ఎన్నో సంవత్సరాలుగా భాగబాన్పూర్ కు చెందిన పురుషులు ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులలో పనిచేయడానికి వలస వెళ్తున్నారు. 53ఏళ్ళ అఖిముద్దిన్ లైన్ మాన్ గా పనిచేయడానికి 25ఏళ్ల క్రితం అక్కడికి తరలివెళ్లాడు. "నేను హిమాచల్ ప్రదేశ్లో పని మొదలుపెట్టినప్పుడు రోజుకు 2.50₹ వేతనం చెల్లించేవారు" అని అన్నాడు ఆయన. "మేము సంపాదించగలిగినంత సంపాదించి, ఖర్చులకు కొంచెం ఉంచుకొని మిగిలినదంతా ఊర్లో ఇల్లు నడపడానికి పంపిస్తాం". అప్పట్లో వలసవెళ్లిన అఖిముద్దీన్ మరియు అతని సహచరులు నేటి యువతకి మార్గదర్శకులుగా మారారు.
వాళ్ళు చేసే పని చాలా ప్రమాదకరమైనది. అక్రమ్ తన సహచరులలో ఎంతోమంది విద్యుత్ షాక్ వలన మరణించడం లేక గాయపడడం చూశాడు. "ఈ పని చెయ్యాలంటే భయమేస్తుంది. ఎటువంటి రక్షణ సామగ్రి కూడా అందించరు. అనాస్ కి జరిగినట్టు ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు (అనాస్ మృతదేహం నేటికి దొరకలేదు). కానీ మాకు వేరే దారి లేదు. బ్రతుకుతెరువు కోసం ఏదో విధంగా సంపాదించాలి. మాల్ద్హాలో అయితే పని దొరకదు. అక్కడి నుండి బయటకు వలస వెళ్లాల్సిందే.”
దేశంలో అత్యంత పేద జిల్లాలలో మాల్ద్హా ఒకటి. జిల్లాలోని గ్రామీణ జనాభాలో చాలా మంది భూములు లేనివారే. వారంతా రోజువారీ వేతనాల మీద ఆధారపడుతున్నారు" అన్నాడు శుభ్రో. ఈయన మాల్ద్హాకి చెందిన ఒక సీనియర్ పాత్రికేయుడు. "ఇక్కడ భూములు చిన్నవి. ఆ పై వరదల వలన ఈ భూములు తరచుగా మునిగిపోతాయి. ఇక్కడ వ్యవసాయం చేయడం రైతులకు, వ్యవసాయ కూలీలకు దాదాపు అసాధ్యం". జిల్లాలో పరిశ్రమలు కూడా లేవు. అందుకే జనం ఉపాధి కొరకై ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తారు, అన్నాడు శుభ్రో మిత్ర.
2007లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'జిల్లా మానవ అభివృద్ధి రిపోర్ట్: మాల్ద్హా'ని ప్రచురించింది. ఈ రిపోర్టులో కార్మికులు ఇతర రాష్ట్రాలకు ఏ కారణాల వలన తరలివెళ్తున్నారో గమనించారు. దాని ప్రకారం, నీటి వనరులలో అసమానతలు, ప్రతికూలంగా ఉన్న వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు జిల్లాలోని వ్యవసాయ ఉపాధిని తీవ్రంగా దెబ్బతీశయి. ఆపై, ఈ ప్రదేశం నిదానంగా పట్టణీకరణ చెందడం, పరిశ్రమలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కాలనుగుణత వలన వేతనాలు తగ్గిపోవాదం వంటి కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వలన చిన్నపాటి కార్మికులు ఉపాధికొరకు దూర ప్రాంతాలకు తరలివెళ్లాల్సొస్తుంది.
ఏప్రిల్ మొదటి వారంలో, కోవిడ్-19 కేసులు దేశమంతటా పెరుగుతున్నప్పటికి, 37ఏళ్ల నీరజ్ మొండాల్ తన బార్యాపిల్లలని వదిలి ఉపాధికోరకై ఢిల్లీకి తరలివెళ్లాడు. "మాస్క్ పెట్టుకొని పనిచెయ్యడమే" అంటాడు అతను. "లోక్డౌన్ పెట్టినప్పటినుంచి అసలు పనే దొరకట్లేదు. ఏదో ప్రభుత్వ సహాయంతో రోజులు గడిపేశాం, చేతిలో డబ్బులయితే లేవు. మాల్ద్హాలో ఎలాగో పని దొరకదు".
మాల్ద్హాలో మహా అయితే రోజుకి 200 రూపాయిలు సంపాదగించగలిగే నీరజ్, ఢిల్లీలో రోజుకి 500-550₹ వరకు సంపాదించగలుగుతాడు. "ఇలా అయితే ఎక్కువ పొదుపు చేసి ఇంటికి పంపొచ్చు" అంటాడతను. "ఇంట్లోవాళ్ల మీద బెంగగా ఉంటుంది. ఇష్టపూర్వకంగా ఎవరూ ఇల్లొదిలి వెళ్లరు".