“మా జీవితమే ఒక జూదం. మేము ఈ రెండేళ్లు ఎలా బతికామో ఆ దేవుడికే తెలుసు.” అన్నది వి థర్మ. “నా 47 ఏళ్ళ జానపద కళా జీవితంలో. ఈ రెండేళ్లు తిండి సంపాదించుకోడానికి ఏ దారి దొరకలేదు.”
అరవైయేళ్ల థర్మ అమ్మ ఒక ట్రాన్స్ మహిళ. ఈమె తమిళనాడులోని మదురై నగరంలో ఉంటుంది. “మాకు ఒక నికరమైన సంపాదన అంటూ లేదు. ఈ కరోనా వలన మాకు సంపాదించుకోవడానికి దొరికే కొన్ని అవకాశాలు కూడా లేకుండా పోయినాయి.”
జిల్లాలో ట్రాన్స్ కళాకారులకు ఏడాదిలో మొదటి ఆరునెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో గ్రామంలో ఉన్నవారు గ్రామ పండగలను చేసుకుంటారు, గుడులలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ ఈ లాక్ డౌన్ ల మూలంగా పెద్ద మొత్తంలో జనాభా ఒక చోట గుమిగూడడం పై ఉన్న ఆంక్షల వలన ట్రాన్స్ మహిళల మీద అమితమైన ప్రభావం పడింది. రాష్టంలో దగ్గరగా 500 మంది ట్రాన్స్ మహిళా కళాకారిణులు ఉన్నారని థర్మ అమ్మ(ఆమెను అలా పిలుస్తారు), రాష్ట్ర ట్రాన్స్ మహిళల నాటక మరియు జానపద కళల సంఘం సెక్రటరీ చెబుతుంది.
థర్మ అమ్మ ఒక అద్దె ఇంట్లో రైల్వే స్టేషన్ దగ్గరగా తన తన మేనల్లుడితో కలిసి నివసిస్తుంది. ఆమె మేనల్లుడు పూలు అమ్ముకుంటాడు, అతనికి ఇద్దరు పిల్లలు. ఈ నగరంలో ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నప్పుడు, ఆమె ట్రాన్స్ వ్యక్తులు గుడుల వద్ద కళాప్రదర్శన చేయడం చూసింది.












