“మేం హైదరాబాద్‌కు వలస వచ్చిన కొత్తలో, ఏ పని దొరికితే అది చేసేవాళ్ళం. మా కూతుర్ని బాగా చదివించడానికి కావలసినంత డబ్బు సంపాదించాలనుకున్నాం,” అన్నారు గుడ్ల మంగమ్మ. తమ మొదటి బిడ్డ కల్పన జన్మించిన వెంటనే, 2000లో మహబూబ్‌నగర్ జిల్లాలోని తమ గ్రామాన్ని విడిచి హైదరాబాద్‌కు వలస వచ్చారు గుడ్ల మంగమ్మ, ఆమె భర్త కోటయ్య.
కానీ నగరం వారిపట్ల దయగా ఏమీ లేదు. వేరే ఉద్యోగమేదీ దొరకకపోయేసరికి, తప్పనిసరియై హైదరాబాద్ నగరపు పాత బస్తీల్లోని మురుగుకాల్వలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుడుగా మారారు కోటయ్య.
అయితే, హైదరాబాద్‌లో కోటయ్య సంప్రదాయక వృత్తి అయిన బట్టలు ఉతికే వృత్తికి ఏమీ గిరాకీ ఉండేది కాదు. కోటయ్య ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి) జాబితా కిందకు వచ్చే చాకలి సముదాయానికి చెందినవారు. “మా పూర్వీకులు బట్టలుతికి, ఇస్త్రీ చేసేవారు. కానీ మాకిప్పుడు పెద్దగా పనేమీ ఉండటంలేదు; ప్రతి ఒక్కరింట్లో సొంత వాషింగ్ మెషీన్లు, ఇస్త్రీ పెట్టెలు ఉన్నాయి కదా,” వారిద్దరూ పని వెతుక్కోవడానికి ఎంత కష్టపడ్డారో వివరించారు మంగమ్మ.
నిర్మాణ స్థలాల్లో రోజువారీ కూలీ పని కోసం కూడా ప్రయత్నించారు కోటయ్య. “నిర్మాణ స్థలాలు మా ఇంటికి చాలా దూరంగా ఉండేవి. దాంతో తన ప్రయాణానికే ఎక్కువ డబ్బు ఖర్చయేది. అందుకే, ఇంటి దగ్గరలోనే దొరుకుతుంది కాబట్టి, పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేయడం మంచిదని అతననుకున్నాడు,” అన్నారు మంగమ్మ. కోటయ్య ఈ పనిని వారానికి మూడు రోజులు చేసేవారని మంగమ్మ అంచనా వేశారు. పని చేసిన రోజున కోటయ్యకు రూ. 250 వచ్చేవి.
మే నెల 2016న, ఉదయం 11 గంటలకు కోటయ్య ఇంటి నుండి బయలుదేరారని మంగమ్మ గుర్తుచేసుకున్నారు. తాను మురుగు కాలువ శుభ్రం చేయడానికి వెళ్తున్నాననీ, తిరిగి రాగానే ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఇంటి బయట ఒక బకెట్ నీళ్ళు ఉంచమనీ అతను భార్యను కోరారు. “నా భర్త సఫాయి కార్మికుడు (మునిసిపాలిటీకి చెందిన పారిశుద్ద్య కార్మికుడు) కాదు. కానీ మాకు డబ్బు అవసరం కాబట్టి ఆ పని చేసేవాడు,” అని మంగమ్మ తెలిపారు.














