"ఇప్పుడు మాకు దొరికే చిన్నచిన్న పనులు కూడా ఈ వ్యవసాయ చట్టాలు ఆమోదించబడిన తర్వాత దొరకవు" అని తారావంతి కౌర్ ఆందోళనగా చెప్పింది.
ఆమె పంజాబ్ లోని కిల్లియన్వాలి గ్రామం నుండి పశ్చిమ ఢిల్లీ లోని తిక్రీ నిరసన స్థలానికి వచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలైన బతిండా, ఫరీద్కోట్, జలంధర్, మోగా, ముక్త్సర్, పాటియాలా, సంగ్రూర్ నుండి జనవరి 7 రాత్రి ఇక్కడకు వచ్చిన 1,500 మంది వ్యవసాయ కార్మికులలో తారావంతి తో పాటు ఇంచుమించుగా 300 మంది మహిళలు ఉన్నారు. వీరంతా పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్ సభ్యులే, ఈ యూనియన్ దళితుల జీవనోపాధి, భూ హక్కులు, కుల వివక్షకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తుంది.
జీవనోపాధి కోసం వ్యవసాయ భూములపై ఆధారపడే భారతదేశంలోని మిలియన్ల మంది మహిళలలో ఆమె ఒకరు. (మన దేశంలోని 144.3 మిలియన్ల వ్యవసాయ కార్మికులలో, కనీసం 42 శాతం మహిళలు.)
70 ఏళ్లు నిండిన తారావంతి ముక్త్సర్ జిల్లాలోని మాలౌట్ తహసీల్‌లోని ఆమె గ్రామంలో గోధుమలు, వరి, పత్తి పొలాల్లో కూలిపని చేసి రోజుకు రూ. 250-300 రూపాయలు సంపాదిస్తుంది. “అయితే అంతకుముందు ఉన్నట్లు వ్యవసాయ కూలీలకు ఎక్కువ పని అందుబాటులో లేదు. హరి క్రాంతి [హరిత విప్లవం] జరిగినప్పటి నుంచి కూలీలు బాధపడుతున్నారు.” అని ఆమె 1960 ల కాలాన్ని ప్రస్తావిస్తూ అన్నది. ఇతర వ్యవసాయ మార్పులతో పాటు, వ్యవసాయం యొక్క యాంత్రీకరణ కూడా పంజాబ్‌లో విస్తృతంగా జరిగింది.






