శాంతి మాంఝి ఈ జనవరి లో మొదటిసారి అమ్మమ్మ అయింది. ఆమె వయస్సు 36 ఏళ్ళు. కానీ అదే రోజు రాత్రి ఆమె ఇంకొక పని మొదటిసారి చేసింది. రెండు దశాబ్దాలలో ఏడుగురు పిల్లలను ఒక డాక్టర్ గాని నర్స్ గాని లేకుండా ఇంటిలోనే ప్రసవించిన ఈ గట్టి మహిళ, ఈ సారి మాత్రం ఆసుపత్రికి వచ్చింది.
“నా కూతురు గంటల తరబడి నొప్పులు భరించింది కానీ గర్భంలో శిశువు బయటకు రాలేదు. అందుకని ఒక టెంపో ని పిలిపించాము.” ఆమె పెద్ద కూతురు మమతకి ఇంట్లోనే నొప్పులు మొదలైనప్పుడు అన్నదామె. టెంపో అంటే ఒక మూడు చక్రాల బండి, ఇది ఆమె గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న షియోహార్ పట్టణం నుండి ఆమె ఇంటికి రావడానికి ఒక గంట సమయం తీసుకుంది. మమతను వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తరవాత ఎన్నో గంటలకు ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది.
“అతను 800 తీసుకున్నాడు”, శాంతి గుర్రుమంది. ఆమె ఇంకా టెంపోకి అయిన ఖర్చు గురించి కోపంగా ఉంది. “మా టోల(గ్రామం) లో ఎవరూ ఆసుపత్రికి వెళ్లరు. అసలు మాకు అంబులెన్సు అనేది ఉంటుందని కూడా తెలీదు.”
శాంతి ఆ రాత్రి ఇంటికి రావలసి వచ్చింది. ఆమె నాలుగేళ్ల చిన్నబిడ్డకు నిద్రపోయే లోపల ఏమన్నా తినిపించాలి. “నేనొక అమ్మమ్మని అయ్యాను.” అన్నదామె. “కానీ నాకు అమ్మ బాధ్యతలు కూడా ఉన్నాయి.” మమత, కాజల్ కాకుండా ఆమెకు ఇంకా ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
మాంఝి కుటుంబం, ఉత్తర బీహార్ లోని షియోహార్ జిల్లా, అదే బ్లాక్ లో, మధోపూర్ అనంత్ గ్రామంలోని కిలోమీటర్ దూరంలో గుంపుగా ఉన్న గుడిసెల మధ్య ముసహర్ టోల అనే ప్రదేశం లో ఉంటారు. టోలలో దగ్గరగా 40 మట్టి, వెదురు ఇళ్లలో 300-400 మనుషులు ఉంటారు. అందరూ ముసహర్ కులానికి చెందినవారు. వీరు మహాదళిత్ వర్గం వారు- బీహార్ లో వీరిని అట్టడుగు వర్గానికి చెందినవారిగా పరిగణిస్తారు. వీరు తమ ఇరుకైన ఇళ్లల్లో ఒక మూల కొన్ని మేకలను, ఆవునూ కట్టేస్తారు.










