ప్రకాశవంతమైన ఎరుపు రంగు వేసివున్న దాని పేరు: కెఎఫ్‌సి
ఇక్కడి రుచికరమైన ఆహారానికి బాధ్యత వహించే వ్యక్తి 'కె' అంటే 'కెంటకీ' అని అర్థమున్న ఇంకో కెఎఫ్‌సికి చెందిన దివంగత కల్నల్ సాండర్స్ కాదు. కులామరాకు చెందిన 32 ఏళ్ల బిమాన్ దాస్ ఈ ఒంటి అంతస్తు రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు
అధికారికంగా నతూన్ కులామరా చాపొరీ అని పిలిచే ఈ గ్రామం అస్సామ్‌లోని మాజులీ నదీ ద్వీపంలో ఉంది. ప్రధానంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉండే కులామరాని 480 మంది జనాభా(జనగణన 2011) మాత్రమే కాకుండా, ద్వీపానికి వచ్చే సందర్శకులు కూడా త్వరగా భోజనం ముగించడానికి కెఎఫ్‌సిని కోరుకుంటారు. ఇది ప్రయాణీకుల గైడ్‌ల నుంచి కూడా ఎక్కువ రేటింగ్‌ను పొందింది.
"నేను 2017లో ఒక బండిలో కెఎఫ్‌సిని ప్రారంభించాను," 2022లో వేడిగా ఉన్న ఒక మే మధ్యాహ్నం వేళ భోజనాల కోసం తన రెస్టారెంట్‌ను తెరిచిన బిమాన్ చెప్పారు. ఆ రెస్టారెంట్ గోడలు లోపలా బయటా ప్రకాశవంతమైన ఎరుపు రంగు వేసివున్నాయి. మండుతున్న ఎండలో మేకలు, పెద్దబాతులు, పశువులు చుట్టూ తిరుగుతున్నాయి.
బిమాన్ మొదట ఒక తోపుడు బండి మీద చౌ మీన్ (వేయించిన నూడుల్స్), మరికొన్ని వంటకాలను విక్రయించడం ప్రారంభించారు. రెండేళ్ళ తరువాత 2019లో 10-సీట్ల రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అందులో వేపుళ్ళు, బర్గర్‌లు, పీజాలు, పాస్తాలు, మిల్క్‌షేక్‌లు, ఇంకా మరెన్నో వంటకాలను అందిస్తున్నారు.
కెఎఫ్‌సి కేవలం కులామరా లోని స్థానిక జనాలలోనే కాకుండా నదీ ద్వీపాన్ని సందర్శించే ప్రపంచవ్యాప్త పర్యాటకులలో కూడా విజయవంతమైంది. గూగుల్ రివ్యూలలో దానికి 4.3 స్టార్ రేటింగ్ రావడానికి వీరే బాధ్యులు. ఈ రివ్యూలలో ఈ కెఎఫ్‌సి రుచి, తాజాదనం గురించి విస్తృతంగా ప్రశంసలు కురిశాయి
అయితే దీన్ని కృష్ణ ఫ్రైడ్ చికెన్ అని ఎందుకు పిలుస్తారు? బిమాన్ తన ఫోన్‌ని తీసి అతను, అతని భార్య దేవయాని దాస్, ఒక ఏడెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న చిన్న పిల్లవాడు ఉన్న ఫోటోను చూపించారు. "నా కొడుకు పేరు కృష్ణ అని దానికి ఆ పేరు పెట్టాను," అని గర్వంగా నవ్వుతూ చెప్పారు ఆ తండ్రి. ఆ పిల్లవాడు బడి అయిపోయిన తర్వాత ప్రతిరోజూ కెఎఫ్‌సికి వచ్చి, తన తల్లిదండ్రులు ఆకలితో ఉన్న కస్టమర్లకు వడ్డిస్తున్నప్పుడు, అక్కడే ఒక మూలన హోమ్‌వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు
అది మధ్యాహ్న భోజన సమయం. బిమాన్ వేపుళ్ళతో పాటు కరకరలాడే ఫ్రైడ్ చికెన్ బర్గర్‌ని సిఫార్సు చేస్తున్నారు. దాని తయారీ విధానాన్ని కూడా అతను మనకు చూపిస్తారు. " మాజులీలో అత్యంత పరిశుభ్రమైన వంటశాలలలో నాదీ ఒకటని అందరికీ తెలుసు," అని అతను మూడు కౌంటర్లు, ఒక ఫ్రిజ్, ఓవెన్లు, డీప్ ఫ్రయ్యర్ ఉన్న చిన్న స్థలంవైపు దారితీస్తూ చెప్పారు. తరిగిన కూరగాయలు చక్కగా పేర్చి ఉన్నాయి, వంటగది అరలలో కెచప్, ఇతర సాస్‌ల సీసాలు ఉన్నాయి.
బిమాన్ ఫ్రిజ్ నుంచి మసాలాలలో ఊరవేసిన కోడిమాంసాన్ని బయటకు తీసి, దానిని పిండిలో దొర్లించి తీసి బాగా వేయిస్తారు. అది వేడి నూనెలో చిటపటలాడుతూ వేగుతుండగా, అతను రొట్టెలను కాల్చడం ప్రారంభిస్తారు. వంట చేస్తూనే, "మా అమ్మ పొద్దున్నే పనికి వెళ్ళాల్సివుండటంతో నా తిండి నేనే తయారుచేసుకోవాల్సివచ్చేది," అంటూ తాను 10 సంవత్సరాల చిన్న వయస్సు నుండే ఎలా వంట చేయడం ప్రారంభించారో బిమాన్ వివరించారు. అతని తల్లి ఇలా దాస్ మాజులిలో వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా, అతని తండ్రి దీఘలా దాస్ చేపలు అమ్మేవారు.
"మా అమ్మ వంట చేస్తుండగా చూస్తూ నేను పప్పు, కోడిమాంసం, చేపలను ఎలా వండాలో నేర్చుకున్నాను," అన్నారు బిమాన్. "మా ఇరుగుపొరుగువాళ్ళు, నా స్నేహితులు మా ఇంటికి వచ్చి నా వంటను మెచ్చుకుంటూ తినేవాళ్ళు. వారికి నా వంట నచ్చడం నేను మరింతగా వంట నేర్చుకునేలా నన్ను ప్రోత్సహించేది."
పద్దెనిమిదేళ్ళ వయసులో బిమాన్ జీవనోపాధిని వెతుక్కుంటూ ఇంటిని వదిలిపెట్టాడు. జేబులో కేవలం రూ. 1500లతో, ఒక స్నేహితుడితో కలిసి ముంబైకి ప్రయాణమైవెళ్ళాడు. నగరంలోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగాన్ని వెతుక్కోవటంలో అతనికి అతని బంధువొకరు సహాయంచేశారు. అయితే, అతనా ఉద్యోగాన్ని ఎక్కువకాలం చేయలేదు. “నేను ఉద్యోగం మానేశాను. అలా చేయడం నాకు చాలా బాధగా అనిపించటంతో, నాకు ఈ ఉద్యోగం దొరికేలా చేసిన బంధువుకు, ‘దయచేసి నా గురించి తప్పుగా అనుకోవద్దు. ఈ ఉద్యోగం నాకు సరిపడనందున నేను దీన్ని వదిలేయాల్సివచ్చింది. నాకు ఈ ఉద్యోగంలో సంతృప్తి దొరకటం లేదు.' అని ఉత్తరం రాశాను."
ఆ తర్వాత అతను ముంబైలోని వివిధ రెస్టారెంట్లలో పనిచేస్తూ పంజాబీ, గుజరాతీ, ఇండో-చైనీస్, కాంటినెంటల్ ఫుడ్ వంటి బహుళ వంటకాలను తయారుచేయటం నేర్చుకున్నారు. మొదట్లో అదంతా ఏదో పైపైనే. "నేను ప్రారంభంలో ప్లేట్లు శుభ్రం చేయటం, భోజనం బల్లలను సిద్ధంచేయడం వంటి పనుల్ని చేసేవాడ్ని" అని అతను చెప్పారు. 2010లో బిమాన్‌కు హైదరాబాద్‌లోని ఎటికో అనే ఫుడ్ కోర్టులో పనిచేసే అవకాశం వచ్చింది; అతనిక్కడ పనిచేస్తూ అంచెలంచెలుగా మేనేజర్ అయ్యారు.
ఇంతలో అతను దేవయానితో ప్రేమలో పడి, ఆమెను పెళ్ళిచేసుకున్నారు. ఇప్పుడామె అతని వ్యాపారంలో కూడా భాగస్వామిగా ఉంది. అతని దగ్గరి బంధువులైన శివాని, ఆమె సోదరి అయిన మరో దేవయాని కూడా అతని ఫలహారశాలలో సహాయం చేసేందుకు వస్తుంటారు
హైదరాబాద్‌లో పని చేశాక, మాజులీకి తిరిగివెళ్ళిపోవాలని బిమాన్ నిర్ణయించుకున్నారు. తిరిగివచ్చిన మొదట్లో అస్సామ్, శివసాగర్ జిల్లాలోని డెమో బ్లాక్‌లో ఉన్న ఒక రెస్టారెంట్‌లో అతను పనిచేశారు. ఇలా పనిచేసినంత కాలమూ సొంతంగా ఒక రెస్టారెంట్‌ను నడపాలనే తన కలను పెంచిపోషించుకుంటూనే ఉన్నారు. చివరకు ఈనాటికి ఆయన తన కలను సాకారం చేసుకున్నారు - ఇప్పుడాయన ఒక రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. "నేను వంటగది కట్టాను (రెస్టారెంట్ వెనకవైపున). కానీ తినడం కోసం వచ్చేవారు కూర్చునేందుకు ఈ ప్రదేశానికి నెలకు రూ. 2,500 అద్దె చెల్లిస్తున్నాను" అన్నారు బిమాన్.
బిమాన్ చెప్పే కథను వింటూ నేను 120 రూపాయలు చెల్లించి, అద్భుతమైన బర్గర్, వేపుళ్ళు తిన్నాను. బర్గర్‌లతో పాటు రూ.270 ఖరీదు చేసే తాను తయారుచేసిన పిజ్జాను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారని ఆయన చెప్పారు. తమ తాజాగా సేదదీర్చే నింబు పానీ (నిమ్మరసం) గురించి, మిల్క్‌షేక్‌లు, వెజిటబుల్ రోల్స్ గురించి ప్రజలు మంచి రివ్యూలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
బిమాన్, అతని కుటుంబం కులమోరాకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే సెంసొవాలో నివాసముంటారు. ప్రతిరోజూ అతను తన స్విఫ్ట్ డిజైర్ కారులో తన రెస్టారెంట్‌కు వస్తుంటారు. "ప్రతిరోజూ ఉదయం 9 గంటలకల్లా ఆరోజుకు అవసరమైన కూరగాయలను, కోడిమాంసాన్ని ముక్కలుగా కోయటంతో నా రోజు మొదలవుతుంది," అంటారు బిమాన్.
బాగా వ్యాపారం జరిగే రోజుల్లో అతను రోజుకు పదివేల రూపాయల వరకూ సంపాదిస్తారు. సాధారణంగా అది టూరిస్టులు ఎక్కువగా వచ్చే అక్టోబర్ - డిసెంబర్ నెలల్లో ఉంటుంది. మిగతా రోజుల్లో రోజుకు ఐదువేల రూపాయలు సంపాదిస్తానని అతను చెప్పారు.
అంతలోనే, అక్కడికి క్రమం తప్పకుండా వచ్చే నిఖితా ఛటర్జీ వచ్చి తనకు కావలసినదాన్ని ఆర్డర్ చేశారు. సామాజిక కార్యకర్త అయిన ఆమె, ముంబై నుంచి మాజులీకి వచ్చి ఇంకా ఏడాది పూర్తికాలేదు. "కెఎఫ్‌సి ఒక జీవన ప్రదాత," అంటారామె. "నేను మొదటిసారి కృష్ణా ఫ్రైడ్ చికెన్ గురించి మాజులీ స్థాయికి అది చాలా మంచి వంటకమని జనం చెప్పగా విన్నాను. అయితే ఇక్కడి ఆహారాన్ని రుచి చూసిన తర్వాత ఏ స్థాయితో పోల్చి చూసినా ఇది చాలా మంచి ఆహారమని నాకనిపించింది."
బిమాన్ వైపు చూస్తూ ఆమె ఇలా కొనసాగించారు, "అయినా నాక్కొన్ని ఫిర్యాదులున్నాయి. నువ్వెందుకు రెండురోజుల పాటు దీన్ని మూసేశావు?" అస్సామ్‌లో ప్రధానంగా జరుపుకునే బిహూ పండుగ సందర్భంగా ద్వీపమంతటా దుకాణాలన్నీ మూసివేయడం గురించి ఆమె ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
"గత రెండు రోజులుగా అసలు మీరేమీ తినలేదా ఏమిటీ?" నవ్వుతూ అడిగారు బిమాన్.
మీరెప్పుడైనా నతూన్ కులామరా చాపొరీకి వెళ్తే కృష్ణా ఫ్రైడ్ చికెన్‌ను సందర్శించడం తప్పనిసరి. ' వేళ్ళు నాకి నాకి తినాలనిపించేంత రుచి దానిది !'
అనువాదం: సుధామయి సత్తెనపల్లి