కమల నాలుగోసారి గర్భవతి అయ్యి బిడ్డని వద్దు అనుకున్నప్పుడు ముందుగా వెళ్ళింది తనుండే గూడెం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి కాదు. తను కేవలం ఇంటికి దగ్గరలో వారం వారం ఉండే హాట్ కి మాత్రమే ముందు వెళ్ళింది, ‘నాకు ఈ ప్రదేశం గురించి తెలీదు. నా భర్త తర్వాత కనుగొన్నాడు’ అంటుంది తను.
ముప్ఫయిల వయసులో ఉన్న కమల, ఆమె భర్త రవి, 35, (పేర్లు మార్చబడ్డాయి ), ఇద్దరూ గోండ్ తెగకి చెందినవారే, ముందుగా తమ గుడానికి దగ్గర్లో ఉన్న స్థానిక 'వైద్యుడిని' కలిశారు. 'ఒక మిత్రుడు మాకు అతని గురించి చెప్పాడు,' అని చెప్పింది ఆమె. కమల తన ఇంటి దగ్గర్లో చిన్న స్థలంలో కూరగాయలు పండించి ప్రతి వారం జరిగే హాట్ లో అమ్ముతుంది, తన భర్త రవి స్థానిక మం డి లో కూలీగా చేస్తాడు, అలాగే అతని ఇద్దరు సోదరులతో కలిసి మూడెకరాల్లో గోధుమలు, జొన్న పండిస్తాడు. కమల చెప్తున్న క్లినిక్, రహదారి నుంచి సులభంగానే కనిపిస్తుంది. ఆస్పత్రిగా చెప్పుకునే ఆ ప్రదేశంలో 'డాక్టర్' అనే బోర్డు లేదు, కానీ ప్రహరీ గోడ మీద ఫ్లెక్సీలపై మాత్రం అతని పేరుకి ముందు ఆ శీర్షిక ఉంది.
ఆ 'డాక్టర్' కమలకి ఐదు మాత్రలు ఇచ్చి అవి మూడు రోజుల పాటు వేసుకోమని చెప్పి 500 తీస్కొని తర్వాతి పేషెంట్ ని రమ్మన్నాడని కమల చెప్పింది.. ఆ మాత్రల గురించి గానీ, వాటి వల్ల ఉండే రియాక్షన్లు గానీ, మరీ ముఖ్యంగా ఎప్పుడు ఎలా గర్భస్రావం అవుతుందో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఆ మందు తీసుకున్న కొన్ని గంటలకి కమలకి రక్తస్రావం మొదలయ్యింది. “నేను కొన్ని రోజుల పాటు ఆగి చూసాను, ఐనా అది ఆగలేదు, అందుకే మళ్ళీ ఆ మందు ఇచ్చిన డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్లాం. అతను మమ్మల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి 'సఫాయి' చేయించుకోమని చెప్పాడు.” అన్నది కమల. అతను సూచించేది వాక్యూమ్ తో గర్భాశయాన్ని శుభ్ర పరిచే ప్రక్రియ గురించి.
లేత శీతాకాలపు ఎండలో బేనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బయట ఒక బెంచి మీద కూర్చుని ఉన్న కమల మెడికల్ టెర్మినేషన్ అఫ్ ప్రెగ్నన్సీ (MTP ) ప్రక్రియ చేయించుకోవడానికి తన వంతు కోసం ఎదురు చూస్తుంది, ఈ ప్రక్రియ నిర్వహించడానికి సుమారు 30 నిముషాలు పడుతుంది, కానీ చేయించుకోడానికి ముందు, తరువాత మూడు నుంచి నాలుగు గంటల పాటు విశ్రాంతి అవసరం. తప్పనిసరిగా చేయించుకోవాల్సిన రక్త, మూత్ర పరీక్షలు మునుపటి రోజే అయిపోయాయి.
ఛత్తీస్‌గఢ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలోని ఈ PHC 2019 చివర్లో పునరుద్ధరించబడింది. అందులో ఆరోగ్యవంతమైన పిల్లలు, సంతోషంగా ఉన్న తల్లుల రంగురంగుల పెయింటింగులు ఉన్నప్రత్యేకమైన ప్రసూతి గదులు, ఒక పది పడకల వార్డు, మూడు పడకల లేబర్ రూమ్, ఆటోక్లేవ్ మెషీన్, ప్రసవం అవ్వబోయే నిండు గర్భిణీలు ఉండడానికి నివాస సౌకర్యం కాక ఒక కిచెన్ గార్డెన్ కూడా ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉండే బస్తర్ లోని ఈ ప్రాంతంలో ప్రజారోగ్య సేవల గురించి ఇది ఒక ఆశాజనకమైన చిత్రాన్ని కనబరుస్తుంది.
'బేనూర్ PHC (నారాయణపూర్ బ్లాక్ లో) జిల్లాలోనే అత్యుత్తమ సదుపాయాలు, సేవలు అందిస్తుంది', అని మాజీ రాష్ట్ర ప్రసూతి ఆరోగ్య సలహాదారు డా.రోహిత్ బఘెల్ తెలిపారు. 'అక్కడ 22 సిబ్బందిలో ఒక డాక్టర్, ఒక ఆయుష్ (దేశీయ వైద్య వ్యవస్థ) మెడికల్ ఆఫీసర్, ఐదుగురు నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక స్మార్ట్ కార్డు కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు'.
30 కిలోమీటర్ల వ్యాసం పరిధిలో ఉన్న పేషెంట్లను ఈ PHC కవర్ చేస్తుంది, ఈ జిల్లాలో ఎక్కువగా ఆదివాసీలే ఉన్నారు. ఇక్కడ జనాభాలో 77.36 శాతం మంది షెడ్యూల్డ్ తెగలు, ప్రధానంగా గోండ్, అభూజ్ మారియా, హల్బా, ధుర్వా , మురియా, మరియా వర్గాల వాళ్ళు ఉన్నారు.
కానీ, “ఇలాంటివి ఇక్కడ చేయించుకోవచ్చని మాకు తెలీదు”, మాట్లాడేటప్పుడు సన్నటి పోల్కా చుక్కలు ఉన్న శాలువాతో మొహం కప్పేస్తూ కమల చెప్తుంది. ఆమె ముగ్గురు పిల్లలు - 12, 9 సంవత్సరాల వయసు గల ఇద్దరు కూతుర్లు, పది సంవత్సరాల కొడుకు- ఒక గోండ్ ఆదివాసీ మంత్రసాని సహాయంతో ఇంట్లోనే పుట్టారు. కమలకి ప్రసవానికి ముందు గానీ తర్వాత గానీ ఎలాంటి సంరక్షణ లేదు. సంస్థాగతమైన పునరుత్పత్తి ఆరోగ్య సేవలలో ఇదే తన మొదటి అనుభవం. “నేను మొదటిసారి ఆస్పత్రికి వచ్చాను”, ఆమె చెప్పింది. “ అంగన్వాడీ లో మాత్రలు ఇస్తారని విన్నాను కానీ నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు”. ఊర్లల్లో, తండాల్లో ఫోలిక్ ఆసిడ్ మాత్రలు పంపిణీ చేయడానికి, ప్రీనేటల్ చెకప్ చేయడానికి సందర్శించే గ్రామీణ ఆరోగ్య నిర్వాహకుల గురించే కమల చెబుతోంది
ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచి కమల సంబంధం లేనట్టుగా ఉండడం ఇక్కడ అసాధారణం కాదు. గ్రామీణ ఛత్తీస్‌గఢ్ లో 33.2 శాతం మహిళలకు సంస్థాగత కాన్పులు లేవని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -4 (2015-16) పేర్కొంది. కమల లాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ గర్భనిరోధకాలు వాడని మహిళల్లో కేవలం 28 శాతం మాత్రమే ఆరోగ్య కార్యకర్తతో కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడినట్టు కూడా ఆ సర్వే తెలిపింది. “ప్రణాళిక లేని గర్భాలు సాపేక్షంగా సాధారణం”, ఇంకా “గర్భస్రావం జరిగిందని చెప్పిన మహిళల్లో దాదాపు నాలుగో వంతు మందికి గర్భస్రావం వల్ల సమస్యలు వచ్చాయని’ కూడా NFHS-4 పేర్కొంది.
రోడ్డు కనెక్టివిటీ సరిగ్గా లేని లేదా అసలే లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నారాయణపూర్ జనాభాలో సుమారు 90 శాతం మందికి పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ అంతగా అందుబాటులో లేదు. నారాయణపూర్ జిల్లాలో ప్రజా ఆరోగ్య నెట్వర్క్ లో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ డాక్టర్ల కొరత ఉంది. “జిల్లాలో స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు 60 శాతం పైగా ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి బయట గైనకాలజిస్టు లేరు,” అని డా.బాగేల్ చెప్పారు. ఇంకా రెండు PHCలు- ఒర్చా బ్లాక్ లోని గర్పా, హాండవాడ- ఒకే గదిలో పని చేస్తాయి. వాటికి భవనం లేదు, డాక్టర్లు కూడా లేరని ఆయన తెలిపారు.
దీని వల్ల కమల, ఇంకా తన లాంటి ఎందరో మహిళలు కమల కలిసిన ‘డాక్టర్’ తరహాలో వాళ్ళ పునరుత్పత్తి ఆరోగ్య అవసరాల కోసం అర్హత లేని మెడికల్ ప్రాక్టీషనర్ల మీద బలవంతంగా ఆధార పడవలసి వస్తుంది. “మన ఆదివాసీలు చాలామందికి ఎవరు అల్లోపతి డాక్టర్లో ఎవరు కాదో అనే పరిజ్ఞానం లేదు. మన దగ్గర నాటు వైద్యులైన ‘ఝోలా ఛాప్’ డాక్టర్లు (మందులు సూచించడానికి, ఇవ్వడానికి ఏ మాత్రం అర్హత లేదు) కానీ వాళ్లే ఇంజెక్షన్లు, డ్రిప్, మందులు ఇస్తారు, వాళ్ళని ఎవరూ ప్రశ్నించరు,’ అని గోండ్ ఆదివాసీ అయిన ప్రమోద్ పోతై వివరించారు. జిల్లాలో ఆరోగ్యం, పోషకాహారం గురించి UNICEF మద్దతుతో నడుస్తున్న కార్యక్రమంలో భాగమైన బస్తర్ లో ఉన్న స్వచ్ఛంద సంస్థ సాథి సమాజ్ సేవి సంస్థలో ఆయన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్.
ఈ కొరతను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్య సహాయకుల పోస్టులు తీసుకొచ్చింది. 2001లో చత్తీస్ఘడ్ ఏర్పడినప్పుడు పి.హెచ్.సి స్థాయిలో మొత్తం 1455 మంజూరైన పోస్టులకు 516 మంది వైద్య అధికారులు మాత్రమే ఉన్నారు. చత్తీస్గడ్ చికిత్స మండల్ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ ప్రాక్టీషనర్ లకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ప్రాక్టీషనర్స్ ఇన్ మోడర్న్ & సర్జరీ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ మూడేళ్ళ కోర్సుని తర్వాత మూడు నెలల్లోనే డిప్లమా ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గా పేరు మార్చారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) ని సంప్రదించలేదు, ‘మోడర్న్ మెడిసిన్’, ‘సర్జరీ’ లాంటి పదాల వాడకంపై కూడా చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఈ కోర్సులో బయోకెమిక్ మెడిసిన్, హెర్బో మినరల్ మెడిసిన్, ఆక్యుప్రెషర్, ఫిసియోథెరపీ, మాగ్నెటో థెరపీ, యోగా, ఫ్లవర్ రెమెడీలు వంటివన్నీ ఉన్నాయి. RMAలు గా అర్హులైన వ్యక్తులను ప్రత్యేకంగా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో “అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్” హోదాలో నియమించవలసి ఉండింది.
MCI మాత్రం డిప్లొమా కోర్సును తిరస్కరించింది, ఇది వైద్య వృత్తి ప్రమాణాలను పలుచన చేసే అవకాశం ఉందని పేర్కొంది. బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు (మొదటిది 2001లో ఇండయన్ మెడికల్ అసోసియేషన్ యొక్క ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శాఖ ద్వారా, మిగతావి ఇతర ఆరోగ్య కార్యకర్తల సంఘాలు, నర్సుల సంఘాలు, ఇతరుల ద్వారా) దాఖలు చేయబడ్డాయి. ఫిబ్రవరి 4, 2020న RMAలకు 'సహాయక వైద్య అధికారి' హోదాను రద్దు చేస్తూ రాష్ట్రం 'విధాన నిర్ణయం' తీసుకుందని కోర్టు పేర్కొంది. RMAలు 'డాక్టర్' అనే బిరుదును ఉపయోగించలేరని, స్వతంత్రంగా పని చేయరాదని, MBBS వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే పని చేయవచ్చని, వ్యాధి/తీవ్ర పరిస్థితులు/అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్/స్థిరీకరణ మాత్రమే చేయగలరని కోర్టు పేర్కొంది.
అయితే, RMAలు ఒక క్లిష్టమైన ఖాళీని మాత్రం పూరించారు. "వైద్యుల కొరత దృష్ట్యా, కనీసం నాటువైద్యుల దగ్గరికి వెళ్ళిన వారు ఇప్పుడు RMAని సంప్రదించవచ్చు," అని బఘేల్ చెప్పారు. "వారికి కొంత వైద్య శిక్షణ ఉంది, గర్భనిరోధకంపై సాధారణ కౌన్సెలింగ్ కూడా ఇవ్వచ్చు, కానీ అంతకు మించి ఏమీ చేయలేరు. అర్హత కలిగిన MBBS వైద్యుడు మాత్రమే అబార్షన్-సంబంధిత మందుల గురించి సలహా ఇవ్వగలరు, సూచించగలరు.”
2019-20లో 1,411 RMA లు రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నట్టు బాఘేల్ తెలిపారు. "మాతృ మరణాల రేటు మరియు శిశు మరణాల రేటు తగ్గినందుకు మనం వాళ్ళకి కొంత క్రెడిట్ ఇవ్వాలి" అని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో శిశు మరణాల రేటు 2005-06లో ప్రతి వెయ్యికి 71 ఉండగా అది 2015-16లో 54కి తగ్గింది, అంతేగాక ప్రజా సౌకర్యంలో సంస్థాగత కాన్పులు 2005-06లో 6.9 శాతం నుండి 55.9 శాతానికి పెరిగింది (NFHS-4).
కమలకి తను మొదట సంప్రదించిన ‘డాక్టర్’ RMA నా లేదా అసలు అర్హత లేని ఆపరేటివా అనేది తెలియదు. ఆ ఇద్దరికీ కూడా మిసోప్రోస్టోల్ , మిఫెప్రెస్టోన్లను - గర్భస్రావాలు జరగడానికి ఉపయోగించే మందులు- వాడమని సలహా ఇచ్చే అధికారం లేదు, కమలకు అవే మందులు సూచించారు. "MBBS వైద్యులు కూడా ఈ మందులను సూచించడానికి అర్హత సాధించడానికి ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో MTPపై 15 రోజుల శిక్షణా శిబిరంలో పాల్గొనవలసి ఉంటుంది" అని బెనూర్ PHCకి నాయకత్వం వహిస్తున్న 26 ఏళ్ల అల్లోపతి డా. పరమజీత్ కౌర్ అభిప్రాయపడ్డారు. “ఎక్కువ రక్తం కోల్పోకుండా రోగిని పర్యవేక్షించాలి, అబార్షన్ పూర్తిగా జరిగిందా లేదా అని తనిఖీ చేయాలి. లేకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు.”
బస్తర్‌లోని ఈ ప్రాంతంలో తనను నియమించిన దాదాపు రెండేళ్లలో కమల వంటి అనేక ఇబ్బందికరమైన కేసులను తను చూశానని కౌర్ చెప్పింది. ఆమె ఔట్ పేషెంట్ రిజిస్టర్ జాబితాలో రోజుకు సగటున 60 మంది రోగులు వివిధ రకాల ఫిర్యాదులతో వస్తున్నట్లు తెలుస్తుంది, ఇక శనివారం (ఈ ప్రాంతంలో మార్కెట్ రోజు) ఆ సంఖ్య దాదాపు 100కి చేరుకుంటుంది . “నేను OPDలో ఇటువంటి [పునరుత్పత్తి ఆరోగ్యం] ‘రిపేర్’ కేసులు చాలా చూస్తుంటాను, వీళ్లంతా అర్హత లేని వైద్య సిబ్బంది దగ్గర చికిత్స తీస్కున్నవాళ్లు. అబార్షన్ తప్పుగా జరిగితే అది ఇన్ఫెక్షన్లకి దారి తీస్తుంది, వంధ్యత్వానికి, తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి కూడా దారి తీస్తుంది" అని ఆమె చెప్పింది. "ఇక్కడికి వచ్చే చాలా మంది మహిళలకు వీటన్నింటి గురించి అవగాహన ఉండదు," అని ఆమె అంటుంది. “మందులు సూచించే ముందు రక్తహీనత, రక్తంలో చక్కెర శాతాలను చెక్ చేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళకి కేవలం ఒక మాత్ర ఇచ్చి పంపిస్తారు."
బేనూర్ నుండి సుమారు 57 కిలోమీటర్ల దూరంలో, ధోడైలోని మరో PHCలో, 19 ఏళ్ల హల్బీ ఆదివాసి అయిన సీత (పేరు మార్చబడింది) తన రెండేళ్ల పాపతో వచ్చింది. "నా బిడ్డ ఇంట్లోనే పుట్టింది, నేను గర్భిణీగా ఉన్న సమయంలో, ప్రసవం తర్వాత నేను ఎవరినీ సంప్రదించలేదు" అని ఆమె చెప్పింది. తనకి దగ్గర్లోని అంగన్వాడీ - ఆరోగ్య కార్యకర్తలు ప్రసవానికి ముందు,తరువాత పరీక్షలు చేయడానికి అందుబాటులో ఉంటారు - అది ఆమె ఇంటి నుండి కేవలం 15 నిమిషాల నడక దూరంలో ఉంది. "వాళ్ళేం చెప్తారో నాకు అర్థం కాదు," అని ఆమె అంటుంది.
నేను కలిసిన చాలా మంది ఆరోగ్య నిపుణులు వైద్య సలహాను అందించడంలో భాష అవరోధంగా ఉందని చెప్పారు. గ్రామీణ బస్తర్‌లోని చాలా మంది ఆదివాసీలు గోండి లేదా హల్బీ మాట్లాడతారు, కొంచెం చత్తీస్గఢీని అర్థం చేసుకుంటారు. ఆరోగ్య నిపుణులు స్థానికులు కాకపోవచ్చు లేదా ఈ భాషల్లో ఒకటి మాత్రమే తెలిసి ఉంవచ్చు. కనెక్టివిటీ మరొక సమస్య. ధోడై పిహెచ్సి పరిధిలో 47 గ్రామాలు ఉన్నాయి, అందులో 25 గ్రామాలకు అప్రోచ్ రోడ్డు లేదు అని ధోడై RMA ఎల్.కె. హర్జ్పాల్, 38, చెప్పారు. "బాగా లోపలగా ఉన్న ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టం, భాష కూడా ఒక సమస్య, కాబట్టి మేము మా పని [గర్భధారణలను పర్యవేక్షించడం] చేయలేము," అని ఆయన చెప్పారు. మా ఆక్సీలియరీ నర్స్ మిడ్ వైవ్స్ (ANMలు) అన్ని ఇళ్లను కవర్ చేయడం కష్టంగా ఉంది, ఒక్కో దాని మధ్య దూరం ఎక్కువ. ఎక్కువ మంది మహిళలు ప్రజారోగ్య సేవలను పొందేందుకు వీలుగా, రాష్ట్ర ప్రభుత్వం 2014లో బైక్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది, ప్రస్తుతం ఈ జిల్లాలో ఐదు పనిచేస్తున్నాయి.
అంబులెన్స్‌ను ఉపయోగించిన వాళ్లలో 22 ఏళ్ల దశమతి యాదవ్ కూడా ఉంది. ఆమెకు, ఆమె భర్త ప్రకాష్‌కి ఒక నెల వయసున్న కూతురు ఉంది; వీళ్ళు ఐదెకరాల భూమిని సాగుచేసే రైతులు. “నేను మొదటిసారి గర్భం దాల్చినప్పుడు, గ్రామంలోని సిర్హా [సాంప్రదాయ వైద్యుడు] నన్ను అంగన్వాడీకి గానీ ఆసుపత్రికి గానీ వెళ్లద్దని చెప్పాడు. ఆయనే నన్ను చూసుకుంటానని చెప్పాడు. కానీ నా మగబిడ్డ ఇంట్లో పుట్టిన వెంటనే చనిపోయాడు" అని దశమతి చెప్పింది. “అందుకే ఈసారి నా భర్త అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు, నన్ను కాన్పు కోసం బెనూరుకు తీసుకెళ్లారు.” ఆమె ఉంటున్న తండా నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న PHCలో, మహతరి ఎక్స్‌ప్రెస్ ('మహాతరి' అంటే ఛత్తీస్‌గఢిలో 'తల్లి') అనే అంబులెన్స్ ఉంది, 102కి డయల్ చేయడం ద్వారా దాన్ని బుక్ చేసుకోవచ్చు. దశమతి కూతురు ఆరోగ్యంగా ఉంది, తను కూడా సంతోషంగా ఉంది.
"మహిళలను ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడానికి ప్రోత్సహించేందుకు, 2011లో జననీ శిశు సురక్ష కార్యక్రమం [కేంద్ర ప్రభుత్వంచే] ప్రారంభించబడింది, ఈ పథకం ద్వారా ఆసుపత్రికి ప్రయాణ ఖర్చులు, ఉచిత ఆసుపత్రి బస, ఉచిత ఆహారం, అవసరమైన మందులను అందుతాయి," అని నారాయణ్పూర్లోని ఆరోగ్య జిల్లా కన్సల్టెంట్ అయిన డా.మీనల్ ఇందుర్కర్ చెప్పారు. "ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ద్వారా ప్రసవానికి ముందు నాలుగు పరీక్షలను పూర్తి చేసి, ఆసుపత్రిలో ప్రసవం అయ్యి, నవజాత శిశువుకు అన్ని టీకాలు వేయించిన తల్లికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందిస్తోంది”, అని ఆమె చెప్పారు.
బెనూరు PHC లో, కమల తన MTP కోసం ఎదురుచూస్తుండగా, రవి తన భార్య కోసం టీ తీస్కొని వచ్చాడు. పొడవాటి చేతుల చొక్కా, నీలిరంగు జీన్స్ వేస్కునున్నాడు, వాళ్లు ఆరోగ్య కేంద్రంకి ఎందుకు వచ్చారో తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదని అతను చెప్పాడు. "మేము వాళ్ళకి తరువాత చెబుతాము," అని అతను చెప్పాడు. “మేము ముగ్గురు పిల్లలను పెంచాలి; మరొకరిని భరించలేము."
కమల చిన్న వయస్సులోనే అనాథ అయ్యింది, ఆమె బాబాయి ఆమెను పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసాడు. పెళ్లికి ముందు ఆమె తన భర్తను చూడలేదు. “నా మొదటి రుతుస్రావం అయిన వెంటనే నాకు పెళ్లయింది. మా సంఘంలో అలాగే జరుగుతుంది. పెళ్లిలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నా పీరియడ్ గురించి, మా పిన్ని కేవలం ‘డేట్ ఆయేగా’ [‘తేదీ’ లేదా పీరియడ్ వస్తుంది] అని మాత్రమే చెప్పింది. నేనెప్పుడూ బడికి వెళ్లలేదు, నాకు చదవడం రాదు, కానీ నా ముగ్గురు పిల్లలూ బడికి వెళ్తున్నారు,” అని ఆమె గర్వంగా చెప్పింది.
కమల ట్యూబల్ లైగేషన్ (స్టెరిలైజేషన్) ప్రక్రియ కోసం కొన్ని నెలల తర్వాత PHCకి తిరిగి రావాలని అనుకుంటోంది. ఆమె భర్త వేసెక్టమీకి అంగీకరించడు, ఎందుకంటే అది అతని మగతనానికి నష్టం కలిగిస్తుందని అతని నమ్మకం. కమలా గర్భనిరోధకం, స్టెరిలైజేషన్ వంటి కాన్సెప్ట్‌ల గురించి ఇప్పుడే విన్నది, కానీ ఆమె అన్నింటినీ త్వరగా గ్రహించింది. "నేను మళ్ళీ మళ్ళీ గర్భం ధరించకుండా ఉండాలంటే, ఇది ఒక పధ్ధతి అని డాక్టర్ నాకు చెప్పారు" అని ఆమె చెప్పింది. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి కమల తనకి 30 సంవత్సరాల మధ్యలో, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత, శస్త్రచికిత్స ద్వారా ఆమె పునరుత్పత్తి చక్రం పూర్తిగా ఆగిపోతుంది అన్న సమయంలో తెలుసుకోవడం మొదలుపెట్టింది.
ఈ కథనానికి మద్దతు, సహాయం అందించినందుకు భూపేష్ తివారీ, అవినాష్
అవస్థి, విదుషి కౌశిక్‌లకు రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected]కి మెయిల్ చేసి [email protected] కి కాపీ చేయండి.
అనువాదం: దీప్తి సిర్ల