"క్విట్ ఇండియా ఉద్యమంలో మీ భర్త బైద్యనాథ్ 13 నెలలు జైలులో ఉన్నప్పుడు మీకు చాలా కష్టంగా ఉండుంటుంది కదా?" నేను పురూలియాలో భవానీ మహాతోని అడిగాను. "ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని నడుపుతూ..."
"అతను ఇంటికి తిరిగి వచ్చాక, అదింకా చాలా ఘోరంగా ఉండేది," ఆమె ప్రశాంతంగా, కానీ దృఢంగా చెప్పారు. "అతను తన స్నేహితులను తీసుకొస్తూనే ఉండడం, లేదా నేను వారి కోసం వండుతూ ఉండటం, వారు ఆహారాన్ని తీసుకెళ్ళడం- ఇలా ఉండేది. ఒకోసారి 5, 10, 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నాకు ఒక్క క్షణమైనా విశ్రాంతి దొరికేదికాదు."
"కానీ క్విట్ ఇండియా ఉద్యమంతో మీ అనుబంధం తప్పనిసరిగా ..."
"దానితో గానీ, లేదా అలాంటిదే మరోదానితోనైనా గానీ నేనేం చేస్తాను?" ఆమె అడిగారు. “ఆ పోరాటంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా భర్త బైద్యనాథ్ మహాతో ఆ ఉద్యమాన్ని చేశారు. నేను ఒక పెద్ద కుటుంబాన్ని చూసుకోవడంలో ఊపిరిసలపకుండా ఉన్నాను. వాళ్ళందరికీ, నేను ఎంత వంట చేయాల్సి వచ్చేది - ప్రతిరోజూ వంట పెరిగిపోతూ ఉండేది!" అంటారు భవానీ. "గుర్తుంచుకోండి, నేను పొలం పనులు కూడా చేశాను."
మేం కుంగిపోయాం. మా ముఖాల్లో ఆ నిరాశ కనిపిస్తూండవచ్చు. ఇప్పటికీ జీవించి ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల కోసం వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్‌లోని ఈ మారుమూల ప్రాంతానికి మేం చాలా దూరమే వచ్చాం. మన్‌బజార్ I బ్లాక్‌లోని చెపువా గ్రామంలో ఆ పాత్రకు సరిపోయిన గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నారు; భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన చారిత్రాత్మక పోరాటంతో ఎటువంటి సంబంధాన్నీ నిరాకరించినవారు.
భవానీ మహతో వయసు 101 నుండి 104 సంవత్సరాల మధ్య ఎక్కడైనా ఉండవచ్చు. ఆమె చాలా స్పష్టతతో, నిర్ణయాత్మకతతో మాట్లాడతారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల వయస్సును డాక్యుమెంట్ చేయడం చాలా చిక్కులతో కూడుకున్నది. ఒక శతాబ్దం క్రితం ఆమె జన్మించినప్పుడు, ఇది దాదాపు ఉనికిలో ఉండివుండదు. కానీ ఆమె దివంగత భర్తకు సంబంధించిన రికార్డుల ద్వారా, 70ల వయస్సులో ఉన్న ఆమె కొడుకుతో సహా ఆమె పెద్ద కుటుంబంలోని సభ్యుల ద్వారా మేము భవానీ వయస్సును గురించి ఒక అంచనాకు రాగలిగాము. పురులియాలో మేము సందర్శిస్తున్న కొన్ని గ్రామాలలో ఆమె కంటే కొంచెం చిన్నవారైన సమకాలికుల నుండి కూడా.
ఏమైనప్పటికీ, ఇక్కడ పనిచేయని ఆధార్ కార్డ్ వ్యవస్థ ద్వారా ఆమె తరానికే చెందిన వ్యక్తులకు ఇష్టానుసారంగా అందజేసిన వయస్సుల కంటే ఇది మరింత నమ్మదగిన లెక్క. అక్కడ, భవానీ పుట్టిన సంవత్సరంగా 1925ను కేటాయించారు. ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడామెకు 97 ఏళ్లన్నట్టు.
భవానీకి 104 సంవత్సరాలని ఆమె కుటుంబ సభ్యులు చెపుతున్నారు.









