ఉత్తర్ ప్రదేశ్ లో పంచాయతీ ఎలెక్షన్ కు తప్పనిసరి డ్యూటీ చేసిన ఉపాధ్యాయులలో, 1,621 మంది ఉపాధ్యాయులు కోవిడ్ - 19 వలన చనిపోయారు. ఇందులో 1,181 మగవారు, 440 మంది ఆడవారు ఉన్నారు. ఈ జాబితా శిక్షక్ మహాసంఘ్ అనే ఉపాధ్యాయ సంఘం, దాని అనుసంధానించిన ఇతరుల సంఘాలతో కలిసి రూపొందించబడినది. PARI వద్ద పూర్తి జాబితా హిందీ లోనూ ఇంగ్లీష్ లోనూ ఇక్కడ ఉంది.
మే 10 న, మేము ఒక కథనాన్నిప్రచురించాము - ఈ భాగాన్ని క్రింద చూడండి - ఈ మానవ నిర్మిత విపత్తు ఎలా జరిగిందో వివరంగా చదవవచ్చు. ఎన్నికలను వాయిదా వేయాలని ఉపాధ్యాయ సంఘాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఇసి) మరియు యుపి ప్రభుత్వం రెండూ విస్మరించాయి. ఆ సమయంలో, పోల్ డ్యూటీ చేసి, కోవిడ్ -19 వలన మరణించిన ఉపాధ్యాయుల సంఖ్య 713 - అందులో 540 మంది పురుషులు, 173 మహిళలు ఉన్నారు.
ఈ రాష్ట్రంలో దగ్గరగా 8 లక్షల ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నారు - వీరిలో పదివేల మంది పోల్ డ్యూటీ కోసం పంపబడ్డారు. ఇవి చాలా భారీగా జరిగే ఎన్నికలు. మొత్తంగా 1.3 లక్షల మంది అభ్యర్థులు 8 లక్షల సీట్లకోసం, 130 మిలియన్ల మంది అర్హతగల ఓటర్ల మధ్య పోటీపడ్డారు. అందుకే పోలింగ్ అధికారులు (ఉపాధ్యాయులు మరియు ఇతరులు) వేలాది మందితో సంభాషించవలసి వచ్చింది. కానీ ఎన్నికల కోసం అతి కొన్ని భద్రతా జాగ్రత్తలు మాత్రమే తీసుకోవడం జరిగింది.
యుపి పంచాయతీ ఎన్నికలు గతంలో వాయిదా వేయబడ్డాయి - ఉదాహరణకు, సెప్టెంబర్ 1994 నుండి 1995 ఏప్రిల్ వరకు. “మరి అటువంటప్పుడు ఈ మహమ్మారి తో పాటు జరిగే ఈ మానవ సంక్షోభం నడుమ ఈ ఆతురత ఎందుకు?” అని మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సతీష్ కుమార్ అగర్వాల్ అడిగారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికలు నిర్వహించడానికి పాఠశాల ఉపాధ్యాయుల ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. “ఢిల్లీలో ఏదైనా ఎన్నిక జరిగిందా? మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయా? ” అని మే 12 న నోయిడాలో ఆయన విలేకరులను అడిగారు. తమ బాధ్యతను అలహాబాద్ హైకోర్టు పైన వేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. సిఎం ఆదిత్యనాథ్ విలేకరులకు, "హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు జరిగాయి." అని చెప్పారు.
ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నపిటిషన్‌ను కోర్టు తిరస్కరించినమాట నిజమే. కానీ అది ఒక ప్రైవేట్ పిటిషన్, రాష్ట్రం దాఖలు చేసినది కాదు. (అసలైతే రాజ్యాంగ నిబంధన ప్రకారం, జనవరి 21, 2021 లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి అయి ఉండాలి). కానీ ఎన్నికలలో కోవిడ్ -19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా పాటించాలని కోర్టు ఆదేశించింది.
ఏప్రిల్ 6 న అలహాబాద్ హైకోర్టు రాష్ట్రం అన్ని భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉంటుందని నమ్ముతున్నదని, యుపి ప్రభుత్వం "ఎన్నికల ప్రచారంలో కట్టుబడి ఉండాలని ఒక ప్రోటోకాల్‌ను ఇప్పటికే ప్రకటించింది" అని అన్నారు. "పంచాయతీ రాజ్ ఎన్నికలు కూడా ప్రజలు గుమిగూడని విధంగా నిర్వహించాలని ఇది ఆదేశించింది. నామినేషన్ అయినా, క్యాన్వాసింగ్ అయినా లేదా అసలు ఓటింగ్ అయినా, అన్ని COVID-19 ప్రోటోకాల్స్ గమనించేటట్లు చూడాలి. మరో మాటలో చెప్పాలంటే, "హైకోర్టు ఆదేశాల ప్రకారం" ఎన్నికలు జరగలేదు. ఆ కోర్టు ఆదేశాల ఉల్లంఘనే ఉపాధ్యాయులకు ప్రాణాంతకమై వారు చనిపోవలసి వచ్చింద”ని వారి యూనియన్లు చెబుతున్నాయి.
"గౌరవనీయమైన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కూడా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన తాజా లేఖలో,"సమాఖ్య తన న్యాయవాది ద్వారా తన ఆలోచనలను వివరించింది. ఏదేమైనా, ఓట్ల లెక్కింపు సమయంలో కోవిడ్ వ్యాప్తి నుండి ప్రజలను రక్షించడానికి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని గౌరవనీయమైన సుప్రీంకోర్టుకు ప్రభుత్వ అభ్యర్ధి హామీ ఇచ్చారు.”
లేఖలో ఒక గుండె పగిలే వాక్యం ఉంది: "ప్రాథమిక విద్యా శాఖ, లేదా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఇంత పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఉపాధ్యాయుల మరణాలపై ఎలాంటి దుఃఖాన్ని వ్యక్తం చేయలేదు."
ఏప్రిల్ 26 న, ఆ ప్రోటోకాల్‌లను "పాటించకపోవడం" గురించి కోర్టు SEC కి నోటీసు జారీ చేసింది, వీటిలో ఫేస్ మాస్కింగ్ మరియు సామాజిక దూరం, "ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది." అని చెప్పింది. కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం లేదా SEC అసంతృప్తిగా ఉండి ఉంటే వారు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసి ఉండేవారు. కానీ వారు చేయలేదు. అంతకుముందు, మార్చి చివరి వారంలో, రాష్ట్రంలో భారీ హోలీ వేడుకల సందర్భంగా కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను అమలు చేయడానికి రాష్ట్రం నిజాయతీగా ప్రయత్నించలేదు.
ముఖ్యంగా, అలహాబాద్ హైకోర్టు మే 12 న రాష్ట్రం పంచాయతీ ఎన్నికలలో విధులను నిర్వర్తించి తర్వాత కోవిడ్ -19 కారణంగా మరణించిన పోలింగ్ అధికారుల (ఉపాధ్యాయులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు) కుటుంబాలకు ఎక్స్-గ్రాటియా పరిహారంగా 1 కోట్లు కనీసం ఇవ్వాలని చెప్పింది. జస్టిస్ సిద్ధార్థ వర్మ మరియు అజిత్ కుమార్ యొక్క డివిజన్ బెంచ్ మాటలలో: "ఎన్నికల సమయంలో అతని / ఆమె సేవలను అందించడానికి స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు రాలేదు. తమకు ఇష్టం లేకపోయినా ఎన్నికల సమయంలో విధులను నిర్వర్తించడం తప్పనిసరి అనడం వలన మాత్రమే వారు పనిచేయవలసి వచ్చింది." అని చెప్పారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం కుంభమేళా జరగాలని దేశంలోని ఏ కోర్టు, ఉత్తరాఖండ్ లేదా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించలేదు లేదా కోరలేదు. హరిద్వార్‌లోని కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అది 2022 లో జరగాల్సి ఉంది. అయినప్పటికీ, కుంభ్ వంటి భారీ సామూహిక కార్యక్రమం, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న రోజులలోనే జరిగాయి. పైగా 2022 లో జరగవలసిన కుంభమేళాను 2021 లో జరపడం పట్ల తీవ్రమైన జ్యోతిషశాస్త్ర, మతపరమైన అనేక కారణాలు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంభమేళా మరియు పంచాయతీ ఎన్నికలను 'విజయవంతంగా' నిర్వహించాల్సిన రాజకీయ ఆవశ్యకత గురించి చాలా తక్కువ చర్చ జరిగింది. కానీ ఈ సంఘటనలు చేసిన నష్టాలు ఇంత తేటతెల్లంగా నిరూపణ అయుండకపోతే, అవే గొప్ప విజయాలుగా చెలామణి అయ్యేవి.
ఈ విషాదం గురించి PARI రాసిన ముందు భాగం(మే 10) క్రింద చదవండి:













