“20 ఏళ్ల క్రితం దాకా కాలువలు శుభ్రంగా ఉన్నప్పుడు ఈ నీరు, గాజులా తేటగా, స్పష్టంగా ఉండేది. ఒక నాణెం వేసి అది అడుగుకి పోయినా పై నుంచి కనిపించేది. మేము యమునా నది నీళ్లు కూడా నేరుగా తాగేవాళ్ళం, ”అన్నాడు మత్స్యకారుడు రామన్ హల్దార్. ఈ విషయాన్ని నొక్కిచెప్పడానికి దోసిళ్ళలో బురద నీటిని పట్టి దానిని తన నోటి దగ్గరకు తీసుకొచ్చాడు. మా మొహాలలో బెదురు చూసి వేళ్ళ మధ్య నుంచి నీళ్లు జారవిడుస్తూ నవ్వాడు.
నేటి యమునాలో, ప్లాస్టిక్‌లు, రేకు కాగితాలు, చెత్తాచెదారం, వార్తాపత్రికలు, చనిపోయిన మొక్కలు, కాంక్రీటు వ్యర్థాలు, గుడ్డ ముక్కలు, బురద, కుళ్లిన ఆహారం, తేలుతున్న కొబ్బరికాయలు, రసాయనిక నురుగు, గుఱ్ఱపు డెక్క రాజధాని నగర పదార్థ వినియోగపు చీకటి కోణాన్ని ప్రతిబింబిస్తాయి.
యమునాలో కేవలం 22 కిలోమీటర్లు (లేదా కేవలం 1.6 శాతం) జాతీయ రాజధాని ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. కానీ మొత్తం 1,376 కిలోమీటర్ల నదిలో దాదాపు 80 శాతం వరకు ని కాలుష్యం, ఆ చిన్న విస్తీర్ణంలో వేస్తున్న వ్యర్థాలు, విషపూరిత పదార్థాల వల్లే జరుగుతుంది. 2018లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) పర్యవేక్షణ కమిటీ దీన్ని అంగీకరిస్తూ తన నివేదికలో ఢిల్లీలోని ఈ నదిని 'మురుగు కాలువ'గా పేర్కొంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా క్షీణించడం వల్ల చేపలు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నాయి.
గత సంవత్సరం ఢిల్లీలోని ఈ నది యొక్క దక్షిణ భాగంలో ఉన్న కాళింది కుంజ్ ఘాట్ వద్ద వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఇతర జలచరాలు కూడా ఢిల్లీ విస్తరణలో ఉన్న నదిలో అరుదుగా కనిపిస్తాయి.
"ఒక నదిలో జీవావరణ వ్యవస్థ సజీవంగా ఉండాలంటే నీటిలో ఆక్సిజన్ స్థాయి 6 లేదా ఇంకా ఎక్కువ ఉండాలి. చేపలు బతికి ఉండడానికి డిసాల్వ్డ్ ఆక్సిజన్(DO) స్థాయి కనీసం 4-5 ఉండాలి. ఢిల్లీ భాగంలో ఉన్న యమున నీటిలో ఆక్సిజన్ స్థాయి కేవలం 0 నుంచి 0.4 మధ్య ఉంది," అని యూనివర్సిటీ అఫ్ చికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ వాళ్ళ వాటర్-టు-క్లౌడ్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ అయిన ప్రియాంక హిరానీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ నదుల్లోని కాలుష్య వివరాలను నమోదు చేస్తుంది.











