సీతాపూర్ లో ఆక్సిజన్ మీద ఉండి మృత్యువు తో పోరాడుతున్నప్పుడు కూడా, రితేష్ మిశ్ర ఫోన్ మోగుతూనే ఉంది. ఆ ఫోన్ లు అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి, గవర్నమెంట్ అధికారుల దగ్గర్నుంచి వస్తున్నాయి. ఈ నీరసంగా పడి ఉన్న స్కూల్ టీచర్ ను మే 2వ తేదీ కల్లా డ్యూటీ లో జాయిన్ అవమని చెప్తున్నాయి. ఆ రోజు ఉత్తరప్రదేశ్ పంచాయత్ పోల్ ఎన్నికల కౌంటింగ్(లెక్కింపు) జరుగుతుంది.
“ఆ ఫోన్ మోగడం అసలు ఆగలేదు.” అన్నది అతని భార్య అపర్ణ. “నేను ఆ ఫోన్ తీసుకుని అవతల మనిషికి ఈయన హాస్పిటల్ లో ఉన్నారు కాబట్టి ఎన్నికల డ్యూటీ కి రాలేరు అని చెప్తే, రుజువు కోసం ఆయన హాస్పిటల్ లో ఉన్న ఫోటో పంపమని దబాయించారు. నేను పంపాను. ఉండండి, మీకు కూడా పంపుతాను” అని PARI తో అని, ఫోటోను పంపించింది.
ముప్పై నాలుగేళ్ల అపర్ణ మిశ్ర ఎక్కువగా మాట్లాడినదేంటంటే ఆమె తన భర్తను ఎన్నికల పని కి వెళ్ళొద్దని ఆమె చాలా గట్టిగా చెప్పింది. “నేను ఆయనని వెళ్ళొద్దని వారి డ్యూటీ రూస్టర్ రాగానే చెప్పాను.” అన్నది. “కానీ ఆయన ఎన్నికల పని కాన్సిల్ అయ్యేది కాదని పదేపదే చెప్పారు. పైగా వెళ్లకుంటే అధికారులు ఆయన మీద FIR ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుందని అన్నారు.” చెప్పింది అపర్ణ.
రితేష్ కోవిడ్ తో ఏప్రిల్ 29 న చనిపోయాడు. యూపీ ఎలక్షన్ లో పనిచేసిన ప్రతి 700 టీచర్లకు ఒకరు, ఇలానే చనిపోయారు. PARI వద్ద వారి పూర్తి జాబితా ఉంది. మొత్తం 713 మంది చనిపోయారు- 540 మగవారు, 173 ఆడవారు. ఈ జాబితా ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ రాష్ట్రం లో దగ్గరగా ఎనిమిది లక్షల మంది ప్రాధమిక పాఠశాల టీచర్లున్నారు. ఇందులో పదుల వేల మందిని పోల్ డ్యూటీ కి పంపారు.
రితేష్, ఒక సహాయక అధ్యాపకుడిగా(అసిస్టెంట్ టీచర్) తన కుటుంబం తో సీతాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటూ లక్నో గోసైగంజ్ బ్లాక్ లోని ప్రాధమిక పాఠశాలలో బోధించేవాడు. అతనిని పోలింగ్ పనికోసం దగ్గరలో ఉన్న ఊరిలో ని స్కూల్ లో- ఏప్రిల్ 15న , 19న, 26న, 29న, నాలుగు దశలుగా సాగే పంచాయత్ పోల్స్ లో డ్యూటీ వేశారు.












