ఇప్పుడైతే గణేశ్, అరుణ్ ముకణేలు తమ బడిలో వరుసగా 9వ, 7వ తరగతులు చదువుతూ ఉండాలి. అయితే వాళ్ళిద్దరూ ప్రస్తుతం ఠానే జిల్లా, ముంబై శివార్లలో ఉందే కొళోశీ అనే తమ కుగ్రామంలోని ఇంటి వద్దనే సమయాన్నంతా గడిపేస్తున్నారు. అందుబాటులో ఉన్న తుక్కునంతా ఉపయోగించి వాళ్ళిప్పుడు కార్లను, ఇతర వస్తువులను తయారుచేస్తున్నారు. లేదంటే ఇటుక బట్టీలో పనిచేస్తున్న తమ తల్లిదండ్రుల వద్ద కూర్చుని కాలంగడిపేస్తుంటారు.
“వాళ్ళికపై పుస్తకాలతో చదువుకోరు. ఈ చిన్నవాడు (అరుణ్) తుక్కుతోనూ, చెక్కముక్కలతోనూ బొమ్మలు చేయడంలో బిజీగా ఉన్నాడు. వాడి రోజంతా ఆటల్లోనే గడిచిపోతుంది" అని వాళ్ళ తల్లి నీరా ముకణే చెప్పింది. “నాకు బళ్ళో విసుగుపుడుతుందని ఎన్నిసార్లు చెప్పాను?” అంటూ అరుణ్ తల్లి మాటలకు చిన్నగా అడ్డుతగిలాడు. వారి మధ్య మాటామాటా పెరగటంతో అరుణ్, ఆ చుట్టుపక్కల దొరికిన వ్యర్థ పదార్థాలతో ఈమధ్యనే తాను తయారుచేసుకున్న కారుతో ఆడుకోవడానికి ఇంట్లోంచి బయటపడ్డాడు.
ఇరవయ్యారేళ్ళ నీరా 7వ తరగతి వరకు చదువుకుంది. కానీ ఆమె భర్త విష్ణు(35) రెండవ తరగతి తర్వాత బడి వదిలేశారు. తమ పిల్లలకు క్రమబద్ధమైన విద్యను అందించాలనీ, తద్వారా వారికి తమ తల్లిదండ్రుల్లాగా దగ్గరలో వుండే నీటి గుంటల్లో చేపలు పట్టడం లేదా ఇటుక బట్టీలలో పనిచేయడం వంటి పనులు చేసే అగత్యం పట్టకూడదనీ ముకణేలు గట్టిగా కోరుకున్నారు. అనేక ఆదివాసీ కుటుంబాలు ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు శహాపూర్-కల్యాణ్ ప్రాంతానికి వలస వెళ్తుంటాయి.
“నేను పెద్దగా చదువుకోలేకపోయాను. కానీ నా పిల్లలను బాగా చదివించాలని కోరుకుంటున్నాను" అని కాత్కరీ సామాజికవర్గానికి చెందిన విష్ణు ముకణే అన్నారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి విపత్కర పరిస్థితులలో ఉన్న సమూహం (పివిటిజి) గా జాబితా చేసివున్న కాత్కరీ ఆదివాసీ వర్గం, అటువంటి పరిస్థితులలో ఉన్న మూడు ఆదివాసీ సమూహాలలో ఒకటి. రాష్ట్రంలోని కాత్కరీ వర్గంలో అక్షరాస్యత రేటు 41 శాతంగా ఉందని ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2013లో వెలువరించిన ఒక నివేదికలో పేర్కొంది.
నాలుగు సంవత్సరాల క్రితం, తగినంత మంది విద్యార్థులు లేనందున స్థానిక ప్రభుత్వ పాఠశాల మూసివేస్తుండటంతో విష్ణు, అతని భార్య తమ పిల్లలను మఢ్ గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక ఆశ్రమ పాఠశాలలో (స్థానికంగా మఢ్ ఆశ్రమ శాల అని పిలుస్తారు) చేర్చారు. ఇది ఠాణే జిల్లాలోని మురబాడ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1-12వ తరగతి వరకు ఉన్న ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే 379 మంది విద్యార్థులలో 125 మంది వీరి కొడుకుల మాదిరిగానే రెసిడెన్షియల్ విద్యార్థులు. "వారికి బడిలో తినడానికీ, చదువుకోవడానికీ వీలున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు వాటిని పోగొట్టుకున్నాం" అన్నారు విష్ణు.







