"యహ్ చూడీ హో జాయేగీ, ఫిక్స్ జాయేగీ, ఫిర్ బాహర్ నహీ నికలేగీ (ఇది గాజుని పోలివుంటుంది. ఈ గాజు అంచుపై చక్కగా సర్దుకునేలా అమరుతుంది. అప్పుడిక ఊడిపోకుండా ఉంటుంది),” అని జీతూ వివరించారు. నిర్విరామంగా బంతి కొట్టే దెబ్బల్ని తట్టుకునేలా పేమునీ, కొయ్యనీ బలంగా జతచేస్తారు.
ఒక నెలలో దాదాపు 100 పోలో కర్రలు తయారవుతాయి. అశోక్‌తో గత 40 ఏళ్ళుగా కలిసి పనిచేస్తోన్న మొహమ్మద్ షఫీ వాటికి వార్నిష్ వేస్తారు. వార్నిష్ వాటికి మెరుపునిస్తుంది, తేమ, ధూళి నుండి రక్షిస్తుంది. షఫీ పోలో కర్రకు ఒకవైపు నిలువుగా రంగులతో కాలిగ్రాఫ్ చేయడం పూర్తి చేస్తారు. ఆ తర్వాత అశోక్, మీనా, జీతూ చేతి పిడికి దిగువన 'జైపూర్ పోలో హౌస్' అనే లేబుల్‌ని అతికిస్తారు.
ఒక్క పోలో కర్ర తయారుచేసేందుకు కావలసిన ముడి పదార్థాల ధర రూ. 1000. వాటి అమ్మకాల్లో తనకు ఆ ధరలో సగం మొత్తం కూడా తిరిగి రాదని అశోక్ చెప్పారు. అతను ఒక పోలో కర్రను రూ. 1,600కి అమ్మాలని ప్రయత్నిస్తారు కానీ, అది అన్నిసార్లూ సాధ్యపడదు. “ఆటగాళ్ళు సరిగా డబ్బులివ్వరు. వాళ్ళు వెయ్యి, పన్నెండు వందలు (రూపాయలు) మాత్రమే ఇస్తామంటారు,” అని అతను చెప్పారు.
పోలో కర్రలోని ప్రతి భాగాన్నీ తయారుచేసేందుకు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో వివరిస్తూ, అందుకు తగినట్టుగా రాబడి ఉండదని దిగులుగా అన్నారు. "కేవలం అస్సామ్, రంగూన్‌ల నుంచి మాత్రమే పేము కొల్‌కతాకు వస్తుంది," అన్నారు అశోక్. ఆ వచ్చిన పేము కూడా సరైన తేమ శాతం, కావలసిన విధంగా వంగే సౌలభ్యం, సాంద్రత, మందం - ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి.
"కొల్‌కతాలోని సరఫరాదారుల వద్ద మందపాటి పేము ఉంటుంది. అది పోలీసు సిబ్బందికి అవసరమైన లాఠీలు, వృద్ధుల కోసం చేతి కర్రలు తయారుచేయడానికి పనికొస్తుంది. అలాంటి వెయ్యి కర్రల్లో నా అవసరాలను తీర్చగలిగేవి ఓ వంద మాత్రమే ఉంటాయి," అని అశోక్ చెప్పారు. అతనికి సరఫరాదారులు పంపే చాలా పేము కర్రలు పోలో కర్రల తయారీకి బాగా మందమైపోతాయి, కాబట్టి కరోనా దాడిచేయక ముందు అతను ప్రతి సంవత్సరం కొల్‌కతాకు వెళ్ళి, తనకు అవసరమైన పేము కర్రల్ని వేరుచేసి ఎంచుకొని, సరైన పేముని తెచ్చుకునేవారు. "ఇప్పుడైతే నా జేబులో లక్ష రూపాయలు ఉంటేనే తప్ప నేను కొల్‌కతా వెళ్ళలేను," అన్నారు అశోక్.