వారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళైన తరవాత, ఈసారి దేశ రైతులు, రైతు కూలీల కోసం మళ్లీ పోరాడుతున్నారు .
ప్రస్తుతం 91 ఏళ్ళ వయసు ఉన్న హౌషాబాయి , తూఫాన్ సేన(తుఫాను లేదా సుడిగాలి సైన్యం) లో సభ్యురాలు. తూఫాన్ సేన, మహారాష్ట్ర లోని సతారా ప్రాంతంలో 1943లో బ్రిటిష్ వారిపై స్వతంత్రం వ్యక్తపరచిన అప్పటి ప్రతి సర్కార్ (తాత్కాలిక అండర్ గ్రౌండ్ ప్రభుత్వం) యొక్క సాయుధ దళం. 1943 నుండి 1946 మధ్యలో, ఆమె బ్రిటిష్ వారి రైళ్లను, వారి ఖజానాను, తపాలా కార్యాలయాలను దాడి చేసిన విప్లవకారుల బృందాలలో భాగంగా పనిచేసింది.
కెప్టెన్ భావు (మరాఠి భాషలో భావు అంటే పెద్దన్నయ్య)గా ప్రసిద్ధుడైన రామచంద్ర శ్రీపతి లాడ్, తూఫాన్ సేనకు ఫీల్డ్ మార్షల్ గా పనిచేసాడు.1943 లో జూన్ 7న, బ్రిటిష్ సామ్రాజ్య అధికారులకు జీతం తీసుకు వెళ్తున్న పూణే-మిరాజ్ ట్రైన్ పై లాడ్, ఒక మరపురాని దాడి చేశాడు.
సెప్టెంబర్ 2016లో మేము ఆయనని కలిసినప్పుడు,లాడ్ కి 94 ఏళ్ళు. ఆయన “డబ్బులు ఏ ఒక్కరి జేబులోకి వెళ్ళలేదు, ప్రతి సర్కార్ కి వెళ్లాయి. అంతేగాక ఆ డబ్బులు మేము పేదవారికి, అవసరమున్నవారికి పంచేశాము.” అని చెప్పాడు.
2018 నవంబర్ నెల 29, 30న ఢిల్లీలో జరిగిన కిసాన్ ముక్తి మార్చ్ లో, కెప్టెన్ భావు, హౌషాబాయి రైతులకు మద్దతునిచ్చి, వారు డిమాండ్ చేసిన 21 రోజుల పార్లమెంట్ సెషన్ ని రైతుల సంక్షోభం పై నిర్వహించాలని కోరారు.
ఈ వీడియోలలో కెప్టెన్ భావు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు మనము ఎంతో సిగ్గుపడాలి అంటున్నారు. హౌషబాయి, ప్రభుత్వం రైతుల పంటలకు మెరుగైన ధరలు అందించాలని, పేదలకోసం పనిచేయాలని చెప్పారు.
అనువాదం: అపర్ణ తోట