ఇద్దరికీ 17 ఏళ్లు, ఇద్దరూ గర్భిణులు. వారిద్దరూ ఒకేసారి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. కళ్ళు దించుకు కూర్చోమని తల్లిదండ్రులు చెప్పిన మాటలను కొన్నిసార్లు మరచిపోతున్నారు. కాని తరువాత ఏమి జరగబోతోందో అని ఇద్దరూ భయపడుతున్నారు.
సలీమా పర్వీన్, అస్మా ఖాతున్ (పేర్లు మార్చబడ్డాయి) ఇద్దరూ గత సంవత్సరం 7వ తరగతి చదువుతూ ఉండేవారు, అయితే 2020 విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే గ్రామ పాఠశాల మూసివేయబడింది. లాక్‌డౌన్ కొనసాగుతున్నందున పాట్నా, ఢిల్లీ ముంబైలో పని కోసం వలస వెళ్లిన మగవారు మళ్ళీ తమ స్వస్థలమైన బీహార్‌లోని అరారియా జిల్లాలోని బంగాలీ తోలా అనే కుగ్రామానికి వచ్చారు. ఆ తరవాత పెళ్లి సంబంధాలు వెతుక్కునే గొడవలో పడిపోయారు.
“కరోనా మే హుయీ షాదీ,” అని ఇద్దరిలో ఎక్కువ మాట్లాడే అస్మా చెప్పింది. "కరోనా సమయంలో నేను పెళ్లి చేసుకున్నాను."
సలీమా నికాహ్ (వివాహ వేడుక) రెండు సంవత్సరాల క్రితం ఘనంగా జరిగింది, ఆమెకు 18 సంవత్సరాల వయస్సు వచ్చాక, ఆమె తన భర్తతో సహజీవనం చేయడం ప్రారంభింపజేయాలన్న ఆలోచనతో పెద్దవారంతా ఉన్నారు. ఆ తర్వాత లాక్‌డౌన్ వలన, టైలర్‌గా పనిచేస్తున్న ఆమె 20 ఏళ్ల భర్త, అతని కుటుంబం - వారు అదే కుగ్రామంలో నివసిస్తున్నారు - ఆమె అత్తగారింటికి రావాలని పట్టుబట్టారు. అది దాదాపు జూలై 2020లో జరిగింది. అతను పని లేకుండా రోజంతా ఇంట్లోనే ఉన్నాడు, మిగిలిన మగవారు కూడా ఇంట్లోనే ఉన్నారు - కాబట్టి అదనంగా పనిచేసే వారుంటే ఉపయోగం.
అస్మాకు అయితే, ఈ మాత్రం సమయం కూడా లేకపోయింది. 2019 లో ఆమె 23 ఏళ్ల అక్క క్యాన్సర్‌తో మరణించింది. గత సంవత్సరం జూన్‌లో, ప్లంబర్ గా పనిచేస్తున్న ఆమె అక్క భర్త, అస్మాను వివాహం చేసుకోవాలని లాక్‌డౌన్ సమయంలో పట్టుబట్టాడు. ఈ వేడుక జూన్ 2020లో జరిగింది.
ఇద్దరు అమ్మాయిలకూ పిల్లలు ఎలా పుడతారో తెలియదు. "ఈ విషయాలు మా అమ్మ చెప్పలేదు," అని అస్మా తల్లి రుక్సానా చెప్పింది, అమ్మాయిలు మరికాస్త ముసిముసిగా నవ్వుతున్నారు. "లాజ్ కీ బాత్ హై [ఇది ఇబ్బందికరమైన విషయం]." వధువు భాభి , ఆమె సోదరుడి భార్య, ఇటువంటి సమాచారం ఇవ్వగలదు అని అందరూ భావిస్తారు, అయితే సలీమా, అస్మా ఇద్దరూ వదిన మరదళ్లు, మరొకరికి ఈ సలహాను ఇవ్వగల పరిజ్ఞానం ఇద్దరిలోనూ లేదు.










