మే నెల ప్రారంభంలో అజయ్ కుమార్ సా కు జ్వరం వచ్చింది. అతను జార్ఖండ్ లో ఛత్ర జిల్లాలో తన గ్రామమైన అసరియా నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇత్ఖోరి పట్టణంలోని ప్రైవేట్ క్లినిక్ డాక్టరుని సంప్రదించాడు.
ఆ డాక్టరు కోవిడ్ టెస్ట్ చేయకుండా బట్టలు అమ్ముకునే ఇరవై ఐదేళ్ల అజయ్ కి(పైన కవర్ ఫొటోలో తన కొడుకు తో ఉన్నాడు) టైఫాయిడ్, మలేరియా ఉన్నాయని చెప్పాడు. ఆయన అజయ్ బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ ని మాత్రం పరీక్షించాడు. అది 75-80 శాతం మధ్య ఉంది. మామూలుగా అయితే 95 నుంచి 100 వరకు ఉంటుంది. ఆ తరవాత అజయ్ ని ఇంటికి పంపించి వేశాడు.
ఆ తరవాత 2-3 గంటలకు, అజయ్ కి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఇక అదే రోజు, కంగారుగా, తన గ్రామానికి 45 కిలోమీటర్ల దూరం లో ఉన్న హజారీబాద్ లోని ఇంకో డాక్టర్ ని కలిసాడు. ఇక్కడ కూడా అతనికి టైఫాయిడ్, మలేరియాకి పరీక్షలు రాసారు కానీ కోవిడ్-19 పరీక్ష చేయలేదు.
ఏదేమైనా, తన గ్రామానికి చెందిన హైయుల్ రెహమాన్ అన్సారీ అనే వీడియో ఎడిటర్ తో అతను చెప్పాడు- “డాక్టర్ నాకు పరీక్ష జరపకపోయినా నన్ను చూసి, నాకు కరోనా ఉంది అని చెప్పాడు. అతను నన్ను సదర్ ఆసుపత్రి(హజారీబాగ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి) కి వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఇక్కడ చికిత్స ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. కానీ భయంతో మేము ఎంత ఖర్చయినా పర్లేదని అని అన్నాము. మేము ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మము. అక్కడికి కరోనా చికిత్స కోసం వెళ్లిన వాళ్లెవరూ బ్రతకరు.”


