జోనాలి రిసోంగ్ (34) ఆపంగ్ తయారీలో నిపుణురాలు. "కొన్ని రోజుల్లో నేను 30 లీటర్ల కంటే ఎక్కువగానే ఆపంగ్ తయారుచేయగలను," అంటారామె. చాలామంది మద్యం తయారీదార్లు వారానికి కొన్ని లీటర్లు మాత్రమే తయారుచేయగలరు. ఈ మద్యం తయారీ ప్రక్రియ పూర్తిగా చేతి తయారీ.

గరముర్ పట్టణం సమీపంలోని మూడు గదుల ఇల్లు, ఆ ఇంటివెనుకనున్న పెరడులోనే జోనాలి సారాయి బట్టీ కూడా ఉంది. ఈ పట్టణం అస్సామ్‌లోని బ్రహ్మపుత్ర నదిపై ఉన్న మాజులీ నదీ ద్వీపంలో ఉంది. ఆమె ఇంటి వెనుక ఒక చిన్న చెరువు ఉంది. ఈ చెరువు బ్రహ్మపుత్ర నదికి క్రమం తప్పకుండా వచ్చే వరదల సమయంలో పొంగిపొరలిన నీటితో తయారైనది.

పనిలో మునిగివున్న ఆమెను మేం కలిసినప్పుడు సమయం ఉదయం 6 గంటలయింది. దేశానికి తూర్పు వైపు ఉన్న ఈ ప్రాంతంలో అప్పటికే బారెడు పొద్దెక్కింది. సారాయి కాచేందుకు జొనాలీ పెరట్లో కట్టెల పొయ్యి వెలిగించారు. సారాయి తయారీకి కావలసిన పదార్థాలు, పరికరాలు ఇంట్లో ఒకచోట పెట్టివున్నాయి

అస్సామ్‌లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన మిసింగ్ సముదాయానికి చెందిన ప్రజలు పులియబెట్టిన పానీయమైన ఆపంగ్‌ ను తయారుచేస్తారు. దీనిని భోజనంతోపాటు తీసుకుంటారు. మిసింగ్ భరత్ చండీ చెప్తున్నట్టు, "మా మిసింగ్ ప్రజలం ఆపంగ్‌ లేకుండా ఎటువంటి పూజలు కానీ పండుగలు కానీ జరుపుకోం." చండీ, గరముర్ మార్కెట్‌లో ఇంటి తరహా భోజనాన్ని అందించే మాజులీ కిచెన్ యజమాని.

బియ్యాన్నీ, కొన్ని మూలికలనూ ఉపయోగించి తయారుచేసే ఈ లేత మీగడ రంగు పానీయాన్ని జొనాలీ వంటి మిసింగ్ మహిళలు మాత్రమే తయారుచేసి గరముర్‌లోని హోటళ్ళకూ దుకాణాలకూ అమ్ముతారు. "మగవాళ్ళు దీన్ని తయారుచేయడానికి ఇష్టపడరు. దీన్ని తయారు చేయడం శారీరక శ్రమతో కూడుకున్నదనీ, ఇందులో ఉపయోగించే మూలికలను సేకరించటం చాలా కష్టమైన పని అనీ వాళ్ళు భావిస్తారు," నవ్వుతూ చెప్పారు జొనాలీ.

PHOTO • Priti David

ఒక పెడ్డ కడాయిలో నీటిని కాగబెడుతున్న జొనాలీ రిసాంగ్. ఆపంగ్ తయారుచేయడానికి ఆ నీటిలో బియ్యం వేసి వండుతారు

PHOTO • Priti David

తన ఇంటి దగ్గర నేలపై పరచివున్న తగరపు రేకుపై పొరో (ఎండిన వరి గడ్డి)ను తగులబెడుతోన్న జొనాలీ. దీన్ని ఉదయం 6 గంటలకే వెలిగించారు. 3-4 గంటల వరకు అది మండుతూనే ఉంటుంది. మొత్తం తగలబడిన తరువాత మిగిలిన బూడిదను వండిన అన్నంలో కలుపుతారు

జొనాలీ భర్త ఉర్బర్ రిసాంగ్‌కు వారి ఇంటికి ఐదు నిమిషాల నడక దూరంలో ఉన్న మార్కెట్ ప్రాంతంలో ఒక దుకాణం ఉంది. వారి 19 ఏళ్ల కుమారుడు, మృదు పాబంగ్ రిసాంగ్, బ్రహ్మపుత్ర నదిలో ఫెర్రీలో ఒక గంట ప్రయాణం దూరంలో ఉన్న జోర్‌హాట్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు.

జొనాలీ అత్తగారైన దీప్తి రిసాంగ్ ఆమెకు ఆపంగ్ తయారు చేయడాన్ని నేర్పించారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి: నాంగ్‌జిన్ ఆపంగ్ , కేవలం బియ్యమే ప్రధాన పదార్ధంగా; పొరొః ఆపంగ్ , కాలిన వరి గడ్డి అదనపు రుచితో. ఒక లీటరు ఆపంగ్ రూ. 100కి అమ్ముడవుతుంది. దాని తయారీదారుకి అందులో దాదాపు సగం డబ్బు వస్తుంది.

దశాబ్దానికి పైగా ఆపంగ్ తయారీలో అనుభవం ఉన్నందున, జొనాలీకి ఇప్పుడు దాని ఆనుపానులన్నీ తెలుసు. మాజులీ జిల్లాలోని కమలాబారీ బ్లాక్‌లో ఉన్న ఆమె కుగ్రామంలోPARI ఆమెను కలిసినప్పుడు, ఆమె పొరొః ఆపంగ్ తయారుచేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 గంటలకు పని మొదలుపెట్టిన ఆమె, 10-15 కిలోల వరి గడ్డిని తన పెరట్లోని తగరపు రేకుపై ఉంచి అది నెమ్మదిగా కాలేలా నిప్పంటించారు. "ఇది కాలిపోవడానికి 3-4 గంటలు పడుతుంది," ఆమె చుట్టూ తిరుగుతూ, అన్నం వండడానికి వేరే పొయ్యిని వెలిగిస్తున్నప్పుడు మాకు చెప్పారు. కొన్నిసార్లు ఆమె ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభిస్తారు. గడ్డి నెమ్మదిగా కాలటానికి ముందురోజు రాత్రే ఏర్పాటు చేస్తారు.

పొగలు కక్కుతున్న గడ్డికి దగ్గరలోనే జోనాలీ పొయ్యి వెలిగించి దాని మీద ఒక పెద్ద కడాయి నిండా నీటిని ఉంచారు. నీళ్ళు కాగి బుడగలు రావడం ప్రారంభించినప్పుడు, ఆమె 25 కిలోల బియ్యాన్ని, ఒక్కోసారి కొన్ని కిలోల బియ్యం చొప్పున, అందులో పోశారు. "ఈ పని వల్ల నాకు వెన్నులో కొద్దిగా నొప్పి వస్తోంది" అని ఆమె అంగీకరించారు.

అస్సామీ పండుగలైన మాఘ్ బిహు, బొహాగ్ బిహు, కాతి బిహుల సమయంలో - పెద్ద మొత్తంలో బీరుకు డిమాండ్ ఉన్నప్పుడు, జొనాలీకి ముమ్మరంగా పని ఉంటుంది. కొన్నిసార్లు ఒకే రోజులో రెండు సార్లు ఆపంగ్ తయారుచేస్తారు

వీడియో చూడండి: మిసింగ్ సముదాయపు సంప్రదాయక బియ్యపు సారాయి పొరొః ఆపంగ్ తయారీ

రెండు చోట్లా మంటలు బాగా రాజుకున్నాయి. ఉడుకుతోన్న బియ్యాన్ని కలుపుతూ ఒకసారి, పొడవాటి కర్రతో కాలుతున్న వరిగడ్డిని కదిలిస్తూ మరోసారి జొనాలీ అటూ ఇటూ చురుగ్గా కదులుతున్నారు. దానివల్ల వేడి సమానంగా వ్యాపిస్తుంది. 25 కిలోల ఉడుకుతున్న బియ్యాన్ని కలియతిప్పడం అంత సులభమేమీ కాదు. జొనాలీ ఆ పని చేసేటప్పుడు కొద్దిగా ఆయాసపడుతున్నారు. ఆ బియ్యాన్ని రేషన్ షాపు నుంచి కొనుగోలు చేశారు. "మేం కూడా ధాన్యం పండిస్తాం, కానీ దాన్ని మేం తినడానికి ఉంచుకుంటాం," అని ఆమె చెప్పారు.

అన్నం ఉడకటానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. అది కొద్దిగా చల్లారాక, జొనాలీ గడ్డి కాలిన బూడిదను అందులో కలుపుతారు. ఈ ప్రక్రియ వినడానికి తేలికగా అనిపిస్తుంది, అయితే పొగలుగక్కే అన్నాన్ని వెచ్చని బూడిదతో కలిపి వాటిని మెత్తగా మెదిపి గుజ్జుగా చేయాలి. ఇదంతా ఆమె తన ఒట్టి చేతులనే ఉపయోగించి చేస్తారు. ఆ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి వెదురు బుట్టలో పరుస్తారు. “ఈ బుట్టలో ఇది వేగంగా చల్లబడుతుంది. వేడిగా ఉన్నప్పుడే బూడిదనూ అన్నాన్నీ కలిపేసేయాలి, లేదంటే అది కలవదు,” అని జొనాలీ ఆ మిశ్రమం తన అరచేతులను కాలుస్తున్నా పెద్దగా పట్టించుకోకుండా వివరించారు.

ఆ మిశ్రమాన్ని గుజ్జుగా కలుపుతున్నప్పుడే జోనాలీ, ఆపంగ్ కోసం తాను సిద్ధం చేసిన మూలికలను అందులో కలుపుతారు. "వంద రకాల మూలికలు, ఆకులు ఇందులోకి వెళ్తాయి," అని ఆమె చెప్పారు. తన రహస్యాలన్నింటిని పంచుకోవడానికి ఇష్టపడని ఆమె, రక్తపోటును తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కొన్ని ఆకులు మిసింగ్ సముదాయంలో పేరుపొందాయని చెప్పారు. అయితే అంతకంటే ఆమె మరేమీ బయటపెట్టలేదు.

పగటివేళల్లో జొనాలీ గరమూర్ చుట్టుపక్కల తిరుగుతూ తనకు అవసరమైన ఆకులను, మూలికలను సేకరిస్తారు. “నేను వాటిని ఎండబెట్టి, నా మిక్సీలో పొడి చేస్తాను. ఆ పొడిని చిన్న (పిడికిలంత) ఉండలుగా చేస్తాను. అటువంటి ఎండబెట్టి, పొడిచేసిన మూలికల 15-16 బంతులను నా ఆపంగ్ తయారీలో ఉపయోగిస్తాను,” అని ఆమె చెప్పారు. తన అత్తవారింటికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఫుటుకి అనే కుగ్రామంలో జన్మించిన జొనాలీకి ఆ ప్రాంతమంతా బాగా తెలుసు.

PHOTO • Priti David
PHOTO • Riya Behl

కడాయి నిండా మరుగుతోన్న నీటిలో బియ్యాన్ని పొస్తోన్న జొనాలీ (ఎడమ). ఉడుకుతున్న బియ్యాన్ని కలియదిప్పటానికి ఆమె ఒక పొడవాటి చెక్క కర్రను (కుడి) ఉపయోగిస్తారు

PHOTO • Riya Behl

వేడి సమానంగా వ్యాపించేలా, పూర్తిగా కాలి బూడిదగా మారకుండా ఉండటం కోసం జొనాలీ పొగలుకక్కే వరి గడ్డిని కదిలిస్తూనే ఉండాలి

వెదురు జల్లలోని మిశ్రమం చల్లబడిన తర్వాత, దాన్ని దాదాపు 20 రోజుల పాటు ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి ఇంట్లో నిల్వ చేస్తారు జొనాలీ. "దాని వాసనను బట్టి (పులియబెట్టడం) అది సిద్ధమైనట్టు నాకు తెలుస్తుంది," అని ఆమె చెప్పారు. సారాయి కాయటంలోని చివరి దశకు సమయం వచ్చింది: బూడిద, వండిన అన్నం, మూలికలను కలిపి పులియబెట్టిన మిశ్రమాన్ని అరటి ఆకుతో కప్పిన శంఖాకారపు బుట్టలో ఉంచి, దాన్ని ఒక పాత్రకు పైగా వేలాడదీస్తారు. ఆ బుట్టలో నీరు పోస్తారు. పులిసిన మిశ్రమం వలన ఏర్పడిన బీర్ క్రింద ఉన్న పాత్రలోకి పడిపోతుంది. 25 కిలోల బియ్యం నుంచి సుమారు 30-34 లీటర్ల ఆపంగ్ తయారవుతుంది

అస్సామీ పండుగల సమయంలో - జనవరిలో మాఘ్ బిహు, ఏప్రిల్‌లో బొహాగ్ బిహు, అక్టోబర్‌లో కాతి బిహు - పెద్ద మొత్తంలో బీర్‌కు డిమాండ్ ఉన్నప్పుడు, జోనాలీ విరామం లేకుండా పనిచేస్తుంటారు, కొన్నిసార్లు ఒకే రోజులో రెండు విడతలు ఆపంగ్ తయారుచేస్తారు. మిసింగ్ సముదాయపు అలీ-యె-లిగాంగ్ పండుగ సమయంలో కూడా.

జొనాలీ కేవలం ఆపంగ్ తయారుచేసి, అమ్మడం ద్వారా మాత్రమే సంపాదించటంలేదు. ఆమె సమీపంలోని హోటల్‌లో లాండ్రీ పని చేస్తారు. మిసింగ్ సముదాయపు ఆహారాన్ని వండి వడ్డిస్తారు. గుడ్ల కోసం 200 కోళ్లను పెంచుతున్నారు. సమీపంలోని చిన్నచిన్న హోమ్‌స్టేలకు బకెట్‌లలో వేడి నీటిని సరఫరా చేస్తారు. ఆపంగ్ తయారుచేయడం వల్ల చక్కని ఆదాయం వస్తుందని ఆమె చెప్పారు. "నేను 1,000 రూపాయలు ఖర్చుపెడితే, నాకు రూ. 3,000 తిరిగి వస్తుంది" అని ఆమె అన్నారు. "అందుకే ఈ పని చేయాలంటే నాకిష్టం."

PHOTO • Riya Behl

ఆపంగ్ తయారీలో మరో దశ అయిన ఒక పెద్ద వెదురు జల్లలోకి మార్చడానికి సిద్ధంగా ఉన్న ఉడికిన అన్నం, పైన వరిగడ్డిని కాల్చిన బూడిద

PHOTO • Priti David

వండిన అన్నాన్ని పెద్ద కడాయి నుండి తీసి, చల్లబరచడానికి పెద్ద వెదురు జల్లలోకి మార్చడానికి జొనాలీ ఒక లోహపు పళ్ళాన్ని ఉపయోగిస్తారు

PHOTO • Priti David

జొనాలీ ప్రత్యేకంగా సేకరించిన మూలికల పొడి కలిపేందుకు సిద్ధంగా ఉన్న పొగలుగక్కే అన్నం, వరిగడ్డిని కాల్చిన బూడిద

PHOTO • Riya Behl

కేవలం తన చేతుల్ని ఉపయోగించి, ఉండలు లేకుండా అన్నాన్ని చిదిపి మూలికలతో కలుపుతున్న జొనాలీ

PHOTO • Riya Behl

మామూలుగా తీరికలేకుండా గడిచే తన ఉదయపు వేళల్లోని ఒక నిశ్శబ్ద క్షణాన్ని అనుభవిస్తోన్న జొనాలీ

PHOTO • Riya Behl

'ఒక వంద మూలికలూ ఆకులూ ఇందులోకి (ఆపంగ్) వెళ్తాయి,' అంటారు, వాటి పేర్లు చెప్పడానికి ఇష్టపడని జొనాలీ

PHOTO • Riya Behl

రక్తపోటు తగ్గించటానికీ, జీర్ణక్రియను మెరుగుపరచటానికీ పనికొచ్చే కొన్ని ఆకులు మిసింగ్ సముదాయంలో బాగా పేరుపొందాయి

PHOTO • Priti David

‘నేను వాటిని (మూలికలు) ఎండబెట్టి నా మిక్సీలో పొడి చేసిన తర్వాత వాటిని చిన్న ఉండలుగా (పిడికిలంత) చేస్తాను. ఈ ఎండబెట్టి పొడిచేసిన 15-16 మూలికల ఉండలను నా ఆపంగ్ తయారీలో ఉపయోగిస్తాను,' అంటారు జొనాలీ

PHOTO • Priti David

ఎండబెట్టి, పొడిచేసిన మూలికలూ ఆకులూ ఆపంగ్‌కు సువాసననూ బలాన్నీ ఇస్తాయని చెప్తారు

PHOTO • Priti David

పులుస్తోన్న అన్నాన్ని ఒక పసుపుపచ్చ ప్లాస్టిక్ షీట్‌లో ఉంచి 15-20 రోజులపాటు పక్కన పెట్టేస్తారు

PHOTO • Priti David

ఆమె వంటగదిలో ఒక మూలన ఉన్న ఒక లోహపు త్రిపాదిపై శంఖాకారపు వెదురు బుట్ట ఉంది. ఆపంగ్‌ను తయారుచేయడానికి జొనాలీ ఉపయోగించే ఉపకరణం ఇదే

PHOTO • Priti David
PHOTO • Priti David

సారాయి తయారయ్యే పరికరం (ఎడమ), ఒక పాత్రలోకి సేకరిస్తోన్న బీర్ (కుడి)

PHOTO • Priti David

గరమూర్‌లోని తన మాజులి కిచెన్ రెస్ట్రాంట్‌లో భరత్ చండీ మిసింగ్ సముదాయపు ఆహారాన్ని అందిస్తారు

PHOTO • Priti David

అస్సామ్‌లోని మాజులీ ద్వీపంలోని గరమూర్‌లో తన ఇంటిబయట నిలబడివున్న జొనాలీ

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Priti David

ਪ੍ਰੀਤੀ ਡੇਵਿਡ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਇੰਡੀਆ ਦੇ ਇਕ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਪਾਰੀ ਵਿਖੇ ਐਜੁਕੇਸ਼ਨ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪੇਂਡੂ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਕਲਾਸਰੂਮ ਅਤੇ ਪਾਠਕ੍ਰਮ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਸਿੱਖਿਅਕਾਂ ਨਾਲ ਅਤੇ ਸਮਕਾਲੀ ਮੁੱਦਿਆਂ ਨੂੰ ਦਸਤਾਵੇਜਾ ਦੇ ਰੂਪ ’ਚ ਦਰਸਾਉਣ ਲਈ ਨੌਜਵਾਨਾਂ ਨਾਲ ਕੰਮ ਕਰਦੀ ਹਨ ।

Other stories by Priti David
Photographs : Riya Behl

ਰੀਆ ਬਹਿਲ ਲਿੰਗ ਅਤੇ ਸਿੱਖਿਆ ਦੇ ਮੁੱਦਿਆਂ 'ਤੇ ਲਿਖਣ ਵਾਲ਼ੀ ਮਲਟੀਮੀਡੀਆ ਪੱਤਰਕਾਰ ਹਨ। ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ (PARI) ਦੀ ਸਾਬਕਾ ਸੀਨੀਅਰ ਸਹਾਇਕ ਸੰਪਾਦਕ, ਰੀਆ ਨੇ ਵੀ PARI ਨੂੰ ਕਲਾਸਰੂਮ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਵਿਦਿਆਰਥੀਆਂ ਅਤੇ ਸਿੱਖਿਅਕਾਂ ਨਾਲ ਮਿਲ਼ ਕੇ ਕੰਮ ਕੀਤਾ।

Other stories by Riya Behl
Editor : Vinutha Mallya

ਵਿਨੂਤਾ ਮਾਲਿਆ ਪੱਤਰਕਾਰ ਤੇ ਸੰਪਾਦਕ ਹਨ। ਉਹ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਸੰਪਾਦਕੀ ਪ੍ਰਮੁੱਖ ਸਨ।

Other stories by Vinutha Mallya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli