"పాప తన అమ్మని తీసుకురమ్మని గంటలు గంటలు ఏడుస్తుంది" అని తన ఏడేళ్ల కుమార్తె నవ్య తండ్రి శిశుపాల్ నిషాద్ చెప్పారు. “అయితే నేను ఆమెను ఎక్కడ నుండి తీసుకు వస్తాను? నాకు మతిపోతుంది. మేము వారాల తరబడి నిద్రపోలేదు ”, అన్నాడు ఈ ఉత్తర ప్రదేశ్‌లోని సింగ్టౌలి గ్రామానికి చెందిన ఈ 38 ఏళ్ల కార్మికుడు.
శిశుపాల్ భార్య మంజు - నవ్య తల్లి - జలాన్ జిల్లాలోని కుతాండ్ బ్లాక్‌లోని సింగ్టౌలి ప్రాథమిక పాఠశాలలో ‘శిక్షా మిత్రా’ లేదా పారా టీచర్ గా పనిచేస్తోంది. యుపి పంచాయతీ ఎన్నికలలో తప్పనిసరి విధి తరువాత కోవిడ్ -19 తో మరణించిన 1,621 పాఠశాల ఉపాధ్యాయుల జాబితాలో ఆమె నంబరు 1,282. కానీ ఆమె ఐదుగురు కుటుంబ సభ్యుల జీవితాలలో మాత్రం మంజు నిషాద్, ఒక సంఖ్య కంటే చాలా ఎక్కువ.
ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. కుటుంబంలో ఆమెది ఒక్కటే సంపాదన. అది కేవలం నెలకు రూ. 10,000. కాంట్రాక్టుపై పనిచేసే, పదవీకాల భద్రత లేని శిక్షా మిత్రాకు చెల్లించే దారుణమైన మొత్తం ఇది. 19 సంవత్సరాలు అదే పదవి లో పనిచేసిన మంజు లాంటి వారికి టీచరు పనిచేసినా కానీ, టీచరుకు సహాయకురాలిగానే (లేదా ఉపాధ్యాయుల సహాయకురాలిగానే) వర్గీకరించబడుతుంది.
శిశుపాల్ కూలీగా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నాడు.“నేను పనిచేస్తున్న ఎక్స్‌ప్రెస్‌వే దశ రెండు నెలల క్రితం పూర్తయింది. సమీపంలో వేరే నిర్మాణ పనులు ఏమి జరగలేదు. గత కొన్ని నెలలుగా నా భార్య ఆదాయం పైనే కుటుంబాన్ని నడుపుకొస్తున్నాము.” అని చెప్పాడు
ఏప్రిల్ 15, 19, 26 మరియు 29 తేదీలలో జరిగిన యుపి యొక్క నాలుగు-దశల పంచాయతీ ఎన్నికలలో వేలాది మంది ఉపాధ్యాయులకు ఎన్నికల విధిని కేటాయించారు. ఉపాధ్యాయులు మొదట ఒక రోజు శిక్షణ కోసం వెళ్లారు, తరువాత రెండు రోజుల పోలింగ్ పని కోసం. ఈ రెండు రోజులలో, ఒక రోజు తయారీ పని అయితే రెండవది ఓటింగ్ రోజు జరిగే పని. తరువాత మే 2 న ఓట్లను లెక్కించడానికి వేలాది మంది రిపోర్ట్ చేయవలసి వచ్చింది. ఈ పనులను నెరవేర్చడం తప్పనిసరి. అంతేగాక, ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులు విస్మరించబడ్డాయి.
యుపి శిక్షక్ మహాసంగ్ (టీచర్స్ ఫెడరేషన్) రూపొందించిన జాబితాలో - మరణించిన 1,621 ఉపాధ్యాయులలో 193 శిక్షా మిత్రాలు ఉన్నారు -. వీరిలో మంజుతో సహా 72 మంది మహిళలు ఉన్నారు. అయితే, మే 18 న, యుపి ప్రాథమిక విద్యా శాఖ విడుదల చేసిన ఒక పత్రికా నోట్లో, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఉద్యోగంలో మరణించిన వారికి మాత్రమే ఏదైనా పరిహారం లభిస్తుంది. ఉపాధ్యాయుల విషయంలో, ఇది వారి విధి నిర్వహించే స్థలం వద్ద లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మరణించిన వారిని మాత్రమే సూచిస్తుంది. పత్రికా నోట్ చెప్పినట్లుగా: "ఈ కాలంలో ఒక వ్యక్తి ఏదైనా కారణంతో మరణిస్తే పరిహారం చెల్లించాలి, అది రాష్ట్ర ఎన్నికల సంఘం మంజూరు చేస్తుంది."








