దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని కొండవాలు ప్రాంతాలలో ఆవుల మెడలోని గంటల టైణ్-టైణ్-టైణ్ శబ్దం ఇప్పుడు చాలా తక్కువగా వినబడుతోంది. "ఇప్పుడెవరూ ఈ గంటలను తయారుచేయటంలేదు," అని హుక్రప్ప చెప్పారు. అయితే, ఆయన మాట్లాడుతున్నది మామూలుగా పశువుల మెడలో కట్టే లోహపు గంట గురించి కాదు. ఆయన స్వగ్రామమైన శిబాజీలో, పశువుల మెడలో కట్టే గంటను లోహంతో తయారుచేయరు. దాన్ని వెదురుతో, చేతితో తయారుచేస్తారు. 60ల చివరి వయసులో ఉన్న పోకచెక్కలు పండించే రైతు హుక్రప్ప కొన్ని సంవత్సరాలుగా అపురూపమైన ఈ వస్తువును రూపొందిస్తున్నారు.
"నేనింతకు ముందు పశువులను మేపుకుంటుండేవాడిని" అని హుక్రుప్ప చెప్పారు. "మేం కొన్నిసార్లు ఆవుల జాడను తెలుసుకోలేకపోయేవాళ్ళం. దాంతో, వెదురుతో వాటి మెడలో కట్టే గంటను తయారుచేయాలనే ఆలోచన వచ్చింది." కొండలలోకో, లేదా ఇతరుల పొలాల్లోకో వెళ్లిన ఆవులను గుర్తించడంలో ఈ గంటల శబ్దం వారికి సహాయం చేస్తుంది. గ్రామంలోని ఒక వృద్ధుడు అతనికి వీటిని తయారుచేయడం నేర్పిస్తానని చెప్పడంతో, అతను ముందు కొద్ది సంఖ్యలో గంటలను తయారు చేయడం ప్రారంభించారు. కాలక్రమేణా, వివిధ పరిమాణాలలో గంటలను తయారుచేయడంలో నైపుణ్యం సాధించారు. ఆయన ఉండే ప్రాంతంలో వెదురు సులభంగా దొరకడం ఇందుకు సహాయపడింది. బెల్తంగడిలోని అయన గ్రామం కర్నాటక, పశ్చిమ కనుమలలోని కుద్రేముఖ్ నేషనల్ పార్క్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉంది. ఇది మూడు రకాల గడ్డి మొక్కలకు నిలయం.
హుకరప్ప మాట్లాడే తుళు భాషలో 'బొమ్కా' అని పిలిచే ఈ వెదురు గంటను కన్నడలో 'మోంటే' అని పిలుస్తారు. శిబాజీ గ్రామ సాంస్కృతిక జీవితంలో దీనికొక ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఇక్కడి దుర్గా పరమేశ్వరి ఆలయం, దేవతకు మోంటేలను సమర్పించే సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఆలయ ఆవరణను కూడా'మోంటేతడ్క' అని పిలుస్తారు. తమ పశువులకు రక్షణ కల్పించాలనీ, తమ కోరికలు నెరవేరాలనీ భక్తులు ప్రార్థిస్తారు. వారిలో కొందరు హుక్రప్ప ద్వారా తయారుచేయించిన వెదురు గంటలను కొంటారు. “ప్రజలు దీనిని హర్కే (మొక్కుబడుల) కోసం కొనుగోలు చేస్తారు. ఒక ఆవుకు దూడలు పుట్టకపోతే(ఉదాహరణకు), వారు ఈ గంటను దేవతకు సమర్పిస్తారు,” అని అతను చెప్పారు. “ఒక గంటకు 50 రూపాయల వరకు చెల్లిస్తారు. పెద్ద గంటలైతే 70 రూపాయల వరకు అమ్ముడవుతాయి."


