భానుబెన్ భర్వాడ్ బనాస్‌కాంఠా జిల్లాలోని తన 2.5 ఎకరాల వ్యవసాయ భూమిని చూసి ఏడాది కావొస్తోంది. ఇంతకుముందు ఆమె, ఆమె భర్త తమకు ఏడాదికి సరిపోయేలా తిండిగింజలుగా పండించుకొనే బాజ్రా(సజ్జలు), మూంగ్(పెసర), జొవర్(జొన్నలు)లను చూసేందుకు ప్రతిరోజూ ఆ పొలానికి వెళ్ళిన రోజులున్నాయి. 2017లో గుజరాత్‌లో వచ్చిన వరద విపత్తు ఈ పంట భూమిని నాశనం చేసేంతవరకూ ఈ పొలమే వారికి ప్రధాన జీవనాధారం. "ఆ తర్వాత మేం తినే ఆహారం మారిపోయింది," అని 35 ఏళ్ల భానుబెన్ చెప్పారు. "మేం ఇంతకుముందు మా పొలంలో పండించిన పంటలనే బయట కొనుక్కోవలసి వచ్చింది."
ఆమె వ్యవసాయ భూమిలో అర ఎకరం పొలం నాలుగు క్వింటాళ్ల (400 కిలోలు) సజ్జల దిగుబడిని ఇస్తుంది. ఇప్పుడామె అదే పరిమాణంలో సజ్జలను మండీలో కొనాలంటే, ఆమెకయ్యే ఖర్చు దాదాపు రూ. 10,000. "ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, అర ఎకరం బజ్రాను పండించడానికి మాకయ్యే (ఉత్పాదక) ఖర్చు మార్కెట్ రేటులో సగం ఉంటుంది" అన్నారామె. " ఇతర పంటలకు కూడా ఇదే వర్తిస్తుంది. మేం ఏ ధాన్యం పండించినా మాకు ఎంత ఖర్చయ్యేదో, మార్కెట్ ధర దానికి దాదాపు రెట్టింపు ఉంటోంది.”
భానుబెన్, ఆమె భర్త భోజాభాయ్ (38), వారి ముగ్గురు పిల్లలు బనాస్‌కాంఠాలోని కాంకరేజ్ తాలూకాలోని తోతానా గ్రామంలో నివసిస్తున్నారు. వారు తమ స్వంత భూమిని సాగుచేస్తున్నప్పుడు కూడా, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి భోజాభాయ్ వ్యవసాయ కూలీగా కూడా పని చేసేవారు. కానీ 2017 నుండి ఆయన సమీపంలోని పొలాలలోనూ, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటన్‌లోని నిర్మాణ ప్రదేశాలలో కూడా పూర్తి సమయం కూలీగా పనిచేయాల్సి వవస్తోంది. "అతను ఇప్పుడు కూడా పని కోసం వెతుకుతున్నాడు. పని దొరికితే రోజుకు దాదాపు 200 రూపాయలు సంపాదిస్తాడు” అని భానుబెన్ చెప్పారు.
భానుబెన్, భోజాభాయ్‌ల చిన్న బిడ్డ సుహానా, అదే సంవత్సరం వినాశకరమైన వరదల సమయంలోనే పుట్టింది. ఇప్పటికే ఐదేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నానని తన బిడ్డ తల నిమురుతూ, భానుబెన్ అన్నారు.
బనాస్‌కాంఠా, పాటన్, సురేంద్రనగర్, ఆరావళి, మోర్బీతో సహా గుజరాత్‌లోని అనేక జిల్లాలలో జూలై 2017లో అత్యంత భారీ వర్షపాతం నమోదయింది. అదే సమయంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల వల్ల ఈ వరద వచ్చింది. ఇది ఒక అరుదైన ఉత్పాతం. దేశీయ విపత్తు నిర్వహణా అధికార సంస్థ నివేదిక ప్రకారం, 112 ఏళ్లలో ఈ ప్రాంతంలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే.









