“భదోహి తివాచీల జిల్లా. ఇక్కడ అది తప్ప వేరే పని లేదు,” అని 40లలో వయసున్న నేత కార్మికుడు అఖ్తర్ అలీ చెప్పారు. "నేను నా బాల్యాన్ని ఇక్కడే గడిపాను, ఆ విధంగానే నేతపని నేర్చుకున్నాను." అయితే, తివాచీల తయారీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో అలీ ఇప్పుడు బట్టలు కుట్టే పనిని చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ డివిజన్‌లో ఉన్న భదోహి జిల్లా దేశంలోనే అతిపెద్ద తివాచీలు నేసే సమూహానికి కేంద్రంగా ఉంది. ఈ సమూహంలో మీర్జాపూర్, వారణాసి, ఘాజీపూర్, సోన్‌భద్ర, కౌశాంబి, అలహాబాద్, జౌన్‌పూర్, చందౌలీ జిల్లాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ పెద్ద సంఖ్యలో మహిళలతో సహా దాదాపు 20 లక్షల మంది గ్రామీణ కళాకారులకు ఉపాధిని కల్పిస్తోంది.
ఇక్కడ నేత ప్రక్రియ ప్రత్యేకత ఏమిటంటే, పోగులను చేతితో ముడివేసి నిలువు మగ్గాలపై తివాచీలను నేస్తారు. ఈ ముడులు చదరపు అంగుళానికి 30 నుండి 300 వరకు ఉంటాయి. ఈ ప్రక్రియ, ఉపయోగించే ముడి పదార్థాలు - ఉన్ని, పత్తి, పట్టు దారాలు - కనీసం రెండు శతాబ్దాలుగా మార్పులేకుండా ఒకే విధంగా ఉన్నాయి. మగ్గాలపై చేతితో ముడులు వేసే నైపుణ్యాన్ని ఈ హస్తకళాకారులు తమ పిల్లలకు వారసత్వంగా అందజేస్తూవస్తున్నారు.
వారి నేత పద్ధతుల ప్రత్యేక స్వభావానికి గుర్తింపుగా, భదోహి కార్పెట్‌లకు 2010లో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ - జి ఐ) ధృవీకరణ లభించింది. ఈ గుర్తింపు పరిశ్రమకు ఊతం ఇస్తుందని భావించినప్పటికీ, ఇది తివాచీ నేతకారుల వ్యాపారాన్ని మెరుగుపరచడంలో సహాయపడలేదు.
ఉదాహరణకు, 1935లో స్థాపించిన ముబారక్ అలీ అండ్ సన్స్ భదోహి తివాచీలను బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. ఆర్డర్లు పడిపోవడంతో 2016లో వారు తమ దుకాణాన్ని మూసివేశారు. ఈ ఎగుమతుల సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ యజమాని అయిన ముబారక్ మనవడు 67 ఏళ్ల ఖాలిద్ ఖాన్ మాట్లాడుతూ, “మా తాత, నాన్న ఈ వ్యాపారమే చేసేవారు. బ్రిటీష్‌వారి కాలంలో మొదలైన మా వ్యాపారం, తివాచీలను ‘మేడ్ ఇన్ బ్రిటీష్ ఇండియా’ అనే ముద్రతో ఎగుమతి చేసేవారు." అన్నారు.


