“ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోదు. ఇది పెద్ద కంపెనీల వైపునే ఉంది. ఎ. పి. ఎం. సి ని కూడా వారికే/ఆ కంపెనీలకే ఇస్తున్నారు. వారు రైతులకు సహాయం చేయకుండా వీరికెందుకు సహాయం చేస్తున్నారు?” అని ఉత్తర కర్ణాటకలోని బెలగావి జిల్లాకు బెలగావి తాలూకాకు చెందిన వ్యవసాయ కూలి, శాంతా కాంబ్లే అడిగారు.
మధ్యాహ్నం సమయంలో నగరం యొక్క నడిబొడ్డైన మెజెస్టిక్ ప్రాంతంలోని బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్ డివైడర్ మీద కూర్చుని, ఆమె ‘కేంద్రా సర్కారా దిక్కారా’ (మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము) అనే నినాదాలు వింటోంది.
రైతుల గణతంత్ర దినోత్సవ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి శాంతా (50) జనవరి 26 ఉదయం బస్సులో బెంగళూరు చేరుకున్నారు. ఆ రోజు ఉదయం, కర్ణాటక నలుమూలల నుండి రైతులు మరియు వ్యవసాయ కూలీలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రీడమ్ పార్కుకు వెళ్ళడానికి రైళ్లు మరియు బస్సుల ద్వారా మెజెస్టిక్ చేరుకున్నారు అంతేగాక మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు మద్దతుగా జరిపిన ఒక సమావేశానికి హాజరవ్వాలనుకున్నారు.
తన ఊరిలో శాంతా, బంగాళాదుంప, పప్పుధాన్యాలు మరియు వేరుశనగ వంటి పంటలను నాటడం, వ్యవసాయ భూమిలో కలుపు తీయడం వంటి పనులకు ఒక రోజు పనికి 280 సంపాదిస్తుంది. వ్యవసాయ పని లేనప్పుడు ఆమె MGNREGA పనులు చేస్తుంది. ఆమె కుమారులు, 28 మరియు 25 సంవత్సరాల వయస్సు గలవారు, MGNREGA స్కీం కింద భవన నిర్మాణ పనులు చేస్తారు.
"[కోవిడ్ -19] లాక్డౌన్ సమయంలో మాకు సరైన తిండి, నీరూ లేదు" అని ఆమె చెప్పింది. “ప్రభుత్వం మా సంగతి పట్టించుకోదు.” అన్నది.
రైల్వే స్టేషన్ యొక్క పార్కింగ్ ప్రాంతంలోని రైతుల బృందం, “మాకు ఎపిఎంసి కావాలి. కొత్త చట్టాలను రద్దు చేయాలి.” అని నినదిస్తున్నారు.








