"పాష్మీనా శాలువాలకు ఆ మృదువైన మెరుపునిచ్చేది మేమే."
శ్రీనగర్‌లోని అబ్దుల్ మజీద్ లోన్ ఇల్లంతా చిక్కులుపడిన దారపు పీచుల చెత్తతో నిండివుంది. నేలపై కూర్చొని, చేతిలో ఒక వౌచ్ (పదునైన ఇనుప పనిముట్టు) పట్టుకొని, తాజాగా నేసిన ఒక పాష్మీనా శాలువ నుండి అక్కడక్కడా విడిగా వచ్చిన దారపు పీచులను తీసేస్తున్నారు లోన్. "మేం చేసే ఈ పనిలాంటి పని ఒకటుందని చాలా తక్కువ మందికి తెలుసు," చెప్పారాయన
42 ఏళ్ళ ఈ నిపుణుడైన పనివాడు శ్రీనగర్ జిల్లాలోని నవా కదల్ వార్డులో నివసిస్తున్నారు. ఈయన అత్యంత విలువైన పాష్మీనా శాలువాల నుండి పురజ్ (పీచు లేదా దారపు పోచ)ని తీసేయడానికి వౌచ్‌ని ఉపయోగిస్తారు. ఈ పనిని పురజ్‌గారీ అని పిలుస్తారు. ఒక్క శ్రీనగర్‌లోనే 200 కంటే ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన పనివారు ఈ పనిని చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా అబ్దుల్ పురజ్‌గారీ చేస్తున్నారు. ఆయన ఎనిమిది గంటల పనికి సుమారు 200 రూపాయలు సంపాదిస్తారు
అన్ని రకాల పాష్మీనా - నేసిన, రంగులు వేసిన, బుటేదారీపని చేసిన - శాలువాల కోసం పురజ్గారీని మనుషులే చేస్తారు. ఈ వస్త్రానికుండే సున్నితమైన స్వభావం, చేతిపని కళాకారుల నైపుణ్యాన్ని తప్ప, ఏ యంత్రాన్నీ అనుమతించదు
పురజ్గారీకి వౌచ్ చాలా అవసరం. "మా సంపాదన మొత్తం వౌచ్ పైనా, దాని నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది," తన ముందు ఉన్న చెక్క మగ్గానికి గట్టిగా సాగదీసి బిగించి ఉన్న ఒక శాలువా వైపు నిశితంగా చూస్తూ చెప్పారు అబ్దుల్. "వౌచ్ లేకుండా పాష్మీనా శాలువాను శుభ్రం చేయడం మాకు కష్టం."














