సదర్ లో PHC తెరిచిన కొద్ది నిమిషాలకే సునీత దత్తా తన భర్తతో కలిసి అక్కడికి వచ్చింది. కానీ ఆ దంపతులు వెంటనే వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ పనిచేసే ANM సునీత ని ప్రసవాల గది కి తీసుకెళ్ళింది. “ఇస్మే కైసే హోగా బచ్చా, బహుత్ గందిగి హై ఇధర్(ఇక్కడ కాన్పు ఎలా జరుగుతుంది, చాలా మురికిగా ఉంది ఇక్కడ),“అని ఏ రిక్షాలో వచ్చిందో అదే రిక్షాలో ఎక్కుతూ అన్నది.
ఆమె కాన్పు తేదీ ఈ రోజుకి ఇచ్చారు. “ఇప్పుడు మేము ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి.” అన్నాడు ఆమె భర్త అమర్ దత్త, రిక్షా లో వెళ్ళిపోతూ. సునీతా తన మూడో బిడ్డని ఇక్కడే, ఈ PHC లో ప్రసవించింది. కానీ ఈ నాలుగోసారి వేరే చోటకి వెళదామని నిర్ణయించుకుంది.
పదకొండు గంటలకి, PHC లో ప్రసవాల గది, తన గచ్చుమీద పడిన రక్తపు మరకలు తుడవడానికి ఊడ్చే వారి కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంకా క్రితం రోజు కాన్పు జరిగిన ఆనవాళ్లతో ఆ గది ఇంకా కంగాళీగా ఉంది.
“నా భర్త నన్ను వచ్చి తీసుకెళ్తాడని ఎదురుచూస్తున్నాను. నా డ్యూటీ టైం అయిపోయింది. నేను నైట్ షిఫ్ట్ చేశాను, పేషెంట్లు ఎవరూ రాలేదు. కానీ ఈ దోమల వలన అసలు నిద్ర పట్టలేదు.” అన్నది 43 ఏళ్ళ పుష్ప(పేరు మార్చబడింది). పుష్ప ANM గా బీహార్ రాష్ట్రం సదర్ పట్టణంలో పనిచేస్తోంది. ఆమె మాతో ఆఫీస్ లోనే ANM కోసం కేటాయించిన కుర్చీలో కూర్చుని మాట్లాడుతుంది. ఆ కుర్చీ వెనుక ఉన్న టేబుల్ మీద పేపర్లన్నీ పరిచి ఉన్నాయి. ఆ పక్కనే ఒక మంచం కూడా ఉంది. పుష్పకి సరిగ్గా నిద్రపట్టనిది ఆ మంచం మీదనే.
మంచం పైన వెలసిపోయిన దోమతెర కన్నాలు పడి కొత్త పురుగులను ఆహ్వానిస్తున్నట్టుంది. దాని మీద దిండు పక్కనే బెడ్డింగ్ ని మడతపెట్టి, తర్వాత రోజు ANM వాడుకోడానికి పెట్టారు
“మా ఆఫీసు, నిద్రపోయే చోటు ఒకటే. అది అంతే.” అన్నది పుష్ప అక్కడ ముసురుకున్న దోమలని పుస్తకం తో విసురుతూ. పుష్ప 47 ఏళ్ళ కిషన్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. దర్భాంగా లో వాళ్ళ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో అతనికి ఒక కిరాణా కొట్టు ఉంది. వారి 14 యేళ్ళ కొడుకు అమ్రిష్ కుమార్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
సదర్ PHC లో సగటున 10 నుంచి 15 కాన్పుల వరకు ఒక్క రోజులో జరుగుతాయి అని చెప్పింది పుష్ప.ఇంతకు ముందు వీటికి రెట్టింపు సంఖ్యలో జరిగేవి అని చెబుతుంది పుష్ప. PHC ప్రసూతి గది లో రెండు డెలివరీ టేబుళ్లు, పోస్ట్ నేటల్ కేర్ వార్డులో ఆరు పడకలు ఉన్నాయి, అందులో ఒకటి గది మూలకు ఉంది. ఈ మంచాల్లో నాలుగు పేషంట్లు వాడితే, రెండు మమతలు వాడతారు.” అని చెప్పింది పుష్ప.
‘మమతా’లు అంటే కాంట్రాక్టు మీద మెటర్నిటీ వార్డులలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు . వీరు బీహార్ రాష్ష్ట్రం లో మాత్రమే నియమించబడ్డారు. వీరికి నెలకు 5000 రూపాయిలు ఆదాయం ఉంటుంది. ప్రతి డెలివరీకి పక్కన ఉండి సాయం అందిస్తే ఇంకో 300 వస్తుంది. అయినా వీళ్ళకి ఆదాయం నెలకు 6000 దాటదు. ఈ PHC లో ఇద్దరు మమతలు ఉన్నారు. ఇలాంటి మమతలు రాష్ట్రం మొత్తం మీద 4000 మంది ఉన్నారు.
ఇంతలో బేబీ(పేరు మారింది)వచ్చేసరికి పుష్ప ఎదురుచూపు ముగిసింది. బేబీ పుష్ప ఎదురుచూసే మమత. “హమ్మయ్య నేను వెళ్లే లోపల ఈమె వచ్చేసింది.ఇంకాసేపట్లో ఇంకో ANM కూడా వచ్చేస్తుంది”, అని ఆమె పాత ఫోన్ బటన్లు నొక్కింది. ఆమె దగ్గర టైం చూసుకోవడానికి స్మార్ట్ ఫోన్ లేదు. ఈ PHC లో ప్రసూతి గది ని చూసుకోడానికి ఇంకా నలుగురు ANM లు ఉన్నారు. ఇంకో 33 మంది హెల్త్ సబ్ సెంటర్లలో ఔట్రీచ్ అయి చిన్న చిన్న పల్లెటూర్లలో పనిచేస్తున్నారు. ఈ PHC లో ఆరుగురు డాక్టర్లు కూడా ఉన్నారు ఒక గైనకాలజిస్ట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. మెడికల్ టెక్నీషియన్ ఎవరూ లేరు కాబట్టి ఆ పని చేయడానికి బయట వారిని మాట్లాడుకున్నారు. వీరంతా గాక ఇంకా ఇద్దరు స్వీపర్లు ఉన్నారు.
బీహార్ లో ANM లు అందరికి జీతం 11500 రూపాయిలతో మొదలవుతుంది. రెండు దశాబ్దాలుగా పనిచేయడం వలన పుష్పకి ‘మమత’ కన్నా మూడింతలు ఎక్కువ వస్తుంది.
యాభై రెండేళ్ల మమతా అయిన బేబీ దేవి, PHC కి చేతిలో వేపపుల్ల తో వచ్చింది. “ అరే దీదీ బిల్కుల్ భాగ్తే భాగ్తే ఆయెహై (అయ్యో అక్కా, ఈ రోజు ఉరుకురికి వచ్చాను.) అన్నది పుష్ప.
ఐతే ఈ రోజు ఏంటి తేడా? ఆమె 12 ఏళ్ల ఆమె మనవరాలు, అర్చన(పేరు మార్చబడింది) కూడా ఆమెతో పనికి వచ్చింది.ఒక గులాబీ పచ్చ ఫ్రాక్ వేసుకుంది. చామన ఛాయ రంగు ఒంటి ఛాయ తో, రాగి రంగు జుట్టు తో అమ్మమ్మ వెనకే ఒక ప్లాస్టిక్ బాగ్ లో బహుశా ఆ రోజు మధ్యాహ్నం భోజనం డబ్బా తెచ్చుకుంది.
మమతా వర్కర్లు తల్లులని, వారికి అప్పుడే పుట్టిన బిడ్డలని చూసుకోవడానికి నియమించబడ్డారు. కానీ బేబీ దేవి ప్రకారం వాళ్ళు కాన్పు పని, కాన్పు తరవాత పని, అలానే ప్రసూతి వార్డులో ఏం జరిగినా ఆ పని, చేస్తారు. “నా పని తల్లిని, బిడ్డని కాన్పు తరవాత చూసుకోవడమే. కానీ నేను ఆశ దీదీతో పాటు కాన్పును చూసుకోవడం, మంచాన్ని శుభ్రపరచడం, స్వీపర్ సెలవు పెడితే ప్రసూతి గదిని శుభ్రపరచడం కూడా చేస్తాను”, అని టేబుల్ తుడుస్తూ చెప్పింది బేబీ
తాను ఒక్కతే మమతాగా ఉన్న సమయంలో ఎక్కువ సంపాదించే దాన్ని అని చెప్తుంది బేబీ. “నాకు నెలకి 5000-6000 వచ్చేవి. కానీ వాళ్ళు ఇంకో మమతాని పెట్టాక నాకు, జరిగే కాన్పుల్లో 300 లో 50 శాతం డబ్బులే కిట్టు తాయి. ఈ మహమ్మారి వలన పీహెచ్ లో కాన్పులు తగ్గిపోయి 3000 లేదా అంతకన్నా తక్కువ డబ్బులు వస్తున్నాయి. ఈ 300 కూడా పోయిన ఐదేళ్ల నుంచే ఇస్తున్నారు. అంతకు ముందయితే 100 రూపాయిలే ఇచ్చేవారు.”
ఎక్కువ రోజులు ఆశావర్కర్లు PHC కి కడుపుతో ఉన్న ఆడవాళ్లని వాళ్ళ పర్యవేక్షణలో కాన్పయ్యేలా చూడడానికి తీసుకుని వస్తారు. సునీత, ఆమె భర్త ఏ ఆశతోనూ కలిసి రాలేదు. అలానే ఈ విలేఖరి ఉన్న సమయంలో కూడా ఎవరూ రాలేదు, బహుశా కోవిద్ మహమ్మారి మొదలయ్యాక వచ్చే రోగులు తగ్గిపోయారన్న విషయానికి ఇది ఒక సంకేతామేమో. ఏదేమైనా కాన్పు కోసం వచ్చిన వారిలో చాలా మాది తమ ఆశా లతో కలిసి వచ్చారు.
ఆశ అంటే ‘గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త’(ASHA- Accredited Social Health Activist). వీరు తమ గ్రామాలలో ఆడవారిని ప్రభుత్వ ఆరోగ్య సేవలతో అనుసంధానిస్తారు.
బీహార్ లో దగ్గరగా 90,000 ఆశాలు ఉన్నారు.భారతదేశంలో రెండవ పెద్ద దళం వీరిదే. వాళ్ళని వాలంటీర్లు(స్వచ్చంధ సేవికలు) అనే పిలుపుతో, ప్రభుత్వం చాలా కొద్ది ఆదాయంతో వీరితో పనులు చేయించుకుంటుంది. బీహార్ లో వారికి నెలకి 1500 రూపాయిలు వస్తాయి, అలాగే వారు చేసే ఒక్కో పనికి వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. వీటిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు, పోలియో కార్యక్రమాలు(రోగనిరోధకత), మహిళల ఆరోగ్యం గురించి వారి ఇంటికి వెళ్లి సంప్రదించడం, కుటుంబ నియంత్రణ వంటివి ఎన్నో ఉంటాయి. సదర్ PHC లో, ఎన్నో సబ్ సెంటర్ల నుంచి పనిచేస్తూ, మొత్తంగా 260 ఆశా లు ముడిపడి ఉన్నారు.
బేబీ తన మనవరాలిని ప్లాస్టిక్ బాగ్ లోంచి భోజనం బయటకు తీయమని చెప్పి మాట్లాడసాగింది. “మాకు ఎప్పుడూ ఈ స్థలం, మంచాలు, ఇక్కడున్న సౌకర్యాలు ఇరుకుగానే అనిపిస్తాయి. వర్షాకాలం లో నీళ్లు నిలిచిపోతాయి. అదో పెద్ద తలనొప్పి మాకు. చాలా సార్లు పేషెంట్లు వచ్చి ఇక్కడ పరిస్థితి చూసి ప్రైవేట్ ఆసుపత్రి కి వెళ్ళిపోతారు.” అని చెప్పింది.
“నాతో రా నీకు PNC వార్డ్ చూపిస్తా”, అని విలేఖరి చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది బేబీ. “చూడు కాన్పు తరవాత పేషెంట్ల ని ఉంచడానికి మాకు ఈ ఒక్క గదే ఉంది. ఈ ఒక్క గదే- మాకు, మా పేషెంట్ల కు “ అన్నది. ఈ వార్డులో ఉన్న ఆరు పడకలు కాక ఇంకొకటి పుష్ప వంటి ANM వాడతారు. అది మెటర్నిటీ వార్డ్ బయట ఉంటుంది. “మమతాలు, ఇందులో రెండు పడకలని అదృష్టం బాగుంటే వాడుకోవచ్చు. అన్ని మంచాల పై పేషంట్లు ఉంటే, మేము బెంచీలు కలుపుకుని వాటిపై పడుకుంటాము. కొన్నిసార్లు మా ANM లు కూడా నేల మీద పడుకున్న సందర్భాలున్నాయి.” అన్నది బేబీ.
బేబీ చుట్టూ చూసి పై అధికారి ఎవరు వినడం లేదని రూఢి చేసుకుని చెప్పింది, “మాకు వేడి నీళ్ల ఏర్పాటు లేదు.నేను వాటి కోసం అడుగుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. పక్క ఉన్న చాయ్ దుకాణం ఆమె సహాయం చేస్తుంది. నువ్వు ఈ ఆసుపత్రి నుంచి బయటకు వస్తే గేటుకు కుడిచేతివైపు ఒక చాయ్ దుకాణం ఉంటుంది.దాన్ని ఒక ఆడామె, ఆమె కూతురు నడుపుతున్నారు. ఆమె వేడినీళ్లు అవసరమైనప్పుడు, ఒక స్టీల్ గిన్నెలో తెచ్చి వస్తుంది. ఆమె తెచ్చి నప్పుడల్లా ఒక పది రూపాయలు ఆమెకు ఇస్తాం.“ అని చెప్పింది బేబీ
ఆమెకు వచ్చే తక్కువ డబ్బుతో ఆమె బతుకుతుంది? “ఏమనుకుంటున్నావు?” అడిగింది బేబీ. “మూడువేల రూపాయిలు నలుగురుండే కుటుంబానికి సరిపోతాయనుకుంటున్నావా? మా ఇంట్లో నేనొక్కదాన్నే సంపాదించేది. నా కొడుకు, కోడలు, పిల్ల (తన మనవరాలు) నాతోనే ఉంటారు . కాబట్టి పేషెంట్లు కొంత డబ్బు ఇస్తారు. ANM లు, ఆశాలు అందరూ తీసుకుంటారు.మేము ఇలా కూడా కొంత సంపాదిస్తాం. కొన్నిసార్లు రోజుకు 100 రూపాయలు వస్తాయి.ఇంకొన్నిసార్లు 200 కూడా. మేము పేషంట్లని ఇబ్బంది పెట్టము. వాళ్ళని అడుగుతాము వాళ్ళు సంతోషంగా ఇస్తారు- ముఖ్యంగా అబ్బాయి పుట్టినప్పుడు!”
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.
జిగ్యసా మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
అనువాదం - అపర్ణ తోట