యాభయ్యో సారి జిల్లాలవారీగా వేర్వేరు ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాల్లల్లో చనిపోయిన టీచర్లు, సహాయక సిబ్బంది లెక్కచూశాడు చిత్రగుప్తుడు. అచ్చం కొన్ని వారల క్రితం ఓట్లను లెక్కించినట్టుగానే. మెషీన్ పనితీరుని నమ్మలేదతడను. చీఫ్ సెక్రటరీకి, పైన వారికి పంపించే ముందు రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూడాలి.
చనిపోయిన వాళ్ళ తమ రివార్డుల కోసం వేచి చూశారు, కానీ అతను ఎలాంటి పొరపాటు చేసే ఆస్కారం లేదు. సీటు కేటాయించే ముందు భూమి మీద వాళ్ళ గతించిన కర్మల రికార్డులన్నీ చూడాలి,. ప్రతి చిన్న తప్పుకి చెల్లించాల్సిన మూల్యం పెద్దదే, అందుకే అతను మళ్ళీ, మళ్ళీ లెక్కపెట్టాడు -. లెక్కపెట్టడానికి అతడు వెచ్చించిన క్షణాల్లో ఇంకొన్ని పేర్లు, అంతులేని ఆ ఆత్మల జాబితాకి చేరిపోతూనే ఉన్నాయి. పాతాళలోకంలోని తన ఆఫీస్ బయట వాళ్ళందర్నీ క్యూలో నిలుచోబెట్టితే, ఆ లైన్ ప్రయాగ్‍రాజ్ వరకూ చేరుకుంటుందని అతనికి అనిపించింది.
రెండూ రెండూ కూడితే 1600, ఇంకా ఎక్కువో
రెండూ రెండూ కూడితే నాలుగు
నాలుగు రెళ్ళు ఎనిమిది
ఎనిమిది రెళ్ళు పదహారు
దానికి పది కూడితే...
1600, ఇంకా ఎక్కువో.
కోపాన్ని కూడడం నేర్చుకునుంటే
నీకు భయాల తీసివేత వచ్చుంటే,
లెక్కలు కట్టడం నేర్చుకో
పెద్ద సంఖ్యలతో కుస్తీ పట్టు,
లెక్కపెట్టు ఆ శవాలని
బాలెట్ బాక్సుల్లో కుక్కినవి.
చెప్పు మరి, అంకెలంటే నీకు భయం లేదని.
ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే
గుర్తుపెట్టుకో ఈ నెలల పేర్లని,
రోజుల, వారాల సాగిన కొద్దీ నిర్లక్ష్యాన్ని
మరణాల, కన్నీళ్ళ, సంతాపాల ఋతువుల పేర్లని,
ప్రతి పోలింగ్ బూత్, ప్రతి జిల్లా పేర్లని,
ప్రతి ఊరి పేరుని.
గుర్తుపెట్టుకో తరగతి గదుల రంగులని.
గుర్తుపెట్టుకో వాటి ఇటుకులు కూలుతూ చేసిన చప్పుళ్ళని
గుర్తుపెట్టుకో రాళ్ళుకుప్పలుగా మారిన పాఠశాలలని.
మన కళ్ళు మండినా, ఈ పేర్లని గుర్తుపెట్టుకోవాలి
క్లర్కులు, ప్యూన్లులతో సహా నీ క్లాస్ టీచర్లు -
గిరీష్ సర్, రామ్ భయ్యా
మిస్. సునితా రాణి
మిస్. జావంత్రి దేవి
అబ్దుల్ సర్, ఇంకా ఫరీదా మామ్.
ఊపిరి అందక వారు చనిపోతుండగా.
మనసులో వారిని బతికించాలని గుర్తుంచుకో.
ఊపిరి పీల్చుకోవడమంటే ఓర్చుకోవడం
చనిపోవడమంటే సేవచేయడం
పాలించడమంటే శిక్షించడం
గెలవడమంటే మారణకాండ
చంపడమంటే నోరునొక్కడం
రాయడమంటే ఎగరడం
మాట్లాడడమంటే బతికుండడం -
గిరీష్ సర్, రామ్ భయ్యా
మిస్. సునితా రాణి
మిస్. జావంత్రి దేవి
అబ్దుల్ సర్, ఇంకా ఫరీదా మామ్.
గుర్తుపెట్టుకోవడమంటే నేర్చుకోవడం,
అధికారపు భాషని,
రాజకీయపు విన్యాసాలను నేర్చుకోవడం .
నిశ్శబ్దం, మనోవేదన
-వీటి అక్షరాలు తెలుసుకో.
మూగబోయిన మాటలని
ముక్కలైన కలలని,- అర్ధం చేసుకో.
ఏదో రోజున నీకు తెలుస్తుంది
ఏది నిజమో, ఏది కాదో.
ఏదో రోజున నీకు తెలుస్తుంది
ఎందుకు టీచర్లందరూ చనిపోయారో.
తరగతి గదులు ఎందుకు ఖాళీ అయ్యాయో
ఆట స్థలాలెందుకు మండిపోయాయో.
పాఠశాలలెందుకు వల్లకాడులయ్యాయో
చితులు అంటించిందెవరో
కానీ నువ్వెప్పుడూ వీరిని గుర్తుంచుకోవాలి -
గిరీష్ సర్, రామ్ భయ్యా
మిస్. సునితా రాణి
మిస్. జావంత్రి దేవి
అబ్దుల్ సర్, ఇంకా ఫరీదా మామ్.
ఆడియో: సుధాన్వా దేశ్‍పాండె జన నాట్య మంచ్‍తో
పనిజేస్తున్న నటి, దర్శకురాలు. లెఫ్ట్ వర్డ్ బుక్స్ కి సంపాదకులు.
అనువాదం : పూర్ణిమ తమ్మిరెడ్డి