“ షాలేత్ జయచే... షాలేత్.. వైభవ్.. వైభవ్... షాలేత్...[ బడికి పోవాలని ఉంది... బడికి..] ”
పదమూడేళ్ల ప్రతీక్ ఈ పాటను పదేపదే పాడుతూనే ఉంటాడు అక్కడ కనపడని తన తరగతి జతగాడిని రా రమ్మంటూ. బయట ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న పిల్లలను చూస్తూ తమ మట్టిల్లు గడప దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజూ అలా కూర్చొనే ఉంటున్నాడు ప్రతీక్. లేని పక్షంలో ముంగిట్లో ఉన్న చెట్టుకు ఆనుకుని తన ప్రపంచాన్ని వీక్షిస్తూ నుంచుని ఉంటాడు. ఆ గడప , ముంగిలి , ముంగిట్లో ఉన్న చెట్లు , ఆవుల కొట్టం వీటికి మించి అతడి ప్రపంచం విస్తరించలేదు. బడి లేని ఈ పదకొండు నెలలుగా అదే స్థితి.
ఈ ఊళ్ళో మిగతా పిల్లలు ప్రతీక్ తో ఆడుకోరు. “రషీన్ గ్రామ పిలగాళ్లు ప్రతీక్ ఏమిచెబుతున్నదీ అర్థం చేసుకోరు. వాడు ఒంటరి అయిపోతాడు” అని ప్రతీక్ తల్లి శారదా రౌత్ చెప్పింది. ఆమె వయసు 32 ఏళ్ళు. గ్రామంలోని ఇతర పిల్లలకీ , అలాగే తన తొలి సంతానానికీ ప్రతీక్ భిన్నంగా ఉంటున్న లక్షణాలను ఆమె అతడి చిన్నతనంలోనే పసికట్టింది. పదేళ్ల వయసు వచ్చే వరకు అతడు తన భావాలను వ్యక్తీకరించలేక పోయేవాడు. \సంరక్షించుకోలేక పోయేవాడు.
ప్రతీక్ కు ఎనిమిదేళ్ళపుడు డౌన్ సిండ్రోమ్ అనే రుగ్మత స్వల్ప స్థాయిలో ఉందని సోలాపూర్ లోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్వోపచార్ రుగ్నాలయ్ వైద్యులు నిర్ధారించారు. సోలాపూర్ అహ్మద్ నగర్ జిల్లా కర్జాత్ తాలూకాలోని తన స్వగ్రామానికి 160 కి. మీ దూరంలో ఉంటుంది. “పదేళ్లు నిండేవరకు ప్రతీక్ కు మాటలు రాలేదు.” అని శారద జ్ఞాపకం చేసుకుంది. “అప్పుడే బడికి పోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నన్ను ఆయీ (అమ్మా) అని పిలవడం ప్రారంభించాడు. వాడంతట వాడే మరుగుదొడ్డికి వెళ్తున్నాడు , స్నానం చేస్తున్నాడు. బడి మా వాడికి చాలా ముఖ్యం. వాడు అక్కడే నాలుగు అక్షరాలు నేర్చుకున్నాడు . బడికి వెళ్ళడం కొనసాగితే వాడు మరింత మెరుగవుతాడు. కానీ ఈ మహమ్మారి (కోవిడ్) వచ్చింది!” అంటూ శారద ఆవేదన చెందింది.
మార్చ్ 2020లో కోవిడ్ -19 మొదలయినప్పుడు ప్రతీక్ చదువుతున్న ఆశ్రమ పాఠశాలను మూసేశారు. ఇక్కడ చదివే పాతిక మంది బౌద్ధిక వైకల్యం కల పిల్లల్లో ప్రతీక్ ఒకడు. అందరూ 6 నుంచి 18 ఏళ్ల లోపు మగ పిల్లలే. బడి మూసేసి వీళ్ళందరినీ ఇళ్లకు పంపించేశారు.
బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లల కోసం సోలాపూర్ జిల్లా కర్మాల తాలూకాలో ఒక ఆశ్రమ పాఠశాల ఉందని ఒక బంధువు తెలిపిన మీదట ప్రతీక్ ను అతడి తల్లి 2018లో ‘ జ్ఞాన్ ప్రబోదన్ మతిమండ్ నివాసి విద్యాలయ ’ లో చేర్చింది. ప్రతీక్ వాళ్ళ ఊరి నుంచి 10 కి.మీ దూరంలో ఉంటుందది. థానేలోని శ్రామిక్ మహిళా మండల్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ఈ పాఠశాలలో చదువు ఉచితం. పిల్లల కుటుంబాలకు ఖర్చు ఉండదు.
ఈ పాఠశాలలోని నలుగురు ఉపాధ్యాయులు పిల్లలకు స్పీచ్ థెరపీ , వ్యాయామం , స్వీయరక్షణ , భాష నైపుణ్యాలలో , పేపర్ క్రాఫ్ట్ లో , అంకెలూ రంగులూ వస్తువులూ గుర్తించడంలో , ఇతర కార్యకలాపాలలో పిల్లలకు శిక్షణ ఇస్తారు . సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఆదివారం పూట కూడా కొద్ది గంటల పాటు తరగతులు ఉంటాయి.
అయితే ప్రతీక్ స్కూలు, కార్యకలాపాలూ ; ఉపాధ్యాయుల , స్నేహితుల మధ్య జరిగే సంభాషణాలూ లాక్ డౌన్‌తో ఆగిపోయాయి. మార్చికి ముందు బడిలో చెప్పిన పాఠాలనుంచి తాను నేర్చుకున్న మరాఠీ , ఆంగ్ల అక్షరాలను కొన్నింటిని - a , aa, e … abcd - రాయడానికి అప్పుడప్పుడూ అతడు ఇంట్లో ప్రయత్నించేవాడు.
పదకొండు నెలలుగా బడి మూతపడి ఉండటంతో వాడు నేర్చుకున్నదంతా మర్చిపోతున్నాడు అంటూ ప్రతీక్ తల్లి శారద వాపోయింది. డిసెంబరు నుంచి అక్షరాలు రాయడం కూడా మానేశాడని ఆమె చెప్పింది. “ మార్చిలో వాడు ఇంటికి వచ్చినప్పుడు చాలా నిమ్మళంగా ఉండేవాడు. కానీ నెలలు గడుస్తున్న కొద్దీ వాడిలో చికాకు , చిర్రుబుర్రులు పెరిగిపోయాయి. నేను ప్రేమగా దేని గురించయినా అడిగితే వాడు కోపంగా బదులిస్తున్నాడు” అని శారద చెప్పింది.
బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లల విషయంలో పాఠశాల రూపొందించిన ప్రణాళిక , శిక్షణ చాలా ప్రాధాన్యత వహిస్తాయని చిన్నపిల్లల నరాల , పెరుగుదల సమస్యల వైద్య నిపుణులు , నార్త్ సెంట్రల్ ముంబై లోని సియాన్ కు చెందిన లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి ప్రొఫెసర్ డా. మోనా గజ్రే అభిప్రాయపడ్డారు. ఇటువంటి పాఠశాలల ప్రాధాన్యతను ఆమె ఇలా వివరించారు. “ ఇక్కడ ప్రతి బోధనాంశాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడదీసి ఓపికగా బోధిస్తారు. ఇలా విడదీసిన బోధనా కృత్యాలను పదేపదే చేయించడంతో పిల్లలకు అవి అప్రయత్నపూర్వకంగా వచ్చేస్తాయి. ఈ ప్రయత్నం నిరంతరంగా జరగకపోతే బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లలు నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నెలల వ్యవధిలోనే మర్చిపోతారు”, అని ఆమె అన్నారు.
బడిలో నేర్చుకున్న విషయాలను అంటిపెట్టుకుని ఉండటానికి వీలుగా పిల్లలను ఇళ్లకు పంపించినపుడు ప్రతీక్ పాఠశాల బోధనా సామగ్రిని కూడా పంపించింది. అయితే ప్రతీక్ కోసం ఉద్దేశించిన పాఠాలను నేర్పడం శారదకు కష్టంగా ఉంది. “ వాడి టీచర్ రంగుల పటాలను , వర్ణమాల పటాలను ఇచ్చారు. అయితే వాడు మా మాట వినడు. మాకు వేరే పనులు కూడా ఉంటాయి ” చెప్పింది శారద. పదో తరగతి వరకు చదివిన శారద ఇంటి పనులతో పాటు కుటుంబానికి చెందిన రెండెకరాల పొలంలో తన భర్త దత్తాత్రేయ్ రౌత్ తో కలిసి పనిచేస్తుంది. భర్త నలభైల వయసు వాడు.
కుటుంబ వినిమయం కోసం వాళ్ళు ఖరీఫ్ కాలంలో జొన్నలు , సజ్జలు పండిస్తారు. “నవంబరు నుంచి మే వరకు ఓ 20-25 రోజులపాటు మేము ఇతరుల పొలాల్లో పని చేస్తాము” అని శారద చెప్పారు. వారి ఆదాయం నెలకు రూ. 6 ,000 దాటదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కొడుకుకి సాయంగా ఇంట్లో ఉండటం అనేది సాధ్యపడే విషయం కాదు . ఇలా సాయంగా ఇంట్లో ఉండటమంటే అసలే అరాకొరాగా ఉండే వారి ఆదాయానికి మరింత గండి పడినట్లే.
పద్దెనిమిదేళ్ళ విక్కీ ప్రతీక్ అన్న. తాలూకా కాలేజీలో 12 వ తరగతి చదువుతున్నాడు. తమ్ముడికి సహాయపడటానికి అతడికి సమయం చిక్కదు. లాక్ డౌన్ తర్వాత విక్కీ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఇంట్లో ఎవరికీ స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో మొబైల్ ఫోన్ కోసం అతడి స్నేహితుడి ఇంటికి వెళ్ళి తరగతులకు హాజరవుతున్నాడు.
ఆన్‌లైన్ తరగతులన్నవి పిల్లలందరికీ ఒక సవాలన్న మాట నిజమే కానీ (చూడండి: ఆన్‌లైన్ తరగతులు , ఆఫ్ లైన్ తరగతుల విభజన ) బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లల విషయంలో (పాఠశాలలో ఏదోరకంగా చేరగలిగిన) అవి పెద్ద అవరోధాన్నే కలిగిస్తాయి. ఐదు నుంచి తొమ్మిది ఏళ్ల వయసున్న పిల్లల్లో నాలుగు లక్షల మంది బౌద్ధిక వైకల్యం కలిగిన వారు ఉంటే ( భారత దేశంలో ఉన్న 5 , 00 , 000 లక్షల బౌద్ధిక వైకల్యం గల పిల్లల్లో) వారిలో కేవలం 1 ,85, 086 మంది మాత్రమే ఏదయినా విద్య సంస్థలో చదువుకుంటున్నారు. ( జనాభా గణన 2011)
లాక్ డౌన్ సమయంలో ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వారి కమిషనరేట్ ఫర్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ అన్న విభాగం సోషల్ జస్టిస్ అండ్ స్పెషల్ అసిస్టెన్స్ విభాగం వారికి 10 జూన్ 2020న రాసిన లేఖలో ప్రత్యేకతలు కలిగిన పిల్లల కోసం కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అనుమతిని కోరింది. లేఖలో ఇలా ఉంది: “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (ఖార్గార్ , నవి ముంబై , ఠానే) వారి వెబ్‌సైట్ లో దొరికే బోధనా సామగ్రిని తల్లిదండ్రులు వినియోగించుకోవడం ద్వారా పిల్లలకు విద్యను అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైన సామగ్రిని తల్లిదండ్రులకు సరఫరా చేయాలి.”
జ్ఞాన్ ప్రబోదన్ విద్యాలయ తల్లిదండ్రులకు వర్ణమాల పటాలు , అంకెలు , వస్తువులు , అభ్యసన కృత్యాలు , పద్యాలు , పాటలు వంటి అభ్యసన సామగ్రిని పంపింది. ఏమేమి చేయాలో సూచిస్తూ తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడింది. పిల్లల గురించి క్రమం తప్పకుండా సమాచారం తీసుకుంటున్నాననీ , తల్లిదండ్రులకు నిత్యం సూచనలు అందిస్తున్నాననీ విద్యాలయాలో ఈ కార్యక్రమ సమన్వయకర్త రోహిత్ బగాడే చెప్పారు.
తమ బడిలో చదివే 25 మంది పిల్లల తల్లిదండ్రులు ఇటుక బట్టలలోనో , పొలాలలోనో కూలి పనులు చేసుకునేవారనీ లేదా చిన్నపాటి వ్యవసాయదారులనీ రోహిత్ బగాడే తెలిపారు. “ పిల్లవానితో (పాఠాలు చెప్పడం కోసం) తల్లిదండ్రులు కలిసి కూర్చోవాలి. అలా పని మానేసి ఇంట్లో పిల్లాడి కోసం కూర్చొంటే వాళ్ళు తమ కూలి నష్టపోతారు. ఈ కారణంగా ప్రతీక్ , ప్రతీక్ లాంటి పిల్లలకు వూరికే అలా కూర్చోడం తప్ప వేరే మార్గం లేదు. స్వశక్తితో నిలబడటానికీ , చీకాకు , ఆగ్రహాలను నియంత్రించుకోవడానికీ దైనందిన కృత్యాలు , ఆటలు ఉపయోగపడతాయి. అలాంటి కృత్యాలను ఆన్‌లైన్లో నిర్వహించడం దుర్లభం. పిల్లల మీద వ్యక్తిగత శ్రద్ధ అవసరమవుతుంది” అని ఆయన అన్నారు.
విద్యాలయ మూతపడటంతో రషీన్ అనే గ్రామానికి చెందిన 18 ఏళ్ల సంకేత్ హుంబే కూడా ప్రతీక్ లాగే నష్టపోయాడు. తమ పక్కా ఇంటి ఆవరణలో ఒక ఆస్బెస్టాస్ షెడ్ కింద వేసిన ఇనప మంచం మీద కూర్చొని అలా కిందకు చూస్తూ, గంటల తరబడి కూనిరాగాలు తీయడం అతనికి మార్చి నుంచి దినచర్యగా మారింది. (బడి 18 ఏళ్ళు దాటని పిల్లలను మాత్రమే చేర్చుకుంటుంది. ఆ వయసు దాటిన పిల్లలు సాధారణంగా ఇంట్లోనే ఉండిపోతారు. కర్జాత్ తాలూకాలో వృత్తి నైపుణ్య కేంద్రాలు కొన్ని ఉన్నాయి గానీ వాటిలో చేర్చాలంటే తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాలి. అత్తెసరు ఆదాయాలతో బతికే వీరు ఆ ఫీజులు కట్టుకోలేరు.)
సంకేత్ ఆరేళ్ల వయసులో ఉండగా అతడికి ‘తీవ్రమయిన మానసిక వైకల్యం’ ఉన్నట్టు ( వైద్య నివేదికలో రాసినట్టుగా) వైద్యులు నిర్ధారించారు. అతడు మాట్లాడలేడు. మూర్ఛ వల్ల తరచూ సొమ్మసిల్లి పడిపోతాడు. దీని నుంచి రక్షణ కోసం క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఊళ్ళో ఆశా సేవిక ఇచ్చిన సలహా మీదట సంకేత్ తల్లి మనీషా (39) తన కొడుకుని పదిహేనేళ్ళపుడు, 2017 లో తొలిసారిగా బడికి పంపింది.
“మునుపు వాడికి బట్టలు మేమే వేయాల్సి వచ్చేది, స్నానం మేమే చేయించాల్సి వచ్చేది, కాలకృత్యాలలో సహకరించాల్సి వచ్చేది. చుట్టూ ఉన్న మనుషులను చూసి అశాంతి పడిపోయేవాడు. బడికి పోవడం మొదలుపెట్టిన తర్వాత వాడు చాలా మెరుగయ్యాడు.” అని మనీషా చెప్పింది.
సుమారు 11 మాసాలుగా బడి నడవకపోవడంతో టాయ్‌లెట్ వాడకం మీద తాను తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో వాడికి అవగాహన లేకుండా పోయింది. “మార్చిలో ఇంటికి వచ్చిన కొద్ది వారాలకే లాగుల్లో విసర్జించడం, మలాన్ని ఒంటికీ, గోడలకూ పూయడం వంటివి చేయడం మొదలయ్యింది” అని మనీషా తెలిపింది.
మొదట కొద్ది వారాల పాటు, ఆ తర్వాత నెలల పాటు బడి మూతపడి ఉండటంతో ఆమెలో ఆందోళన పెరిగింది. తరచూ సంకేత్ దూకుడుగా ఉంటున్నాడు. మొండిగా వ్యవహరిస్తున్నాడు. నిద్ర పోవడం లేదు. “తరచుగా తెల్లవార్లూ నిద్రపోవడం లేదు. అలా మంచం మీద వెనక్కూ ముందుకూ ఊగుతూ కూర్చొనే ఉంటాడు” అని మనీషా వాపోయింది.
వ్యవసాయదారుడు అయిన మనీషా భర్త 30 ఏళ్ల వయసప్పుడు 2010 లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి మనీషా తన కొడుకు, 19 ఏళ్ల కూతురు రుతూజాలతో కలిసి రషిన్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది (దూరవిద్యా విధానంలో బి.యే చదువుతున్న రుతుజా ఠాణే జిల్లాలోని బదల్పూర్ నగరంలో అత్తయ్య వాళ్లింట్లో ఉంటోంది). తన తల్లిదండ్రులకు చెందిన ఏడు ఎకరాల పొలంలో మనీషా ఏడాది పొడవునా పని చేస్తుంది. ఖరీఫ్, రబీ కాలాలు రెండింటి లోనూ వారు కూలీల సహాయంతో అక్కడ జొన్నలు, సజ్జలు పండిస్తారు.
“ నా తల్లిదండ్రులు ఇద్దరూ ఎనభై ఏళ్ళు పైబడ్డవారు. సంకేత్ ను వాళ్ళు సంబాళించలేరు. వాళ్ళు ప్రేమగా ఏదయినా మాట్లాడినా కూడా వాడు వాళ్ళను తోసేస్తాడు, వస్తువులు వాళ్ళ మీదకు విసిరేస్తాడు, గట్టిగా అరుస్తాడు.” అయినా ఆమె ఇంటి దగ్గర అన్నివేళలా ఉండలేదు. “మరి ఎవరు పొలంలో పని చేస్తారు? మేమేమి తినాలి?” ప్రశ్నించింది మనీషా.
మార్చిలో బడి నుంచి ఇంటికి వచ్చినపుడు వాడు మరీ ఇంత దూకుడుగా ఉండేవాడు కాదు. “వాడు నాతో పొలం వచ్చేవాడు. మా పశువుల కోసం గడ్డి మోపును నెత్తి మీద పెట్టుకుని మోస్తూ సాయపడేవాడు. సెప్టెంబరులో ఆకస్మికంగా పొలం రావడం మానేశాడు.” అని మనీషా వివరించింది. పొలం రమ్మని తల్లి ఒకవేళ ఒత్తిడి చేస్తే ఆమెను సంకేత్ తన్నడమో కొట్టడమో చేసేవాడు. “ వాడి మీద కోప్పడలేను. తల్లికి పిల్లలందరూ సమానమే. ఎలా ఉన్నా కూడా వాడు నా హృదయంలో భాగమే.” అని ఆమె భావోద్వేగంతో చెప్పింది.
బడి ఇచ్చిన చిత్రపటం సాయంతో వస్తువులను ఎలా గుర్తించాలో సంకేత్ కు నేర్పేందుకు మనీషా ప్రయత్నం చేస్తుంది. పొలం నుంచి తిరిగి వచ్చిన తర్వాతనో, ఇంటి పనులు చేసుకునేటప్పుడో ఈ పాఠం చెబుతుంది. “పటాన్ని చూపగానే వాడు నా దగ్గర నుంచి పరిగెత్తుకుని పారిపోతాడు. ఎక్కడికో వెళ్ళి కూర్చొంటాడు. నా మాట వినడు” అని ఆమె ఫిర్యాదు చేసింది.
పాఠశాలలో జరిగే కార్యకలాపాలు, కృత్యాలు, తోటి పిల్లలతో వారు ఆడే ఆటలు, అక్కడ లభించే బోధనాభ్యసన సామగ్రి, పిల్లలకు అందించే స్వయం శిక్షణ వంటివి ఇంట్లో లభించకపొతే బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లలలో ప్రవర్తనా సమస్యలకు దారితీస్తుందని రోహిత్ బగాడే అభిప్రాయపడ్డారు.
బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లల కుటుంబాలకు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, స్థిరమైన ఇంటర్నెట్ లభ్యత ఉన్నా కూడా ఆ పిల్లలు భౌతిక తరగతులకు హాజరు కావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం అని బగాడే అన్నారు. “ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించడానికి చాలా ఓరిమి కావాలి. పిల్లలు ఒక కృత్యాన్ని అర్థం చేసుకునేంతవరకు వాళ్ళతో సంభాషించడం, ఒప్పించడం తల్లిదండ్రులకు కష్టసాధ్యమైన పని. తల్లిదండ్రులు దీనికి అలవాటుపడి ఉండరు. అందుచేత వారు అలసిపోతారు. పిల్లలు తమ మాటను వినడం లేదని చెప్పి వారికి నేర్పే ప్రయత్నాన్ని విడిచిపెట్టేస్తారు” అని బగాడే అన్నారు.
“బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లల బోధనలో క్రమబద్ధత, నిలకడ కలిగిన ప్రయత్నాలు కీలకం” అని చెప్పారు ముంబై లోకమాన్య తిలక్ మున్సిపల్ ఆసుపత్రి డాక్టరు గజ్రే. కానీ కోవిడ్ వల్ల బడులు మూతపడటంతో అనేకమంది బౌద్ధిక వైకల్యం కల పిల్లలు వారికి ప్రత్యేకంగా గరిపే విద్య అందక నష్టపోతున్నారు. వారు ఇతరుల మీద ఆధారపడే స్థితికి నెట్టబడ్డారు. బడికి మధ్యలోనే స్వస్తి పలికే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ ఆటిజం చికిత్సా కేంద్రంలో ఎన్రోల్మెంట్ పరిస్థితులను డా. గజ్రే వివరించారు. “ఆఫ్ లైన్ చికిత్స, శిక్షణ లను ఆన్‌లైన్ అభ్యసనావిధానం భర్తీ చేయలేదు, ప్రత్యేకించి బౌద్ధిక వైకల్యం ఉన్న పిల్లల విషయంలో. మార్చి మొదటి వారం మొదలు మేము 35 మంది పిల్లలకు ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చాము. అక్టోబరు నాటికి వారి సంఖ్య బాగా పడిపోయింది (దరిదాపు 8 నుంచి 10 మంది రావడం మానేశారు)” అని డా. గజ్రే తెలిపారు.
యశ్వంతరావు చవాన్ ప్రతిష్టాన్ అనే ప్రభుత్వేతర సంస్థ వారి డిజెబిలిటీ రైట్స్ ఫోరం సమన్వయకర్త విజయ్ కన్హేకర్ లెక్క ప్రకారం మహారాష్ట్రలో దృష్టి, వినికిడి, బౌద్ధిక సవాళ్ళు ఉన్న పిల్లల కోసం, ఇతర ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం 1100 ప్రభుత్వ ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. నేడు అవన్నీ మూతపడ్డాయని ఆయన చెప్పారు.
ప్రతీక్, సంకేత్ లు చదువుతున్న బడిని తిరిగి తెరవడం, తరగతులు మునుపటిలా నిర్వహించడం కష్టసాధ్యంగా మారబోతోంది. తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉన్నా దానికోసం ప్రభుత్వం ఎటువంటి నిధులూ ప్రభుత్వం నుంచి రాలేదు. రాష్ట్ర విద్య, క్రీడల విభాగం వారికి ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేదు. మార్చి నుంచి ఇంతవరకూ పాఠశాల ఎటువంటి విరాళాలను పొందలేదు ( ట్రస్టులు, వ్యక్తుల నుంచి). ఇది పాఠశాల పునఃప్రారంభాన్ని మరింత దుస్సాధ్యం చేస్తోంది.
“తల్లిదండ్రుల నుంచి మేము ఎటువంటి ఫీజులను వసూలు చేయము. అందుచేత విరాళాలు మాకు చాలా ముఖ్యమైనవి. మరి ముఖ్యంగా ఈ మహమ్మారి సమయంలో పిల్లల, ఉపాధ్యాయుల, సహాయకుల ఆరోగ్య భద్రతను కాపాడే విషయంలో సిధ్ధంగా ఉండాలి. ఉదాహరణకు వ్యక్తిగత భద్రతా ఉపకరణాలను(PPE Kits) సమకూర్చుకోవడం ముఖ్యం. ఎందుకంటే మా పిల్లలకు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి” అని బగాడే అన్నారు.
“మహారాష్ట్రలోని అన్నీ ఆశ్రమ పాఠశాలలు నేడు మూతపడి ఉన్నాయి. ఏ ఆటాపాటా లేకుండా పిల్లలు ఇళ్ళల్లో పడి ఉంటున్నారు. ఇది పిల్లలను మరింత దూకుడుగా మారుస్తోంది. ఇటువంటి ఇబ్బందులు ఉన్న పిల్లలను సంబాళించడం తెలియని తల్లిదండ్రుల మానసిక స్థితిని ఇది ప్రభావితం చేస్తోంది” అని విజయ్ కన్హేకర్ అన్నారు.
సురక్షితమైన ప్రత్యేక పాఠశాలలను తెరవడానికి సహాయ పడాలని విజయ్ కన్హేకర్ పనిచేసే వేదిక అభ్యర్థిస్తోంది. “కోవిడ్ కేంద్ర స్థాయిలో ఆరోగ్య భద్రత, రక్షణ నియమావళిని పాటించే బడులను ఏర్పాటు చేయాలని” ఆయన కోరుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ స్పెషల్ అసిస్టెన్స్ విభాగానికి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. వైకల్యం కల పిల్లలే మొట్ట మొదట వాక్సిన్ పొందవలసిన వారని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు.
ఇప్పటికయితే ప్రతీక్ సంకేతులకు బడి లేదు, రోజువారీ కార్యకలాపాలు లేవు, స్నేహితులు లేరు, నేర్చుకోవడానికీ చేయడానికీ ఏమీలేదు. వీరు తమ ఇళ్ల ముంగిళ్ళలో గంటల తరబడి ఒంటరిగా కూర్చొని రోజులు గడుపుతున్నారు. ప్రతీక్ అప్పుడప్పుడూ టీవీల్లో వచ్చే కోవిడ్ మార్గదర్శకాలను చూస్తూ “ కలోనా… కలోనా ... కలోనా...” అంటూ ఏదో గొణుగుతూ ఉంటాడు కానీ ప్రతీక్ లాంటి పిల్లలకు ఈ కోవిడ్ విశ్వమారి అసలు స్వరూపం ఏమి తెలిసేను?
అనువాదం: ఎన్.ఎన్.శ్రీనివాసరావు