ఖాండవ వనం
ఖాండవ వనం తగలబడిపోతోంది, ధర్మరాజా!
దట్టమైన నల్లని పొగ
అడవినుండి పైకెగసి
మా ముక్కుపుటల్లోకి అడవి జంతువుల
వేగంతో ఎగబాకి, శ్వాసకోశలలోని శూన్యాన్ని ఆక్రమిస్తోంది
చీకట్లో నిప్పు కణాల లాగా కళ్లు మండుతున్నాయి
భయంతో నాలుకలు బిగుసుకుపోయాయి
ఎండు ద్రాక్షలలా మారిపోయిన మా
ఊపిరితిత్తుల నుండి నల్లటి చిక్కటి పసరు కారుతోంది.
దేశం ఊపిరి ఆడక తల్లడిల్లుతోంది!
యోగిరాజా!
ఖాండవ వనం అగ్నికి ఆహుతి అవుతోంది!!
నగరంలోని ధనికులు దురాశతో ఇచ్చిన నైవేద్యాన్ని ఆరగించినా,
పాలకులు కుంచిత బుద్ధితో ఆహుతిచ్చిన వనాన్ని ఆక్రమించినా,
అది చాలక, బ్రాహ్మణ వేషంలో అత్యాశాపరుడైన అగ్ని దేవుడు
ఇంకా ఇంకా ఆక్సిజన్ కావాలని ఆబగా అరుస్తున్నాడు.
తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు
పచ్చని చెట్ల రక్తాన్ని తాగాలని ఉవ్విళ్లూరుతున్నాడు
మాడిపోయిన జంతు శవాల కోసం లొట్టలేస్తున్నాడు
మండే మానుల చిటపట శబ్దాల వెనుక నుండి వస్తోన్న
మానవుల ఆర్తనాదాలు అతడికి వినసొంపుగా ఉన్నాయి
"తథాస్తు" అని అన్నాడు కృష్ణుడు.
నీ కోరిక సిద్ధిస్తుంది.
"ఆ పని పూర్తి చేస్తాం" అని అర్జునుడు
తన మీసం మెలేస్తూ చెప్పాడు --
ఖాండవ వనం తగలబడిబోతోంది...
ఖాండవ వనం తగలబడిబోతోంది
యోగేశ్వరా!"
ఊపిరి అందక, జంతువులు
కేకలు పెడుతూ పరుగులు తీస్తున్నాయి
తప్పించుకుంటోన్న పక్షుల రెక్కలు పట్టుకుని
అగ్ని దేవుడు వాటిని తిరిగి మంటల్లోకి పడేస్తున్నాడు;
భిల్, కోల్, కిరాట్, నాగ్ --
అడవుల్లో ఉండే అనాగరికమైనవిగా ముద్ర వేసిన జాతులు,
అరణ్యాన్ని వదిలి పరిగెడుతున్నాయి,
కాస్తంత ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతూ
తీవ్రమైన క్షోభతో కిందపడుతున్నాయి."
త్రాహిమాం !
కాపాడండి! ఎవరైనా కాపాడండి!
మత్తెక్కిన కళ్లతో ఆ అడవి పొలిమేరల్లో
కృష్ణుడు నిలబడి ఉన్నాడు
మంటల నుండి తప్పించుకునేందుకు
ప్రయత్నిస్తూ పరిగెత్తే వారందరినీ
అర్జునుడు దీక్షగా
తిరిగి మంటల నరకంలోకి పడేస్తున్నాడు
మహాభారత విజయ యోధులారా
మాకంటూ కాస్తంత ఆక్సిజన్‌ను ఇవ్వండి!
ఈ భారత దేశం మీదే
ఈ మహాభారతం మీదే
ఈ భూమి, ఈ సంపద
ఈ ధర్మం, ఈ నియమాలు
గడిచిన కాలం
రాబోయే కాలం
అంతా, అంతా మీదే
మధుసూదనా, మాకు కావాల్సిందల్లా
ఒకే ఒక్క ఆక్సిజన్ సిలిండర్!
అగ్నికి ఆజ్యం కాదు ఈ ఆక్సిజన్
మా జీవనాధారం ఇది
నువ్వు చెప్పింది గుర్తు తెచ్చుకో
అగ్ని ఆత్మను దహింపజాలదు!
కానీ ఈ అడవే మాకు ఆత్మ వంటిది
అదే ఇప్పుడు తగలబడిపోతోంది
ఖాండవ వనం తగలబడిబోతోంది
గీతేశ్వరా!
మహా చితి మంటలాగా
ధూ ధూ ధూ
అంటూ శబ్దం చేస్తూ ఆహుతైపోతోంది!"



