జబ్ ప్యార్ కియా తో డర్నా
క్యా...ప్యార్ కియా కోయి చోరీ నహీ...ఘుట్ ఘుట్ కర్ యూఁ మర్నా క్యా…
ప్రేమలో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి...
ప్రేమ నేరం కాదే... ఇలా ఊపిరాడక ఎందుకు చనిపోవాలి…
60ల నాటి క్లాసిక్ సినిమా మొఘల్-ఎ-ఆజమ్ లోని ఈ పాటను కొంత సేపటి నుండి కూని రాగం తీస్తోంది విధి. ఆమె సెంట్రల్ ముంబైలో కొత్తగా అద్దెకు తీసుకున్న గదిలో ఉంది. పాట పాడటం ఆపి, “మేం కూడా ఏ నేరం చేయలేదు. మరి మేమెందుకు భయపడి బ్రతకాలి?” అని ఆమె ప్రశ్నించింది.
అది ఆమె మాట వరసకు వేసిన ప్రశ్న కాదు, ఎంతో ఇబ్బంది పెట్టే ప్రశ్న. చంపేస్తారేమోనన్న ఆమె భయం నిజమైనదే. తన కుటుంబ సభ్యులకు ఎదురు తిరిగి, తను ప్రేమించిన వ్యక్తితో – పాఠశాలలో ఆమె తోటి విద్యార్థిని ఆరుషి – పారిపోయివచ్చినప్పటి నుండి ఆ భయంతోనే ఆమె బతుకుతోంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ వారి బంధానికి చట్టబద్ధత వచ్చే మార్గం మాత్రం సుదీర్ఘమైనది, దుర్భరమైనది, కఠినమైన సవాళ్ళతో నిండి ఉన్నది. వారి కుటుంబాలు వారి సంబంధాన్ని ఆమోదించవని భయపడుతున్నారు. అలాగే, సమాజంలో స్త్రీగా గుర్తించబడిన ఆరుషి, తన లైంగిక గుర్తింపు కోసం చేస్తున్న పోరాటాన్ని కూడా వారు అర్ధం చేసుకోరని తెలుసు. ఆరుషి తనను తాను ఒక ట్రాన్స్ మ్యాన్‌గా గుర్తించుకున్నాడు. ఆరుష్ అనే పేరును ఎంచుకున్నాడు.
మహానగరానికి వచ్చి, తమ కుటుంబాల నుంచి విముక్తి పొందామని వారు భావించారు. విధి కుటుంబం ఠానే జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తుంది. ఇది పొరుగున ఉన్న పాలఘర్ జిల్లాలోని ఆరుష్ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. విధి (22), మహారాష్ట్రలో ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి)గా జాబితా చేసిన అగ్రి సముదాయానికి చెందినది. ఆరుష్ (23), కున్భీ సముదాయానికి చెందినవాడు; అంటే ఒబిసి అయినప్పటికీ, సామాజికంగా వారి గ్రామాల్లో ఉన్న కఠినమైన కులాల శ్రేణిలో అగ్రి కంటే కున్భీ ‘నిమ్న’ వర్గం కిందకి వస్తుంది.
ఇద్దరూ తమ ఇళ్ళను వదిలి ముంబయికి వచ్చి ఒక సంవత్సరం అయింది; తిరిగి వెళ్ళే ఉద్దేశ్యం వాళ్ళిద్దరికీ లేదు. తన కుటుంబం గురించి ఆరుష్ అంతగా ఏమీ పంచుకోలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు: “నేను ఒక కచ్చా ఇంట్లో (పూరి గుడిసె) నివసించేవాడిని. ఆ విషయమై నేను ఎప్పుడూ సిగ్గుపడేవాడిని. దాని గురించి నేను ఆయి (తల్లి)తో చాలాసార్లు గొడవపడ్డాను కూడా.”
![Vidhhi and Aarush left their homes in the village after rebelling against their families. They moved to Mumbai in hope of a safe future together](/media/images/02-IMG_1352-A-Love_and_a_place_of_ones_own.max-1400x1120.jpg)
విధి , ఆరుష్‌లు వారి కుటుంబాలపై తిరుగుబాటు చేసి గ్రామంలోని తమ ఇళ్లను విడిచిపెట్టారు. సురక్షితమైన భవిష్యత్తును ఆశిస్తూ ఇద్దరూ కలిసి ముంబైకి వెళ్లారు
ఆరుష్ తల్లి కోడిగుడ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు రూ.6,000 సంపాదిస్తారు. “ బాబా (తండ్రి) గురించి అడగవద్దు. వడ్రంగి, వ్యవసాయ కూలీ లాంటి ఏ పనైనా చేస్తాడు. అతను సంపాదించిన డబ్బును తాగడానికి ఖర్చు చేసి, ఇంటికి వచ్చి ఆయి ని, మమ్మల్ని కొట్టేవాడు,” అని ఆరుష్ గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత, అనారోగ్యం పాలవడంతో, అతని తండ్రి పని మానేసి, భార్య సంపాదనతో కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఈ సమయంలోనే, పాఠశాలకు సెలవు కావడంతో, ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, మెడికల్ స్టోర్‌లో పని చేయడం మొదలుపెట్టాడు ఆరుష్.
*****
2014లో, 8వ తరగతి చదవడానికి కొత్త పాఠశాలకి మారినప్పుడు, విధిని మొదటిసారి కలిశాడు ఆరుష్. ఆ మాధ్యమిక పాఠశాలకు వెళ్ళడానికి అతనికి ఇంటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. “మా ఊరిలో జిల్లా పరిషత్ పాఠశాలలో 7వ తరగతి వరకే ఉంది. ఆపై చదవడానికి మేం బయటకు వెళ్ళవలసి వచ్చింది.” కొత్త బడిలో చేరిన మొదటి సంవత్సరంలో, వారు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోలేదు. “మేము అగ్రి ప్రజలతో మమేకం కాలేకపోయాం. వారికి వేరే సమూహం ఉండేది; విధి దానిలో భాగం.” అని ఆరుష్ తెలిపాడు.
9వ తరగతి చదువుతున్నప్పుడు వారి స్నేహం వికసించింది. ఆరుష్ విధిని ఇష్టపడటం మొదలయింది.
ఒక రోజు, అందరూ ఆడుకుంటున్న సమయంలో, తన మనసులో భావాలను విధికి చెప్పాడు ఆరుష్. తను ఆమెను ఇష్ట పడుతున్నానని తడబడుతూ చెప్పాడు. అప్పు డామెకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అయోమయంలో పడింది. “గతంలో ఒక అమ్మాయితో తనకున్న సంబంధం గురించి కూడా ఆరుష్ నాకు చెప్పాడు. అది తప్పు కాదు కానీ వాళ్ళు (ఇద్దరు అమ్మాయిలు) కలిసి ఉండటం వింతగా అనిపించింది నాకు,” విధి వివరించింది
“మొదట నేను ‘కుదరదని’ చెప్పాను. కానీ, చాలాకాలం తర్వాత, చివరికి నేను తనని అంగీకరించాను. ‘నాకూ ఇష్టమని’ ఎందుకు చెప్పానో నాకు తెలియదు. అదలా జరిగిపోయింది. నేను అతన్ని నిజంగా ఇష్టపడ్డాను. తప్పు-ఒప్పు లాంటివాటి గురించి నా మనసు ఆలోచించలేదు. మా క్లాసులో ఎవ్వరికీ మా గురించి తెలియదు,” అని ఆమె తేలికగా నిట్టూర్చింది. “ప్రపంచమంతా మమ్మల్ని ఇద్దరు అమ్మాయిలుగా, మంచి స్నేహితులుగా మాత్రమే చూసింది” అంటూ ఆరుష్ మాట కలిపాడు.
అయితే, వారి స్నేహం గురించి, కుల భేదం గురించి వాళ్ళ బంధువులు వ్యాఖ్యానించడం ప్రారంభించారు. “ఒకప్పుడు, అగ్రి సముదాయానికి చెందినవాళ్ళు మమ్మల్ని (కున్భీ వర్గాన్ని) పనివాళ్ళుగా చూసేవారు; తక్కువ కులంగా పరిగణించేవారు. ఇది చాలాకాలం క్రితం జరిగింది. కానీ ఇప్పటికీ కొంతమంది ఆలోచనల్లో ఇదే భావన ఉంది,” ఆరుష్ వివరించాడు. కొన్ని సంవత్సరాల క్రితం, తమ గ్రామానికి చెందిన ఒక హెటిరోసెక్సువల్ (భిన్న లింగ సంపర్కులు) జంట పారిపోయినప్పుడు జరిగిన భయానక సంఘటనను అతను గుర్తుచేసుకున్నాడు. వారిద్దరూ ఒకరు కున్భీ, ఇంకొకరు అగ్రి సముదాయాలకు చెందినవారు; వారి కుటుంబాలు వారిని వెంబడించి మరీ కొట్టారు.
మొదట్లో, ఆరుష్ తల్లికి వారి స్నేహం ఇబ్బందిగా కనిపించలేదు. ఇద్దరు అమ్మాయిలు సన్నిహితంగా ఉంటున్నారని మాత్రమే ఆమె భావించారు. కానీ ఆరుష్ తరచుగా విధి ఇంటికి వెళ్ళడం ఆమెను ఆందోళనకు గురిచేసింది. నెమ్మదిగా ఆంక్షలు విధించారు.
![Aarush's family struggles to accept him as a trans man](/media/images/03-IMG_1337-A-Love_and_a_place_of_ones_own.max-1400x1120.jpg)
ఆరుష్ కుటుంబం అతన్ని ట్రాన్స్ మ్యాన్‌గా అంగీకరించడానికి కష్టపడుతోంది
విధి తండ్రి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ముడిసరుకును సరఫరా చేసేవారు. విధి పదమూడో ఏట, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు; తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నారు. అప్పటినుండి ఆమె తన తండ్రి, సవతి తల్లి, నలుగురు తోబుట్టువులతో – అన్నయ్య, ఇద్దరు సోదరీమణులు, ఒక (సవతి) తమ్ముడు – కలిసి నివసించేది. సవతి తల్లికి ఆరుష్ అంటే ఇష్టం లేకపోవడంతో అతనితో తరచూ గొడవపడేవారు. ప్రస్తుతం ముప్పైల వయసులో ఉన్న విధి అన్నయ్య, అప్పుడప్పుడు తండ్రితో కలిసి పని చేస్తూ, కుటుంబ సభ్యుల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించేవాడు. అక్కాచెల్లెళ్ళను కొట్టడంతోపాటు దుర్భాషలాడేవాడు.
కానీ అతనే కొన్నిసార్లు విధిని ఆరుష్ ఇంటి దగ్గర దించేవాడు. “మా అన్నయ్య ఆరుష్‌ను ఇష్టపడుతున్నానని అప్పుడప్పుడూ చెబుతుండేవాడు. అది చాలా చిరాగ్గా అనిపించేది. కానీ ఏంచేయాలో మాకు తెలిసేది కాదు,” విధి గుర్తుచేసుకుంది. “ఆరుష్ మాత్రం మౌనంగా ఉండేవాడు. మా అన్నయ్య ప్రేమ ప్రతిపాదనలను పట్టించుకునేవాడు కాదు; కనీసం అలా అయినా మేము కలుసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో.”
కానీ చివరికి, ఆరుష్ ఇంటికి విధి వెళ్ళడాన్ని ఆమె అన్నయ్య కూడా వ్యతిరేకించసాగాడు. “ఆరుష్ తనకు సానుకూలంగా స్పందించలేదన్న కారణమో లేదా మా పెరుగుతున్న సాన్నిహిత్యం వల్లనో, ఎందుకు అతనికి కోపం వచ్చిందో నాకు తెలియదు,” అని ఆమె అన్నది. ఆరుష్ తరచూ ఇంటికి ఎందుకు వస్తున్నాడు, రోజూ అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసి, మెసేజ్‌లు పంపేవాడని విధి అక్క కూడా ఆమెను అడిగేది.
ఇదే సమయంలో, ఆరుష్ తన లైంగిక ప్రాధాన్యం గురించి వ్యక్తపరచడం మొదలుపెట్టాడు. మగ శరీరంతో బతకాలని కోరుకోసాగాడు. విధితో మాత్రమే తన ఆలోచనలను పంచుకోగలిగాడు. “అప్పట్లో ‘ట్రాన్స్ మ్యాన్’ అంటే ఏమిటో నాకు తెలియదు. నేను మగ శరీరంలో ఉండాలని చాలా ఆరాటపడ్డాను.” అన్నాడు ఆరుష్.
అతను ట్రాక్ ప్యాంటు, కార్గో ప్యాంటు, టీ-షర్టులు లాంటి బట్టలు ధరించడానికి ఇష్టపడ్డాడు. ఒక మగాడిలా బట్టలు వేసుకోవాలనే అతని బహిరంగ ప్రయత్నాలు అతని తల్లిని ఇబ్బంది పెట్టాయి. దానితో ఆమె ఆ బట్టలను దాచిపెట్టడానికో, చింపడానికో ప్రయత్నించారు. ఆరుష్ మగ వేషంలో ఉన్నప్పుడు ఆమె అతడిని తిట్టేవారు, కొట్టేవారు కూడా. అతనికి అమ్మాయిల బట్టలు తెచ్చేవారు. “నాకు సల్వార్ కమీజ్ వేసుకోవడం ఇష్టం లేదు,” అతను చెప్పాడు. ఆరుష్ అమ్మాయిల బట్టలు ధరించే ఏకైక ప్రదేశం పాఠశాల మాత్రమే (యూనిఫామ్). కానీ అది తనని “ఉక్కిరిబిక్కిరి చేసేదని” అతను ఒప్పుకున్నాడు.
![Aarush liked to dress up as a boy and felt suffocated when dressed in a salwar kameez his mother had bought him. His family would say, ‘Be more like a girl...stay within your limits.'](/media/images/04-IMG_6156-A-Love_and_a_place_of_ones_own.max-1400x1120.jpg)
అబ్బాయిలా దుస్తులు ధరించడానికి ఇష్టపడే ఆరుష్ , తన కోసం తల్లి కొనితెచ్చే సల్వార్ కమీజ్‌లు ధరించడానికి ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. ‘ అమ్మాయిలా ఉండు... నీ పరిమితుల్లో నువ్వుండు ’ అని అతని కుటుంబం అతనితో చెప్పేది
పదవ తరగతిలో ఆరుష్‌కు బహిష్టులు రావడం మొదలయ్యాక అతని తల్లికి కొంత ఉపశమనం లభించింది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. సుమారు ఒక సంవత్సరం తర్వాత, ఆరుష్ నెలసరి క్రమం తప్పుతూ వచ్చి చివరికి ఆగిపోయింది. దాంతో తనని వైద్యుల దగ్గరికి, బాబాల దగ్గరికి తీసుకువెళ్ళారావిడ. ఒక్కొక్కరు రకరకాల మాత్రలు, కషాయాలు ఇచ్చారు. కానీ ఎలాంటి మార్పూ రాలేదు.
ఇరుగుపొరుగువారు, ఉపాధ్యాయులు, బడిలో తోటి విద్యార్థులు అతడిని ఆటపట్టించసాగారు. “అమ్మాయిలా ఉండు... నీ పరిమితుల్లో నువ్వుండమనేవాళ్ళు. నాకు పెళ్ళి వయసు వచ్చిందనే స్పృహ నాలో కలిగించేవారు.” తాను వేరుగా ఉన్నాడన్న భావం కలగడంతో, ఆరుష్ తనను తాను అనుమానించుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడూ తనపై తాను విసుగు చెందేవాడు. “నేనేదో తప్పు చేసినట్లు నాకు అనిపించేది,” అని అతను వివరించాడు.
11వ తరగతిలో ఉండగా ఆరుష్‌కు మొబైల్ ఫోన్ వచ్చింది. లింగ నిర్ధారణ శస్త్రచికిత్స ద్వారా ఒక అమ్మాయి అబ్బాయిలా ఎలా మారవచ్చన్న విషయంపై ఆన్‌లైన్‌లో గంటల కొద్దీ పరిశోధించాడు ఆరుష్. విధికి మొదట్లో ఈ విషయంపై సంకోచాలుండేవి. “అతను ఎలా ఉంటాడో నాకు అలాగే నచ్చాడు; మొదటి నుండి దాని గురించి నిజాయితీగా ఉన్నాడు. శారీరకంగా మారాలని కోరుకున్నంత మాత్రాన అతని స్వభావం మారదు కదా,” అని ఆమె అంది.
*****
విధి 12వ తరగతి తర్వాత 2019లో చదువు మానేసింది. పోలీసు అధికారి కావాలని కోరుకున్న ఆరుష్, పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధం కావడానికి పాలఘర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో చేరాడు. అతను మహిళా అభ్యర్థిగా – ఆరుషిగా – దరఖాస్తు చేయాల్సి వచ్చింది. అయితే, 2020లో, దేశవ్యాప్తంగా కోవిడ్-19 లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పుడు, సదరు పరీక్షలు రద్దు చేయబడ్డాయి. దాంతో, కరస్పాండెన్స్ కోర్సు ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడతను
ఆరుష్, విధిలకు లాక్‌డౌన్ కాలం కఠినంగా మారింది. విధి ఇంట్లో ఆమె పెళ్ళి గురించిన చర్చలు మొదలయ్యాయి. అయితే, ఆరుష్‌తో కలిసి బతకాలని తాను బలంగా కోరుకుంటున్నట్టు ఆమెకు తెలుసు. అందుకు ఇంటి నుండి పారిపోవడం ఒక్కటే దారని ఆమెకు అనిపించింది. గతంలో తనతో వచ్చెయ్యమని ఆరుష్ కోరినప్పుడు ఆమె అంగీకరించలేదు. “నాకు చాలా భయంగా అనిపించింది... అలా అన్నీ వదిలేసి వెళ్ళిపోవడమనేది ఏమంత సులభం కాదు,” అంది విధి.
![Running away was the only option and Mumbai seemed to offer dreams, choices and freedom](/media/images/05-IMG_1650-A-Love_and_a_place_of_ones_own.max-1400x1120.jpg)
పారిపోవడమొక్కటే ఉన్న ఏకైక అవకాశం. ముంబై కలలనూ అవకాశాలనూ స్వేచ్ఛనూ అందించేదిగా అనిపించింది
లాక్‌డౌన్ తర్వాత, ఆగస్టు 2020లో, ఔషధాల తయారీ యూనిట్‌లో పని చేస్తూ నెలకు రూ.5,000 సంపాదించసాగాడు ఆరుష్. “నేను ఎలా జీవించాలనుకుంటున్నానో ఎవరికీ అర్థం కావటంలేదు. అది నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పారిపోవడమే ఏకైక మార్గం అని నాకు తెలుసు,” అరుష్ చెప్పాడు. విధికీ తనకూ ఆశ్రయం పొందేందుకు గృహహింస బాధితుల కోసం పనిచేస్తున్న సమూహాలను, ప్రభుత్వేతర సంస్థలను (NGOs) సంప్రదించడం ప్రారంభించాడు.
పరువు-ప్రతిష్టలకు భంగం, వేధింపులు లాంటి కారణాల వల్ల చాలామంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలోని వాళ్ళు – తమ ఇళ్ళను విడిచిపెట్టి, సురక్షితమైన ప్రాంతాలను వెతుక్కుంటూ ఉంటారు. 2021లో, జాతీయ మానవహక్కుల కమిషన్, పశ్చిమ బెంగాల్‌లోని ట్రా న్స్‌జెం డర్ వ్యక్తులపై చేసిన ఒక అధ్యయనం లో, 'వారి లింగ వ్యక్తీకరణను దాచిపెట్టమని కుటుంబాలు ఒత్తిడి చేస్తా'యని తెలిసింది. అలాగే, వారి కుటుంబం, స్నేహితులు, సమాజం వారిపట్ల చూపించే వివక్షాపూరిత ప్రవర్తన కారణంగా, దాదాపు సగం మంది వారి కుటుంబాలను విడచిపెట్టారు
ఆరుష్-విధిలకు ముంబై నగరం అందుబాటులో ఉందనిపించింది. పైగా, ఆరుష్ సర్జరీ కూడా అక్కడే చేయించుకోవచ్చు. అందుకే, మార్చి 2021లో, ఆసుపత్రికి వెళ్ళే నెపంతో ఒక రోజు మధ్యాహ్నం తన ఇంటి నుండి బయలుదేరింది విధి; పనికి వెళ్తున్నానని చెప్పి ఆరుష్ బయలుదేరాడు. ఇద్దరూ బస్సు ఎక్కేందుకు ఒక ప్రదేశంలో కలుసుకున్నారు. ఆరుష్ తన సంపాదనలో ఆదా చేసిన రూ.15,000 నగదును తీసుకొచ్చాడు. తన తల్లికి ఉన్న ఒక్కగానొక్క బంగారు గొలుసు, చెవిపోగులు కూడా పట్టుకొచ్చాడు. ఆ బంగారాన్ని అమ్మి, ఇంకో రూ.13,000 జమచేశాడు. “నాకు అవి అమ్మడం ఇష్టంలేదు. కానీ నేను చాలా ఆందోళనలో పడ్డాను. చేతిలో డబ్బు ఉంచుకోవలసిన పరిస్థితి అది. మేమింక ఇంటికి తిరిగి రాలేం కనుక నేను ఎటువంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు,” అని అతను వివరించాడు..
*****
ముంబైలో, ఒక ఎన్‌జిఒకు చెందిన వాలంటీర్లు మహిళల కోసం ఊర్జా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక ఆశ్రయానికి ఆ జంటను తీసుకువెళ్ళారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం కూడా అందించారు. “వాళ్ళిద్దరూ మేజర్లు కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన చట్టపరమైన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు, ఎల్‌జిబిటిక్యూఐఎ+ వంటి కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో, వారి కుటుంబాలు నుంచి వారికి తీవ్రమైన హాని ఉండే అవకాశం ఉన్నచోట, వారి భద్రత కోసం మేం స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తాం,” అని మానవ హక్కుల కార్యకర్త, ఊర్జా ట్రస్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ అంకితా కోహిర్కర్ తెలిపారు.
అయితే, ఈ చర్య బెడిసికొట్టింది. పోలీసు స్టేషన్‌లో అధికారులు వారిని విచారించడం ప్రారంభించారు. “ఇలాంటి సంబంధం కలకాలం ఉండదని, ఊరికి తిరిగి వెళ్ళమని వాళ్ళు మాకు నచ్చజెప్పడానికి చూశారు. అది తప్పని కూడా వారించారు,” ఆరుష్ వివరించాడు. ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కలతచెందివున్న ఇరు కుటుంబాలకు సమాచారం ఇచ్చారు పోలీసులు. అప్పటికే ఆరుష్ తల్లి దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో అరుషి తప్పిపోయినట్టుగా ఫిర్యాదును దాఖలు చేశారు. విధి కుటుంబ సభ్యులు ఆరుష్ ఇంటిమీదకు వెళ్ళి బెదిరించారు.
![Vidhhi has put aside her dreams to study further, and instead is helping save for Aarush's hormone therapy and gender reassignment surgeries](/media/images/06-IMG_6250-A-Love_and_a_place_of_ones_own.max-1400x1120.jpg)
మరింత చదువుకోవాలనే తన కలలను పక్కనపెట్టి , ఆరుష్‌కి హార్మోన్ థెరపీ , లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలకోసం సహాయం చేస్తోన్న విధి
వీరిద్దరూ ఎక్కడున్నారో తెలియగానే ఇరు కుటుంబాలవారు ఆ రోజే ముంబై చేరుకున్నారు. “నన్ను ఇంటికి తిరిగి రమ్మని భాయ్ (అన్నయ్య) ప్రశాంతంగా అడిగాడు. నేను ఇంతకు ముందెప్పుడూ అతనిని అలా చూడలేదు. అక్కడ పోలీసులు ఉండటమే అందుకు కారణం” అని విధి తెలిపింది.
ఆరుష్ తల్లి కూడా వారిని ఇంటికి తిరిగివచ్చేయమని బతిమిలాడారు. “అమ్మాయిలు ఉండేందుకు ఆ చోటు సరైనది కాదని చెప్పి, మమ్మల్ని తమతో తీసుకెళ్లమని పోలీసులు ఆయి తో అన్నారు,” ఆరుష్ గుర్తుచేసుకున్నాడు. అదృష్టవశాత్తూ, ఊర్జా కార్యకర్తలు జోక్యం చేసుకుని, తల్లిదండ్రులు వాళ్ళను బలవంతంగా తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. తన తల్లి బంగారం అమ్మగా వచ్చిన డబ్బును కూడా తిరిగి ఇచ్చేశాడు ఆరుష్. “నేను దానిని ఉంచుకోవడం మంచిది కాదనిపించింది,” అని అతను చెప్పాడు.
ఈలోపు గ్రామంలో, ఆరుష్ లైంగిక వ్యాపారం చేస్తున్నాడని, విధిని బలవంతంగా తనతో తీసుకువెళ్లాడని విధి కుటుంబం ఆరోపించింది. ఇందుకుగాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె అన్న, బంధువులు ఆరుష్ కుటుంబాన్ని బెదిరించసాగారు. “సమస్యను పరిష్కరించే నెపంతో, అతను (విధి అన్నయ్య) నా సోదరుడిని ఒంటరిగా కలవమని అడిగాడు. కానీ వాళ్ళు ఏదైనా చేస్తారన్న భయంతో ఇతను వెళ్ళలేదు,” అని ఆరుష్ తెలిపాడు.
*****
సెంట్రల్ ముంబైలోని ఆశ్రయంలో నివసిస్తున్నప్పటికీ, ఆరుష్-విధిలకు తాము సురక్షితంగా ఉన్నట్టు అనిపించటంలేదు. “మేము ఎవరినీ నమ్మలేం. ఊరి నుంచి ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరికి తెలుసు?” ఆరుష్ ప్రశ్నించాడు. దీంతో, రూ.10,000 డిపాజిట్ చెల్లించి, ఒక గదిని అద్దె తీసుకున్నారు వాళ్ళు. ఆ గదికి నెలకు రూ.5,000 అద్దె చెల్లిస్తున్నారు. “ఇంటి ఓనర్‌కి మా సంబంధం గురించి తెలియదు. మేం దాన్ని తప్పనిసరిగా దాచి పెట్టాల్సిందే. మేమీ గదిని ఖాళీ చేయకూడదనుకుంటున్నాం,” అని అతను చెప్పాడు.
ఆరుష్ ఇప్పుడు లింగ స్థిరీకరణ (gender affirmation)పై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. అంటే శస్త్రచికిత్స చేయించుకొని, మందులు వాడాల్సివుంటుంది. సదరు ప్రక్రియ గురించీ, వైద్యుల గురించీ, అందుకయ్యే ఖర్చుల గురించీ తగిన సమాచారం కోసం అతను గూగుల్, వాట్సాప్ గ్రూప్‌లను ఆశ్రయించాడు.
ఒకసారి, ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడతను. అయితే, మళ్ళీ దానికి తిరిగి వెళ్ళలేదు. “నాకు సహాయం చేయడానికి బదులుగా, శస్త్రచికిత్స వద్దని డాక్టర్ నాకు నచ్చజెప్పడానికి చూశాడు. అతను నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. నా తల్లిదండ్రుల ఆమోదం పొందడానికి వాళ్ళని పిలవమని కూడా అడిగాడు. నాకు చాలా కోపం వచ్చింది. అతను నన్ను మరింత ఇబ్బందికి గురిచేశాడు,” అని ఆరుష్ తెలిపాడు.
![Vidhhi has noticed changes in Aarush's behaviour. 'There have been fights, but we have also sat down to discuss the issues. It affects me, too, but I am with him'](/media/images/07-IMG_1512-A-Love_and_a_place_of_ones_own.max-1400x1120.jpg)
ఆరుష్ ప్రవర్తనలో మార్పును వృద్ధి గమనించింది. ' మా మధ్య పోట్లాటలు జరుగుతున్నాయి. అదేవిధంగా మేం సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటాం కూడా. ఇదంతా నన్ను కూడా బాధపెడుతుంది కానీ నేను అతనితోనే ఉంటాను ’
ఆరుష్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత, అతను జెండర్ డిస్ఫోరియాతో – ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చిన లైంగికతకూ, ఆ తర్వాత వచ్చిన లైంగిక గుర్తింపుకూ మధ్య అసమతుల్యత వలన కలిగే బాధ, అసౌకర్యాలతో – బాధపడుతున్నాడు. వైద్యులు ఆరుష్‌కు హార్మోన్ థెరపీని ఆమోదించారు. ఇదిలా ఉంటే, లింగ పరివర్తన (జెండర్ ట్రాన్సిషనింగ్) ప్రక్రియ సుదీర్ఘమైనది. ఖర్చుతో కూడుకున్నది.
ప్రతి 21 రోజులకోసారి తీసుకునే టెస్టోస్‌స్టెరోన్ ఇంజెక్షన్ల కిట్ ఒక్కోటి రూ.420; ఇంజక్షన్ ఇవ్వడానికి డాక్టర్ ఛార్జీలు రూ.350. ప్రతి 15 రోజులకు నోటిద్వారా తీసుకునే మాత్రల కోసం మరో రూ.200 ఖర్చవుతోంది. అలాగే, హార్మోన్ చికిత్స వల్ల వచ్చే దుష్ప్రభావాలను తెలుసుకోవడానికి ప్రతి 2-3 నెలలకు ఆరుష్ రక్త పరీక్షలు చేయించుకోవాలి; ఈ పరీక్షల ఖర్చు సుమారు రూ.5,000 ఉంటుంది. అదనంగా, కౌన్సెలర్ ఛార్జీలు రూ.1,500, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ప్రతి సందర్శనకు రూ.800-1,000 అవుతుంది.
అతను తీసుకుంటున్న చికిత్స మెరుగైన ఫలితాలను చూపిస్తోంది. “నాలో నేను ఎన్నో మార్పులను చూస్తున్నాను. ఇప్పుడు నా గొంతు బరువుగా వినిపిస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది,” అని ఆరుష్ సంబరపడ్డాడు. “ఒక్కోసారి నేను చికాకుపడతాను; నా నిగ్రహం కోల్పోతుంటాను,” అని మందుల దుష్ప్రభావాలను వివరించాడు.
విధి తనతో ఇంత దూరం వచ్చినందుకు పశ్చాత్తాప పడుతుందేమోననీ, లేదా తనను ఇష్టపడటం మానేస్తుందేమోననీ ఆరుష్ భయపడుతున్నాడు. “ఆమె పెద్ద (ఉన్నత కుల) కుటుంబం నుండి వచ్చింది. కానీ ఆమె నన్ను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. ఆమె కూడా మా కోసమే పని చేస్తోంది.”
ఆరుష్ ప్రవర్తనలోని మార్పులను గమనించిన విధి, “మా మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి కానీ సమస్యలను గురించి చర్చించుకునేటందుకు మేం కూర్చుని మాట్లాడుకుంటాం. ఇది నన్ను కూడా ప్రభావితం చేస్తోంది కానీ నేను అతని వెన్నంటే ఉంటాను.” అంటోంది. కంప్యూటర్లు లేదా నర్సింగ్‌లో వృత్తి విద్యా కోర్సును చేపట్టాలనే తన ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టిందామె. బదులుగా, చిన్నా చితకా పనులు చేస్తూ, ఇంటిని నడపడంలో ఆరుష్‌కి సహాయపడుతోంది. ఒక దక్షిణ భారత రెస్టారెంట్‌లో గిన్నెలు తోమి, నెలకు రూ.10,000 సంపాదిస్తోంది (2022 డిసెంబర్ చివర్లో ఈ ఉద్యోగం పోయింది). ఈ ఆదాయంలో కొంత భాగం ఆరుష్ చికిత్సకు వెళ్తోంది.
![Vidhhi in a shy moment](/media/images/08b-IMG_1387-A-Love_and_a_place_of_ones_ow.max-1400x1120.jpg)
![Aarush is happy to have Vidhhi's support. 'She comes from a better [upper caste] family. But she never makes me feel less'](/media/images/09a-IMG_1560-A-Love_and_a_place_of_ones_ow.max-1400x1120.jpg)
ఎడమ: సిగ్గుపడుతోన్న విధి. కుడి: విధి మద్దతు లభించినందుకు ఆరుష్ సంతోషంగా ఉన్నాడు. ' ఆమె మెరుగైన (ఉన్నత కుల) కుటుంబం నుండి వచ్చింది. కానీ ఆమె నాకు ఎప్పుడూ తక్కువ అనుభూతిని కలిగించదు '
ఓ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, నెలనెలా వచ్చే రూ.11,000 లలో పొదుపు చేస్తుంటాడు ఆరుష్. అతని సహచరులు అతన్ని మగవాడిగా గుర్తిస్తారు. తన ఛాతీ కనబడకుండా ఉండడం కోసం అతనొక బైండర్ ధరిస్తాడు; అది నొప్పెడుతూ ఉంటుంది.
“మేమిద్దరం ఇప్పుడు ఒకరితో ఒకరం తక్కువ సమయం గడుపుతున్నాం. ఎందుకంటే, తొందరగా పనిలోకి బయలుదేరాలి కదా. పని నుండి అలసిపోయి వస్తుంటాం. ఒక్కోసారి వాదించుకుంటాం కూడా,” విధి అన్నది.
సెప్టెంబర్-డిసెంబర్ 2022 మధ్య, తన చికిత్స కోసం ఆరుష్ దాదాపు రూ.25,000 ఖర్చుచేశాడు. హార్మోన్ థెరపీ తర్వాత, అతను లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స కోసం (సెక్స్ రిఅసైన్‌మెంట్ శస్త్రచికిత్స లేదా ఎస్ఆర్ఎస్ అని కూడా అంటారు) వెళ్దామనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఛాతీనీ, జననేంద్రియాలనూ పునర్నిర్మాణం చేస్తారు. అందుకతను రూ.5-8 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, వారిద్దరి ప్రస్తుత ఆదాయం నుండి ఇంత మొత్తం పొదుపు చేయడం కష్టం కనుక దీనిని చేయించుకునే స్తోమత అతనికి లేదు.
శస్త్రచికిత్స పూర్తయ్యే వరకు తన కుటుంబానికి తన చికిత్స గురించి తెలియకూడదని ఆరుష్ కోరిక. తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్నాడని తెలుసుకున్నప్పుడు, తల్లితో ఫోన్‌లో ఎంత పెద్ద వాదనయ్యిందో అతను గుర్తుచేసుకున్నాడు. “ముంబైలో జనాలు నాలో తప్పుడు ఆలోచనలు కలిగేలా చేస్తున్నారని ఆమె భావించింది,” అని ఆరుష్ చెప్పాడు. అతన్ని మాయచేసి వారి గ్రామ సమీపంలో ఉన్న ఒక ప్రదేశానికి వచ్చేలా చేసి, అతన్ని ఒక తాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళారామె. “ఆ వ్యక్తి నన్ను కొట్టడం ప్రారంభించాడు; నా తలపై కొడుతూ ‘నువ్వు అమ్మాయివి, అబ్బాయి కాద'ని పదేపదే చెప్పాడు.” అయితే, భయాందోళనకు గురైన ఆరుష్ అక్కడి నుండి ఎలాగోలా పారిపోయాడు.
*****
“ప్రభుత్వ వైద్యుడు మంచివాడయ్యుంటే, నేను ఇంత ఖరీదైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు,” అని ఆరుష్ అన్నాడు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం , 2019 ప్రకారం, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స, హార్మోన్ల చికిత్స కోసం, వీటన్నిటికి ముందూ తరువాతా అవసరమయ్యే కౌన్సెలింగ్‌తో సహా వైద్య సంరక్షణ సౌకర్యాన్ని మొత్తం ప్రభుత్వమే అందించాలి. ఖర్చులను ఆరోగ్య బీమా పథకం ద్వారా కవర్ చేయాలని కూడా ఆ చట్టం పేర్కొంది. సదరు చట్టం అతనికి చికిత్సను, శస్త్రచికిత్సను నిరాకరించకుండా అతని హక్కులను కూడా రక్షిస్తుంది.
ఆ చట్టం అమలులోకి వచ్చాక, 2022లో, కేంద్ర సామాజిక న్యాయం మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. 2020లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ఒక జాతీయ పోర్టల్ ను కూడా ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా, ఎలాంటి కార్యాలయాన్ని సందర్శించకుండానే ట్రాన్స్‌జెండర్ వ్యక్తి తన గుర్తింపు ధృవీకరణనూ, గుర్తింపు పత్రాన్నీ కూడా పొందవచ్చు.
![Vidhhi wearing a ring that Aarush gave her as a neckpiece](/media/images/08a-IMG_14012-A-Love_and_a_place_of_ones_o.max-1400x1120.jpg)
![Aarush and Vidhhi are full of hope. 'Why should we live in fear?'](/media/images/09b-IMG_1253-BW-A-Love_and_a_place_of_ones.max-1400x1120.jpg)
ఎడమ: ఆరుష్ ఇచ్చిన ఉంగరాన్ని మెడలో ధరించిన విధి. కుడి: ఆరుష్ , విధి నిండు ఆశతో ఉన్నారు. ' మనమెందుకు భయపడుతూ బ్రతకాలి ?'
అనేక పథకాలపై అవగాహన లేని ఆరుష్ ఎలాగైతేనేం గుర్తింపు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. “దరఖాస్తును స్వీకరించిన 30 రోజులలోపు జిల్లా అధికారులు ట్రాన్స్‌జెండర్ ధృవీకరణ పత్రాలను, ఐడి కార్డులను జారీ చేయడం తప్పనిసరి,” అని ఆ పోర్టల్‌లో పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు ఏదీ అతని చేతికి రాలేదు. జనవరి 2, 2023 నాటికి, మహారాష్ట్రలో సదరు పత్రాల కోసం 2,080 దరఖాస్తులు వచ్చాయి; వాటిలో 452 పెండింగ్‌లో ఉన్నాయి.
తనకు సరైన గుర్తింపు ధృవీకరణ పత్రం లేకపోతే, తన బిఎ డిగ్రీ ఆరుషి పేరుతో జారీ అవుతుందని, దాని వల్ల ముందు ముందు సంక్లిష్టమైన పత్రాల పని ఎదురుపడుతుందని ఆరుష్ ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికీ అతను పోలీసు శాఖలో పని చేయాలని ఆశిస్తున్నాడు; అది కూడా ఒక పురుషుడిగా, లింగనిర్ధారణ శస్త్రచికిత్స తర్వాత. బీహార్ రాష్ట్ర పోలీసు శాఖలో తొలి ట్రాన్స్ మ్యాన్ నియామకం కానున్నారనే వార్త అతనిలో ఎన్నో ఆశలు రేకెత్తించింది. “ఈ వార్త చదివాక చాలా సంతోషంగా అనిపించింది. నేను లోపల ఆశాజనకంగా ఉన్నాను,” తన శస్త్రచికిత్సల కోసం పని చేస్తూ, డబ్బు పొదుపు చేస్తున్న ఆరుష్ అన్నాడు.
ప్రతి ఒక్కరినీ అంగీకరించడాన్ని ప్రజలకు నేర్పించాలని ఆరుష్ కోరుకుంటున్నాడు. అలా జరిగితే, తమ ఇంటిని, గ్రామాన్ని వదిలి ఇలా దాక్కోవలసిన అవసరం వారికి వచ్చేది కాదు. “నేను చాలా ఏడ్చాను. బతకాలని అనుకోలేదు. మేమెందుకు భయపడుతూ జీవించాలి? ఏదో ఒక రోజున మా పేర్లు దాచుకోకుండా మా కథను చెప్పాలనుకుంటున్నాం,” అన్నాడు ఆరుష్.
“మొఘల్-ఎ-ఆజమ్ ముగింపు విషాదకరమైనది. మాది అలా ఉండదు,” విధి నవ్వుతూ అంది.
విధి , ఆరుష్‌ల గోప్యతను కాపాడేందుకు వారి పేర్లను మార్చారు.
అనువాదం : వై . క్రిష్ణ జ్యోతి