పూనమ్ ఎనిమిదేళ్ల వయసున్న తన రెండవ కుమార్తె రాణి జుట్టును రెండు పాయలుగా విడదీసి, దానికి నూనె పట్టించింది. ఇక జుట్టును గట్టిగా బిగించి, రబ్బర్‌బాండ్ చుట్టేలోపే ఆ అమ్మాయి, బయట స్నేహితులు, తోబుట్టువులతో ఆడుకోవడానికి బయటకు పరిగెత్తింది. “దోస్త్ సబ్ కె అబితాయి యే షబ్ సాంజ్ హొయితే ఘర్ సా భైగ్ జై చాయ్ ఖేలా లేల్(ఆమె స్నేహితులు రాగానే, అందరూ సాయంత్రాలు బయటకు వెళ్లి ఆడుకుంటారు)”, అంటూ వంటచేయడానికి సిద్ధపడింది పూనమ్ దేవి. ఎనిమిదేళ్ల రాణి ఆమె రెండవ కూతురు.
పూనమ్‌కి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. కానీ ఆ నలుగురిలో మగపిల్లాడికి తప్ప, ఆడపిల్లలెవరికీ జనన ధృవీకరణ పత్రాల్లేవు. “హమ్రా లగ్ మీ ఇత్తే పాయ్ రహితాయ్ తా బన్వాయే లేతియే సబికే (నా దగ్గర డబ్బులుండివుంటే నా ముగ్గురు ఆడపిల్లలకు కూడా ఈ పత్రాల్ని తీసుకునివుండేదాన్ని)”, అని చెప్పిందామె.
గ్రామీణ బీహార్ ప్రాంతంలో సాధారణంగా కనిపించే వెదురు ఫెన్సింగ్‌తో కూడిన ఇళ్ల లాంటిదే పూనమ్ కచ్చా ఇల్లు కూడా. మధుబని జిల్లా బెనిపట్టి బ్లాక్ లోని ఎక్‌తారా అనే గ్రామంలో నివసిస్తోంది పూనమ్ కుటుంబం. ఆమె భర్త మనోజ్ (38) దినకూలీగా పనిచేస్తూ నెలకు 6000 రూపాయల దాకా సంపాదిస్తుంటాడు.
“నా వయసిప్పుడు పాతికేళ్లకు పైనే వుంటుంది. నా పెళ్లి ఎప్పుడయిందో కూడా నాకు జ్ఞాపకం లేదు. నా ఆధార్ కార్డు ఎప్పుడూ మా ఆయనతోనే వుంటుంది. కాబట్టి నా సరైన వయసు చెప్పలేను`` అని చెప్పింది పూనమ్. (ఈ కథనం లోని పేర్లన్నిటినీ వ్యక్తిగత గోప్యత దృష్ట్యా మార్చడం జరిగింది). ఆమె వయసిప్పుడు పాతికేళ్లు కాబట్టి వివాహమయ్యే సమయానికి ఆమెకు 14 ఏళ్ల వయసుండి వుండొచ్చు.
పూనమ్ పిల్లలందరూ ఇంట్లోనే పుట్టారు. “ప్రతిసారి ఆ సమయంలో దాయి(మంత్రసాని) సాయం చేసింది. పరిస్థితి బాగా తీవ్రమైనది అనిపిస్తేనే మేము ఆసుపత్రికి వెళతాం”, అని మనోజ్ అత్త శాంతిదేవి (57) చెప్పింది. పూనమ్ నివసించే మొహల్లాకు సమీపం లోనే శాంతిదేవి ఇల్లు కూడా వుంది. ఆమె పూనమ్‌ను సొంత కోడలిలాగా చూసుకుంటుంటుంది.







