ఫుల్వతియా తన వంతు కోసం ఎదురు చూస్తుండగా ఆమె తమ్ముడైన పన్నెండేళ్ల శంకర్ లాల్ ఉల్లాసంగా సైకిల్ తొక్కుకుంటూ దగ్గరే ఉన్న వేప చెట్టు వరకు వెళ్ళాడు. “ఈరోజు నేనొక్కదాన్నే చక్కర్లు కొట్టి త్వరగా వచ్చేస్తాను”, ఆ పదహారేళ్ళ అమ్మాయి అంది. “రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఎలాగూ సైకిల్ తొక్కలేను. బట్ట వాడుతున్నప్పుడు అలా చేయడం ఇబ్బందిగా ఉంటుంది”, రోడ్డు పక్కన ఓ కుక్కపిల్లని నిమురుతూ చెప్పింది.
ఫుల్వతియా (పేరు మార్చబడింది) రేపు తన ఋతుక్రమం మొదలవ్వచ్చని అనుకుంటుంది. కానీ ఈసారి -ఇంతకు మునుపు నెలల లాగ- తనకి బడి నుంచి ఫ్రీగా సానిటరీ నాప్కిన్లు అందవు. “సాధారణంగా మాకు నెలసరి మొదలయ్యాక ప్యాడ్లు అందుతాయి. కానీ ఇప్పుడు ఏదైనా బట్ట దొరికితే అదే వాడతా.”
ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలోని తన బడి, దేశంలో మిగతా బడులలాగే,కోవిడ్19 లాక్డౌన్ వల్ల మూసేసి ఉంది.
ఫుల్వతియా తన తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ముళ్లతో కర్వి తెహసిల్ లోని తరౌహా గ్రామంలో సోనీపూర్ అనే తండాలో ఉంటుంది. ఆమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళిద్దరికి పెళ్లై వేరే చోట ఉంటున్నారు. తను పదవ తరగతి పరీక్షలు రాసి పది రోజుల విరామం తర్వాత తిరిగి బడికి వెళ్లాల్సిన సమయంలో, మార్చి24న, లాక్డౌన్ ప్రకటించారు. తను కర్వి బ్లాక్ లోని రాజకీయ బాలిక ఇంటర్ కాలేజీలో చదువుతోంది.
“వేరే దేనికీ వాడని ఒక బట్ట ముక్క కోసం వెతుకుతాను- అదే వాడతాను. రెండోసారి వాడే ముందు దాన్ని ఉతుకుతాను,” అంటుంది ఫుల్వతియా. ముదురు ఛాయ ఉన్న ఆమె పాదాల కాలివేళ్లని అలంకరించిన రాణీ రంగు గోళ్ళ పెయింట్ పై -చెప్పులు లేకుండా నడవడం వల్ల కాబోలు- రేగిన దుమ్ము అంటుకొని ఉంది.








