అక్కడ రేగుతోన్న చిన్న దుమ్ము మేఘం, ఇంజిన్ చేసే ఫట్-ఫుట్ ధ్వని: నీలిరంగు చీర, ముక్కుకు వెడల్పాటి ముక్కుబేసరి ధరించిన అడైక్కలసెల్వి, విశాలమైన చిరునవ్వుతో బైక్‌పై వస్తున్నారు. అంతకు కొన్ని నిమిషాల ముందు, తన మిరప చేనులో ఉన్న ఆమె, తాళం వేసి ఉన్న తన ఇంటి బయట వేచి ఉండమని మమ్మల్ని ఆదేశించారు. ఇప్పుడు మిట్టమధ్యాహ్నం, ఇంకా మార్చి నెలలోనే ఉన్నాం, కానీ రామనాథపురం ఎండలు మాత్రం చాలా ఉగ్రంగా ఉన్నాయి. మా నీడలు చిన్నవైపోయాయి, అయితే మా దాహం మాత్రం చాలా పెద్దది. జామ చెట్టు చక్కని నీడలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి, త్వరత్వరగా ముందు తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు అడైక్కలసెల్వి. చర్చి గంట మోగుతోంది. ఆమె మాకు తాగేందుకు నీళ్ళు తెచ్చి ఇచ్చారు. మేం ఆమెతో ముచ్చటించటం కోసం కూర్చున్నాం.
ముందుగా మేం ఆమె బైక్‌తో ప్రారంభించాం. ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన ఆమె వంటి నడివయస్సు మహిళ, బైక్‌ను నడపడం అంటే అంత మామూలు విషయమేమీ కాదు. "అయితే ఇది చాలా ఉపయోగపడతా ఉంది," అంటూ 51 ఏళ్ల వయసున్న ఆమె నవ్వారు. ఆమె దాన్ని నడపడాన్ని చాలా త్వరగా నేర్చుకున్నారు. “నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా అన్నయ్య నాకు నేర్పించాడు. నాకు సైకిల్ తొక్కడం వచ్చు, కాబట్టి ఇది కష్టం కాలేదు."
ఈ రెండు చక్రాల వాహనం లేకపోయుంటే జీవితం మరింత కష్టతరంగా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. “నా భర్త చాలా సంవత్సరాలుగా ఇంటికి దూరంగా ఉన్నాడు. అతను మొదట సింగపూర్‌లోనూ, ఆపైన దుబాయ్, ఖతర్‌లలోనూ ప్లంబర్‌గా పనిచేశాడు. నేను నా కూతుళ్లను ఒంటిచేత్తో పెంచి పోషించటంతో పాటు, వ్యవసాయం కూడా చేస్తున్నాను."
జె. అడైక్కలసెల్వి ఎప్పటినుంచో రైతుగా ఉన్నారు. బాసింపట్టు వేసుకుని, ఒక్కో చేతికి ఒక్కో గాజు ఉన్న చేతుల్ని మోకాళ్లపై ఆనించి, నేలపై కూర్చునివున్న ఆమె వెన్ను భాగం నిటారుగా ఉంది. ఆమె శివగంగై జిల్లాలోని కాళైయార్‌కోవిల్‌లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ముదుకుళత్తూరు బ్లాక్‌లోని ఆమె కుగ్రామం పి. ముత్తువిజయపురం రోడ్డు మార్గం నుండి గంటన్నర దూరంలో ఉంటుంది. "నా సోదరులు శివగంగైలో ఉంటున్నారు. అక్కడ వారికి చాలా బోరుబావులు ఉన్నాయి. నేనిక్కడ వ్యవసాయం కోసం నీటిని గంటకు 50 రూపాయల లెక్కన కొంటాను. రామనాథపురంలో నీటిది పెద్ద వ్యాపారం."




























