సన్తో తాఁతి ఒక ఆదివాసి - కానీ అతన్ని ఒక వర్గానికి మాత్రమే చెందినవాడని అనలేం. ఇంచుమించు ఒకటిన్నర శతాబ్దంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ల నుండి వలస వచ్చిన ఆదివాసీలు అస్సామ్ తేయాకు తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ సమూహాలకు చెందిన అనేకమంది వారసులు అక్కడి ఆదివాసీ తెగలతోనూ, ఇతర సామాజిక సమూహాలతోనూ కలిసిపోయారు. మొత్తం ఈ సమూహాలను తరచుగా 'తేయాకు తెగలు (టీ ట్రైబ్స్)' అని పిలుస్తుంటారు
వీరిలో దగ్గరదగ్గరగా 60 లక్లలమంది అస్సామ్‌లో నివసిస్తున్నారు. వీరిని వారివారి మూలరాష్ట్రాలలో షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించినప్పటికీ, ఇక్కడ వారికి ఆ హోదాను ఇవ్వటంలేదు. వీరిలో 12 లక్షల మంది రాష్ట్రంలోని 1000కి పైగా ఉన్న తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు.
వారి రోజువారీ జీవితాలలోని కష్టాలు, తీవ్రమైన శ్రమ వారిలో చాలామంది ఆకాంక్షలను తరచుగా అణిచివేస్తుంటాయి, కానీ సన్తో ఆశలను మాత్రం కాదు. అతను తన చుట్టూ ఉన్నవారి యాతనలను గురించే తాను పాడే ఝూమూర్ పాటలలో తెలియజేస్తుంటాడు. మనం తాగే ఒక కప్పు తాజా తేనీటి వెనుక ఉండే- తేయాకు తోటలలో ఎండకు ఎండి, వానకు తడిచి శ్రమించే వ్యక్తుల - కష్టాన్ని గుర్తుచేస్తాడు.