ఆమె ఖాళీ చేతులతో ఆ పేవ్‌మెంట్ పై నిల్చొని ఉంది. ఘనీభవించిన శోకంలా. వారి విషపు పంజాల నుండి దేనినీ తిరిగి పొందేందుకు ఆమె ఇంక ప్రయత్నించటం లేదు. ఆమె తన తలలో అంకెలను కుదురుగా ఉంచుకోలేకపోయింది, తనకు కలిగిన నష్టాలను లెక్కించడం మానేసింది. అపనమ్మకం నుండి భయం నుండి ఆవేశం నుండి ప్రతిఘటన నుండి పూర్తి నిరాశ నుండి మొద్దుబారిపోవడం వరకు - నిమిషాల వ్యవధిలో ఆమె అనేక అవస్థలను దాటేసింది. ఇప్పుడామె వీధికి ఇరువైపులా నిల్చొని చూస్తున్న అనేకమంది ఇతరుల వలె, ఆ అల్లకల్లోలాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. గడ్డకట్టిపోతోన్న కన్నీళ్ళు కన్నుల నుండి ధారాపాతంగా ఉప్పొంగుతుండగా, దుఃఖపు ముద్ద నొప్పిగా గొంతులో కదలాడుతుండగా. ఆమె జీవితం బుల్‌డోజర్ పాదాల కింద నలిగిపోయింది. కొన్ని రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు చేసింది ఏ మాత్రం చాలదన్నట్టు.
కాలం కొంతకాలంగా మారుతున్నదని నజ్మాకు తెలుసు. పాలు తోడు పెట్టేందుకు చల్ల అడగడానికి వెళ్ళినప్పుడు రష్మీ ఆమెను చూసిన విధానం మాత్రమే కాదు. షాహీన్ బాగ్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలతో తాను చేరినప్పటి నుండి, లోతైన కందకాలు చుట్టుముట్టి ఉన్న ఒక చిన్న నేల పీలికపై తాను ఒంటరిగా నిలబడినట్టుగా, క్రమం తప్పకుండా వస్తున్న ఒక పీడకల గురించి కాదు. ఈ మారుతున్నది ఆమె లోపల కూడా ఉంది, తన గురించి, తన పిల్లల గురించి, తన దేశం గురించి తానెలా అనుకుంటున్నదీ. ఆమె భయపడింది.
తమ స్వంతం అనుకున్నది దోపిడీకి గురికావటం కుటుంబ చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. మతకల్లోలాలు వ్యాపింపజేసిన విద్వేషపూరిత జ్వాలల వల్ల పుట్టిన ఆ బాధ గురించిన భావన తన అమ్మమ్మకు కూడా తెలుసునని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఒక చిన్నారి వేలు ఆమె చున్నీని పట్టి లాగింది. వెనుతిరిగి చూడగానే, ఒక నిస్సహాయమైన చిరునవ్వు ఆమెను పలకరించింది. అప్పుడే ఆమె ఆలోచనలు మళ్ళీ అడవి పువ్వుల్లా వికసించాయి…


