“హుర్‌ర్‌ర్...
హేహేహేహే... హో... హేహేహేహే... హో”
ఉన్నట్టుండి ఆ పండ్లతోట పైన ఉన్న ఆకాశం లెక్కలేనన్ని పక్షులతో నిండిపోయింది. ఆ రెక్కల జీవులు, వాటిని తరిమివేయడానికి సూరజ్ చేస్తున్న శబ్దాలకు భయపడి ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిపోయాయి. ఈ బేరీ(Pear) పండ్లతోట సంరక్షకుడిగా, ఆకలిగొన్న పక్షులను పండిన పండ్లపై వాలకుండా దూరంగా తరిమేయడం అతని పని. వాటిని భయపెట్టడానికి అతను బిగ్గరగా అరుస్తాడు, లేదంటే రోడా(మట్టి గడ్డ)లను కమాన్ లేదా గులేల్ (ఒడిసెల లేదా ఉండేలు)తో విసిరి భయపెడతాడు.
వాయువ్య పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా అంచున ఉన్న పట్టీ పట్టణం పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందింది. బేరీ, అత్తి (peach) వంటి పండ్లచెట్ల సంరక్షణ కోసం ఏటా వలస కార్మికులు ఇక్కడికి వస్తుంటారు. ఏ వేళలోనైనా కిందికి వాలి పండిన పండ్లను ముక్కుతో పొడిచి తినే పక్షులను దూరంగా తరిమేయడం వారి పని. ఈ పండ్ల తోటలకు కాపలా కాసే సూరజ్ వంటి కార్మికులను రాఖేలు అంటారు
సూరజ్ బహర్‌దార్ కాపలా ఉన్న దాదాపు రెండు ఎకరాలున్న తోటలో దగ్గరదగ్గర 144 బేరీ చెట్లు ఉన్నాయి. ఏప్రిల్ నుండి మొదలై ఆగస్టులో ముగిసే పండ్ల కాలంలో, ఈ చెట్లన్నిటికీ 15 ఏళ్ల వయస్సున్న సూరజ్ ఏకైక సంరక్షకుడు. అతనికి నెలకు రూ. 8,000 జీతంగా యజమానులు చెల్లిస్తారు.
“చెట్లు పూతవేయడం ప్రారంభించిన వెంటనే, భూస్వాములు తమ తోటలను గుత్తకు ఇస్తారు. వాటిని గుత్తకు తీసుకున్న టేకేదార్లు రాఖేలను పెట్టుకుంటారు,” అని సూరజ్ మాతో చెప్పాడు. వీరిలో అనేకమంది రాఖేలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలు









