజ్జనమన్నమాట, దేవుని విగ్రహాన్ని నీళ్ళలో వదిలేయటం - అదే వాళ్ళు ఆడే ఆట.
అప్పుడలా ఊరేగిన ఆ బాలగణేశుడే అమన్ మొహమ్మద్. పైన ఉన్న కవర్ ఫోటోలో ముందు వరుసలో (ఎడమవైపు చివర) ఉన్న బాలుడే ప్రస్తుతం పదకొండేళ్ళ వయసున్న అమన్.
ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వినాయక చవితి సంబరాల కోసం అమన్, అతని మిత్ర బృందం ఒక 2x2 అడుగుల విస్తీర్ణం కలిగిన పండాల్లో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బహుశా మొత్తం అనంతపూర్ అంతటికీ అదే అతి చిన్న పండాల్ అయి ఉండాలి. నేను ఫోటో తీసేలోగానే ఆ పండాల్ అదృశ్యమయిపోయింది. వెయ్యి రూపాయలకు విగ్రహాన్ని కొన్నామనీ, మిగిలిన రెండు వేల రూపాయలతో పండాల్ కట్టి, దాన్ని అలంకరించామనీ ఆ పిల్లలు నాతో చెప్పారు. వీళ్ళ పండాల్ సాయినగర్ థర్ద్ క్రాస్‌లో ఉన్న దర్గా పక్కనే ఉంది.







