మేము అతనిని చూశాం. కానీ చూసింది నమ్మలేదు. దగ్గరగా కారు తీసుకెళ్లి, దిగి, అతని కేసి తేరిపారా చూశాం . మేము చూసింది నిజమే. అయినా సరే, మేము నమ్మలేదు. రతన్ బిశ్వాస్ తన సైకిల్ పైన అయిదు వెదురు బొంగులు - ఒక్కోటి 40-45 అడుగుల పొడవు ఉన్నవి - తాడు వేసి కట్టేశాడు. తన గ్రామం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపుర రాజధాని అగర్తలాలో మార్కెట్ కు ఈ బరువు తోసుకుని వెడుతున్నాడు. సైకిల్ దాటి విస్తరించిన వెదురు బొంగుల కొసలు కనుక చిన్న రాతిని కానీ, రోడ్డు మీద బొడిపెలను కానీ తాకాయా, సైకిల్, సైకిల్ యజమాని, వెదురు కట్టెలు - అన్నీ మహా బాధాకరమైన పద్ధతిలో కింద కుప్పకూలుతాయి. వెదురు బొంగులకు ఉన్నదానికంటే తేలికగా కనిపించే ఒక లక్షణం ఉంది. రెండు కర్రలను కలిపి గట్టిగా కట్టివేయడంతో అయిదు బొంగులు నాలుగులా కనిపిస్తున్నాయి. ఈ అయిదు కట్టెల కలిసిన బరువు 200 కిలోలు. బిశ్వాస్ కి ఆ సంగతి తెలుసు. మాతో సరదాగా మాట్లాడిన బిశ్వాస్ తన విచిత్రమైన సామానుని ఫోటో తీస్తామంటే సంతోషంగానే అంగీకరించాడు. కానీ మేము ఆ సైకిల్ ముందుకి నడిపించేందుకు ప్రయత్నిస్తాం అంటే మాత్రం ఒప్పుకోలేదు. దానిలో ఉన్న ప్రమాదం ఏమిటో అతనికి తెలుసు.
' కేవలం అయిదు అడుగుల పొడుగు ఉన్న ఆ సైకిల్ పైన ఆ పొడవాటి వెదురు బొంగులు - అంత బరువు - అసలు ఎలా మోసుకెళ్లగలవు ?' బిశ్వాస్ చిరునవ్వు నవ్వాడు. సైకిలుకి అమర్చి ఉన్న చెక్క పట్టీలను మాకు చూపించాడు. అవి కూడా వెదురుతో చేసినవే. సైకిల్ ముందు భాగంలో రెండు నిలువుగా పెట్టాడు. అవి మళ్ళీ పైకి సైకిల్ అడ్డం బార్ వైపు వచ్చాయి. ఆ పైన వాటిని కలిపి కట్టాడు. మరో వెదురు చెక్క పట్టీని బైక్ కారియర్ మీద అడ్డంగా అమర్చాడు.





