అది ఆగష్టు 11. పనామిక్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వద్ద, వందమంది పైన గుమిగూడి, కోవిడ్ మొదటి డోసు వాక్సినేషన్ కోసం ఎదురుచూడడడం నేను చూశాను. ఇది దేశంలోని వేల సెంటర్ల వద్ద గుమిగూడిన దృశ్యంతో సమానమా? కాదు. సముద్రపు మట్టం నుండి 19,091 అడుగుల ఎత్తున్న అతి ఎత్తైన ప్రదేశాల జాబితాలో లేహ్ లోని పనామిక్ బ్లాక్ కూడా ఉంది. ఆ బ్లాక్ లోని అదే పేరున్న ప్రధాన గ్రామం కూడా, కొన్నివేల అడుగుల కింద ఉంది. కానీ 11,000 అడుగుల ఎత్తున్న ఈ PHC మాత్రం, దేశంలో ఉన్న అన్ని వాక్సినేషన్ సెంటర్లు అన్నింటిలోనూ ఎత్తైన ప్రదేశంలో ఉంది.
ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో, అసలు వాక్సిన్లను ఇంత ఎత్తైన ప్రదేశాల వరకు చేర్చడమే పెద్ద ప్రహసనం. పైగా కొన్ని మారుమూల ప్రదేశాలకు సరైన రహదారులు ఉండవు, కాబట్టి ఇక్కడ పని మామూలుకన్నా ఇంకా చాలా కష్టం.
కానీ ఈ సెంటర్లో దీని అసాధారణమైన ఎత్తు కన్నా ప్రత్యేకమైన మరొక విషయం ఉంది. అది అసాధారణమైన ఆలోచనాధోరణి అనవచ్చేమో. సియాచిన్ గ్లేసియర్ కి దగ్గరగా, లేహ్ లో ఉండే ఈ PHC, ఒకేరోజులో 250 ఆర్మీలో పనిచేసేవారికి మొదటి డోసు వాక్సినేషన్ ఇవ్వగలిగింది. అది కూడా సరిగ్గా పని చెయ్యని ఇంటర్నెట్ కనెక్షన్ తో, చాలా ఘోరమైన కమ్యూనికేషన్ సౌకర్యాలతో ఉన్న పనామిక్ లోని ఈ PHC, లడఖ్ లో ఉన్న వేరే కొన్ని సెంటర్ల లాగానే, వాక్సినేషన్ ని చాలా విజయవంతంగా నిర్వహించింది.
కానీ వారు ఇంటర్నెట్ కూడా లేకుండా, లేహ్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరం ఉంటూ ఎలా నిర్వహించారు? అక్కడి కోల్డ్ చైన్ హాండ్లర్, ట్సేరింగ్ అంచోక్, అది చాలా సరళమైన విషయమే అన్నట్టుగా, “అది చాలా తేలిక! మేము ఓపికగా పనిచేశాము. చాలా గంటలు పని చేయవలసి వచ్చినా, మా పని సరిగ్గా జరిగింది.” దీని అర్థం ఇక్కడి వారంతా సరైన ఇంటర్నెట్ కనెక్షన్లు లేకపోవడం వలన వేరే ప్రదేశాలలో నిముషాల్లో జరిగే పనిని, ఇక్కడ గంటల తరబడి చేయవలసి వచ్చింది. ఇదేగాక వాక్సినేషన్ కి ఇంకా ఎక్కువ గంటలు పట్టింది.























