మీడియా ఒప్పుకోలేకపోయింది ఏమిటంటే, ప్రపంచం ఇప్పటిదాకా చూసిన వాటిలో, ఇది అత్యంత పెద్దదైన ప్రజాస్వామిక నిరసన - ఖచ్చితంగా ఈ మహారోగం నడుమన గొప్పగా నిర్వహించబడినది- ఇది బలమైన విజయం.
ఈ విజయం ఒక వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళుతుంది. అన్ని రకాల రైతులు, ఆడవారు, మగవారు - ఇందులో ఆదివాసీ, దళిత వర్గాలు కూడా ఉన్నాయి- ఈ దేశపు స్వేచ్చా పోరాటంలో కీలక పాత్రను వహించారు. మన దేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం జరుపుకుంటుండగా, ఢిల్లీ దగ్గర ఉన్న రైతులు అప్పటి గొప్ప పోరాటస్ఫూర్తిని తిరిగి పొందారు.
ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఎంత ప్రయత్నించినా ఒక వర్గం రైతులను ఒప్పించడంలో విఫలమైన’ తర్వాత తాను అలా చేస్తున్నానని చెప్పారు. కేవలం ఒక విభాగాన్ని మాత్రమే, గుర్తుంచుకోండి, మూడు అపఖ్యాతి పాలైన వ్యవసాయ చట్టాలు వారికి నిజంగా మంచివని అతను అంగీకరింపజేయలేకపోయారు. ఈ చారిత్రాత్మక పోరాటంలో మరణించిన 600 మందికి పైగా రైతుల గురించి ఆయన ఒక్క మాట కూడా లేదు. అతని వైఫల్యం, ఒప్పించే నైపుణ్యంలో మాత్రమే ఉందని, ఆ 'రైతుల విభాగాని’కి రానున్నలాభం అర్థంచేయించడం కాదని చెప్పకనే చెప్పారు. నిజమే, ఈ వైఫల్యం ప్రతిపాదించిన చట్టాలది కాదు, ఈ మహారోగం నడుమ దానిని రైతుల పై రుద్దడానికి ప్రయత్నించిన ప్రభుత్వానిది కాదు.
సరే, ఖలిస్తానీలు, దేశ వ్యతిరేకులు, రైతులుగా ముసుగు వేసుకున్న బూటకపు కార్యకర్తలు, మిస్టర్ మోడీ యొక్క చిలిపి చేష్టలను ఒప్పుకోవడానికి నిరాకరించిన 'రైతులలో ఒక విభాగం'గా పట్టభద్రులయ్యారు. ఒప్పించేందుకు నిరాకరించారా? ఒప్పించే విధానానికి పద్ధతి ఏమిటి? వారి వేదనలను వివరించడానికి వచ్చినప్పుడు వారికి రాజధాని నగర ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారానా? కందకాలు,ముళ్ల తీగలతో వారిని అడ్డుకోవడం ద్వారానా? నీటి ఫిరంగులతో కొట్టడం ద్వారానా? వారి శిబిరాలను చిన్నగులాగ్లగా మార్చడం ద్వారానా? కుటిల మీడియా రైతులను రోజూ దూషించడం ద్వారానా? యూనియన్ మినిస్టర్ లేక ఆయన కుమారుడు ఈ ప్రత్యేక విభాగాల పై వాహనాలు నడపడం ద్వారానా? ఈ ప్రభుత్వానికి ‘ఒప్పించడం’ అంటే తెలిసిన అర్థం ఇదేనా? ఇవి ఆయన ‘ఉత్తమ ప్రయత్నా’లంటే, ఇక దుర్భర ప్రయత్నాలు ఎలాంటివో చూసే ఉద్దేశం ఎవరికీ లేదు.
ప్రధాన మంత్రి ఈ ఏడాది కనీసం ఏడుసార్లు మన దేశం దాటి ప్రయాణించారు(ఇటీవల CoP26 కోసం ప్రయాణించినట్లుగా). కాని ఒక్కసారి కూడా ఆయన తన ఇంటి నుండి కొద్ధి కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ గేట్ల వద్ద ఉన్న పదుల వేల రైతులను కలవడానికి కుదరలేదు. ఈ రైతుల బాధ దేశంలో ఉన్న ఎందరో మనుషులను తాకింది కానీ ఈయనను తాకలేదు. ఒప్పించడానికి వారిని కలవడం ఒక నిజాయితీ గల ప్రయత్నం అయుండకపోయేదా?
ప్రస్తుత నిరసనలు ప్రారంభమైన మొదటి నెల నుండి, మీడియా, ఇంకా ఇతరులు - వారు ఎంతకాలం పోరాడగలరు అనే ప్రశ్నలతో నాపై విరుచుకుపడ్డారు. ఈ ప్రశ్నకు రైతులు సమాధానమిచ్చారు. అయితే ఈ అద్భుత విజయం వారి తొలి అడుగు మాత్రమే అని కూడా తెలుసు. రద్దు చేయడం అంటే ప్రస్తుతానికి సాగుదారుల మెడ మీద అడుగు వేయబోయిన కార్పొరేట్ కాలును అక్కడ నుండి తీసివేయడమే - కానీ MSP, సేకరణ వంటి ఇంకా కొన్ని ఆర్ధిక విధానాలకు సంబంధించిన చాలా పెద్ద సమస్యలకు, ఇప్పటికీ పరిష్కారం కావలసి ఉంది.
టివి లోని యాంకర్లు - అదేదో కొత్తగా తెలిసినట్లు- ఈ ప్రభుత్వం అలా వెనక అడుగేయడానికి వచ్చే ఫిబ్రవరికి ఐదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో ఏమన్నా సంబంధం ఉందేమోననే సందేహాన్ని మన ముందు వ్యక్తం చేస్తారు.
ఇదే మీడియా, నవంబర్ 3న ప్రకటించిన 29వ అసెంబ్లీ, 3వ పార్లమెంటరీ నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాల ప్రాముఖ్యత గురించి మనకు ఏమీ చెప్పలేకపోయింది. ఆ సమయంలో వచ్చిన సంపాదకీయాలను చదవండి - టెలివిజన్‌లో విశ్లేషణ కోసం ఆమోదించిన వాటిని చూడండి. వారు అధికార పార్టీలు సాధారణంగా ఉపఎన్నికల్లో గెలుపొందడం గురించి, స్థానికంగా చెలరేగిన కోపాల గురించి- ఇది బిజెపి తోనే కాదు, మరికొన్ని పార్టీల గురించి కూడా- మాట్లాడారు. కొన్ని సంపాదకీయాలు ఆ పోల్ ఫలితాలను ప్రభావితం చేసిన రెండు కారకాల గురించి చెప్పడానికి సిద్ధపడ్డాయి. ఇంతకీ ఆ రెండు కారకాలు - రైతుల నిరసనలు, కోవిడ్-19 దుర్వినియోగం.
ఈ రోజు మోదీగారి ప్రకటనతో ఆయన కనీసం ఇప్పటికైనా, ఈ విషయాలకున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకున్నట్లే ఉంది. రైతుల ఆందోళనలు తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కొన్నిఘోర పరాజయాలు జరిగాయని ఆయనకు తెలుసు. ఇందులో రాజస్థాన్, హిమాచల్ వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ మీడియా, ఇది మొత్తం పంజాబ్, హర్యాణా రాష్ట్రాలు మాత్రమే చేశాయని వారి ప్రేక్షకులకు, చిలుకకు చెప్పినట్లుగా పదేపదే చెప్పారు.
రాజస్థాన్‌లోని రెండు నియోజకవర్గాల్లో బిజెపి లేదా ఏదైనా సంఘ్ పరివార్ సంస్థ మూడవ లేదా నాల్గవ స్థానంలో రావడం చివరిగా మనం ఎప్పుడు చూశాము? లేక వీరు హిమాచల్‌లో మూడు అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటును కోల్పోయిన చోట తమకు లభించిన ఆతిధ్యాన్ని అందుకుంటారా?
హర్యాణాలో, నిరసనకారులు చెప్పినట్లు, "ముఖ్యమంత్రి నుండి ఉప ముఖ్యమంత్రి వరకు మొత్తం ప్రభుత్వం" అక్కడ BJP కోసం ప్రచారం చేస్తోంది; రైతుల సమస్యలపై రాజీనామా చేసిన అభయ్ చౌతాలా పై కాంగ్రెస్ మూర్ఖంగా అభ్యర్థిని నిలబెట్టింది; కేంద్ర మంత్రులు గొప్ప బలంతో రంగంలోకి దిగినా - బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి తన డిపాజిట్ కోల్పోయినాగాని, చౌతాలాతో బాగా పోటీపడి, 6,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచాడు.
రైతుల నిరసనల ప్రభావాన్ని మూడు రాష్ట్రాలు అనుభవించాయి. ఈ విషయాన్ని కార్పొరేట్ల కన్నా బాగా, ప్రధానమంత్రి అర్థం చేసుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆ నిరసనల ప్రభావంతో, లఖింపూర్ ఖేరీలో జరిగిన భయంకరమైన హత్యల వలన స్వయంగా నష్టపోయాక, బహుశా ఇప్పటి నుండి 90 రోజుల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున, ఆయన సత్యాన్ని చూడగలిగారు.
ప్రతిపక్షాలకు ప్రశ్నించాలనే ఆలోచన ఒకవేళ ఉంటే, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ఏమైనా జరిగిందా అనే ప్రశ్నకు, ఈ మూడు నెలల వ్యవధిలో, బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది. NSS (నేషనల్ శాంపిల్ సర్వే, 2018-19) యొక్క 77వ రౌండ్ రైతులకు పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గుదలని చూపుతుంది – మొత్తంగా రైతు ఆదాయాలు రెట్టింపు కావడమనే విషయాన్ని వదిలేయండి. ఇది పంటల సాగు ద్వారా వచ్చే నిజమైన ఆదాయంలో సంపూర్ణ క్షీణత ను చూపుతుంది.
ఇది వ్యవసాయ సంక్షోభానికి అంతం కాదు. ఈ సంక్షోభం, పెద్ద సమస్యలపై జరిపే యుద్ధంలో కొత్త శకానికి ప్రారంభం
నిజానికి రైతులు చట్టాలను రద్దు చేయాలనే దృఢమైన డిమాండ్‌ను సాధించడం కన్నా ఇంకా చాలా ఎక్కువే సాధించారు. వారి పోరాటం దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాని 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ బాధలైతే వారికుండేవో, అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
ఇది వ్యవసాయ సంక్షోభానికి అంతం కాదు. ఆ సంక్షోభం తీసుకొచ్చిన పెద్ద సమస్యలపై జరిగే యుద్ధంలో కొత్త శకానికి ఇది ప్రారంభం. రైతుల నిరసనలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2018 నుండి అవి ఇంకా బలపడ్డాయి. మహారాష్ట్రలోని ఆదివాసీ రైతులు నాసిక్ నుండి ముంబయి వరకు 182-కిమీల కాలినడకన, అందరిని ఆశ్చర్యపరిచే విధంగా దేశాన్ని విద్యుద్దీకరించారు. అప్పుడు కూడా వారిని 'అర్బన్ నక్సల్స్' అని, నిజమైన రైతులు కాదని, కొట్టిపారేయదానికి ప్రయత్నించారు. వారి కవాతు, వారిని దుర్భాషలాడేవారి దారిని మళ్లించింది.
నేడు ఇక్కడ అనేక విజయాలు ఉన్నాయి. కార్పోరేట్ మీడియాపై రైతుల గెలుపు చిన్నదేమీ కాదు. వ్యవసాయ సమస్యపై (అనేక ఇతర విషయాలలో), ఆ మీడియా అదనపు శక్తి AAA (Amplifying Ambani Adani +) బ్యాటరీలుగా పనిచేసింది.
డిసెంబరు నుండి వచ్చే ఏప్రిల్ మధ్య, రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన రెండు గొప్ప పత్రికలు, 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాయి. ఇది నిజమైన భారతీయ (యాజమాన్యం, సహానుభూతి) ప్రెస్‌కి నాంది అని చెప్పవచ్చు. అందులో ఒకటి - మిరాత్-ఉల్-అఖ్బర్ - కొమిల్లాలో (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉంది) ప్రతాప్ నారాయణ్ దాస్ పై ఒక న్యాయమూర్తి ఆదేశించిన కొరడా దెబ్బను, హత్యగా మార్చిన అంగ్రేజీ పరిపాలనను అద్భుతంగా బట్టబయలు చేసింది. రాయ్ యొక్క శక్తివంతమైన సంపాదకీయం ఫలితంగా ఆ న్యాయమూర్తిని, అప్పటి అత్యున్నత న్యాయస్థానం విచారించింది
దీనిపై గవర్నర్ జనరల్ పత్రికలను భయభ్రాంతులకు గురిచేసేలా స్పందించాడు. క్రూరమైన కొత్త ప్రెస్ ఆర్డినెన్స్‌ని ప్రకటించి, వారిని లొంగదీయడానికి ప్రయత్నించాడు. ఇందుకు నిరాకరించిన రాయ్, కించపరిచే అవమానకరమైన చట్టాలకు, పరిస్థితులకు లొంగిపోయే బదులు మిరాత్-ఉల్-అఖ్బర్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. (కాని అతని పోరాటస్ఫూర్తిని ఇతర పత్రికల ద్వారా ముందుకు తీసుకువెళ్లాడు!)
అది ధైర్యంతో చేసిన జర్నలిజం. వ్యవసాయ సమస్యపై మనం చూసిన కుటిల ధైర్యపు లొంగిపోయే జర్నలిజం కాదు. సంతకం చేయని సంపాదకీయాల్లో రైతుల పట్ల 'ఆందోళన' వ్యక్తం చేసి, మళ్లీ ఆప్-ఎడ్ పేజీలలో సంపన్న రైతులు 'ధనవంతుల కోసం సోషలిజాన్ని కోరుతున్నారు' అంటూ నిందించే జర్నలిజం కాదు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ , టైమ్స్ ఆఫ్ ఇండియా , దాదాపు అన్ని వార్తాపత్రికలు - వీరంతా గ్రామీణ దండు కాబట్టి వీరితో తీయగా మాట్లాడాలి అని చెప్పాయి. ఈ సవరణలు అప్పీల్‌పై కూడా చేరాయి: అయితే ఈ చట్టాలను ఉపసంహరించుకోవద్దు, అవి నిజంగా మంచివి అనే చెప్పాయి. ఇక మిగిలిన మీడియా చాలా వరకు ఇదే పని చేశాయి.
ముఖేష్ అంబానీ వ్యక్తిగత సంపద 84.5 బిలియన్ డాలర్లు (ఫోర్బ్స్ 2021) పంజాబ్ రాష్ట్ర GSDP (సుమారు 85.5 బిలియన్లు)కు సరిసమానంగా త్వరలోనే చేరుతుందని - రైతులు, కార్పొరేట్ల మధ్య జరిగే ఈ పోరాటంలో, మీడియా ఏ ప్రచురణలలోనైనా వారి పాఠకులకు చెప్పిందా? అంబానీ, అదానీల సంపద (50.5 బిలియన్ డాలర్లు) కలిసి పంజాబ్ లేదా హర్యాణా GSDP కంటే ఎక్కువగా ఉందని వారు ఒకసారైనా చెప్పారా?
నిజమే, విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో మీడియాకు అంబానీ అతిపెద్ద యజమాని. అతను స్వంతం చేసుకోని ఆ మీడియాలో, బహుశా అతనే ఒక గొప్ప ప్రకటనదారు. ఈ ఇద్దరు కార్పొరేట్ బారన్ల సంపద గురించి తరచుగా వ్రాస్తారు, కాని వేడుక స్వరంలో. ఇది కార్పో-క్రాల్ జర్నలిజం.
ఈ కుటిల వ్యూహం - వెనక్కు తగ్గడం - పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందనే దానిపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మోదీతో చర్చలు జరపడం ద్వారా ఇది తాను సాధించిన విజయంగా అమరీందర్ సింగ్ చెప్పుకుంటున్నారు. ఇది అక్కడి ఎన్నికల పరిస్థితిని మారుస్తుంది అని కూడా అన్నారు.
అయితే ఆ పోరాటంలో పాల్గొన్న ఆ రాష్ట్రంలోని లక్షలాది మందికి అది ఎవరి విజయమో తెలుసు. ఢిల్లీలో, దశాబ్దాలలో రానంత అత్యంత దారుణమైన శీతాకాలాన్ని, మండుతున్న వేసవిని, ఆ తర్వాత వర్షాలను, మిస్టర్ మోడీ మరియు ఆయన బందీ మీడియా నుండి దుర్భరమైన ప్రవర్తనను, భరించిన నిరసన శిబిరాల్లో ఉన్నవారితో పంజాబ్ ప్రజల హృదయాలు నిండి ఉన్నాయి.
బహుశా నిరసనకారులు సాధించిన అతి ముఖ్యమైన విషయం ఇది: కేవలం తన వ్యతిరేకులను జైలులో లేదా వేటగాళ్లతో వేధింపులకు గురిచేసే ప్రభుత్వాన్నిప్రతిఘటించడానికి స్ఫూర్తినివ్వడం. ఈ ప్రభుత్వం, UAPA కింద జర్నలిస్టులతో సహా పౌరులను స్వేచ్ఛగా అరెస్టు చేస్తుంది, 'ఆర్థిక నేరాల' కోసం స్వతంత్ర మీడియాపై విరుచుకుపడుతుంది. ఈ రోజు విజయం కేవలం రైతులకు మాత్రమే కాదు. ఇది పౌర హక్కులు, మానవ హక్కుల కొరకు జరిగిన పోరాట విజయం. భారత ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం.
అనువాదం: అపర్ణ తోట