"డల్ వెలుపలి నుండి వచ్చిన కార్మికులు, తాము నీటిపై తేలియాడే తోటలలో పనిచేయాలని విన్నప్పుడు, మునిగిపోతామేమోనని ఆందోళన చెందుతారు!" మొహమ్మద్ మక్బూల్ మట్టూ నవ్వుతూ అన్నారు.
శ్రీనగర్ నగరంలోని డల్ సరస్సు దగ్గర్లోని మోతీ మొహల్లా ఖుర్ద్ ప్రాంతపు ఈ 47 ఏళ్ల రైతు, తాను వారికి రోజుకు రూ.700 చెల్లిస్తానని చెప్పారు. కశ్మీర్ లోయలోని శ్రీనగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కోసం సాధారణంగా ప్రజలు చెల్లించే దాని కంటే ఇది రూ. 200 ఎక్కువ. ఇతరుల శ్రమకు ఇవ్వాల్సిన ఈ ఖర్చును తగ్గించుకోవడానికి, "మేము ఎంత పని వత్తిడిలో ఉన్నప్పటికీ, నేనూ నా భార్య తస్లీమా ప్రతిరోజూ [పనికి] వస్తాం" అని ఆయన చెప్పారు.
మొహహ్మద్ మక్బూల్ మట్టూ తన 7.5 ఎకరాల తేలియాడే తోటలకు వెళ్లేందుకు పడవను ఉపయోగిస్తారు. స్థానికంగా వీటిని డల్ కే గార్డెన్ అని పిలుస్తారు. అక్కడతను ఏడాది పొడవునా టర్నిప్లు, హాఖ్ (కాలర్డ్ గ్రీన్స్ - కాబేజీ, కాలీఫ్లవర్ వంటివాటి పువ్వుల చుట్టూ ఉండే ఆకుల వంటివి) వంటి వివిధ రకాల కూరగాయలను పండిస్తారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు –11°Cకు పడిపోయినప్పుడు కూడా ఆయన ఈ సాగు చేస్తారు. అప్పుడతను తన పడవను నడపడానికి మంచుతో నిండిన సరస్సు ఉపరితలాన్ని పగులగొట్టాల్సివుంటుంది. “ప్రస్తుతం ఈ వ్యాపారం వల్ల నాకు తగినంత డబ్బు రావడం లేదు. అయినా నేను చేయగలిగినది ఈ పని మాత్రమే కాబట్టి, ఇదే చేస్తాను,” అని అతను చెప్పారు.
18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ డల్- హౌస్బోట్లు, షికారా (పడవ) ప్రయాణాలు, పురాతన మేపల్ చెట్లతో కూడిన చార్ చినార్ ద్వీపం, సరస్సుకు సరిహద్దుగా ఉన్న మొఘల్ కాలం నాటి తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీనగర్ యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణ.
సుమారు 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సహజ చిత్తడి నేలలో భాగమైన ఈ సరస్సుపై తేలియాడే ఇళ్ళు, తేలియాడే తోటలు ఉన్నాయి. తేలియాడే తోటలు రెండు రకాలు: రాధ్, డెంబ్. రాధ్ అనేది రైతులు చేతులతో నేసి తయారుచేసిన తేలియాడే తోట. రెండు రకాల కలుపు మొక్కలను - పెచ్ (టైఫా అంగుస్టాటా), నర్గాసా (ఫ్రాగ్మైట్స్ ఆస్ట్రేలిస్) - కలిపి నేస్తారు. ఈ నేసిన చాప లాంటి నిర్మాణం ఒక ఎకరంలో పదోవంతు నుండి మూడు రెట్లు పరిమాణం వరకూ ఉంటుంది. సాగు కోసం ఉపయోగించే ముందు దీన్ని 3-4 సంవత్సరాలు సరస్సుపై ఎండనిస్తారు. ఎండిన తర్వాత, ఈ చాపపై మట్టిని పొరలుగా వేస్తారు. అప్పుడది కూరగాయలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది. రైతులు సరస్సులోని వివిధ ప్రాంతాలకు ఈ రాధ్ను తరలిస్తారు.
డెంబ్ అనేది సరస్సు ఒడ్డున, అంచుల వెంట కనిపించే చిత్తడి నేల. ఇది కూడా తేలుతుంది కానీ అటూ ఇటూ మార్చడానికి కుదరదు.















