“ఈ పిటీషన్లన్నీ వెనక్కు తీసుకుని చింపేయండి," అని చమరు అన్నారు. "ఇవి చెల్లవు. ఈ కోర్టు వాటిని అంగీకరించదు."
మెజిస్ట్రేట్ పనిని ఆయన కొద్ది కొద్దిగా ఇష్టపడటం మొదలుపెట్టారు.
అది 1942వ సంవత్సరపు ఆగస్ట్ నెల. దాదాపు దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. సంబాల్పూర్‌లోని ఈ కోర్టు అయితే నిశ్చయంగా కల్లోలంలో ఉంది. చమరు పరిద, ఆయన కామ్రేడ్లతో కలిసి ఆ కోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దానికి జడ్జ్‌గా తనను తానే ప్రకటించుకున్నారు. ఆయన కింద 'ఆర్డర్లీ'గా జితేంద్ర ప్రధాన్‌ను నియమించుకున్నారు. ఆ కోర్టు (పేష్‌కర్) క్లర్క్‌గా ఉండాలని పూర్ణచంద్ర ప్రధాన్ ఎంచుకున్నారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా వారందరూ ఇలా కోర్టును ఆక్రమించారు.
కోర్టులో హాజరై ఆశ్చర్యపోతున్న ప్రజలను ఉద్దేశించి చమరు ఇలా అన్నారు - "ఈ పిటీషన్లన్నీ బ్రిటీష్ రాజ్యాన్ని సంబోధిస్తూ దాఖలు చేసినవి. ఇప్పుడు మనందరం స్వతంత్ర భారతదేశంలోకి ప్రవేశించాం. ఈ కేసులను పరిగణించాలంటే వీటిని వెనక్కు తీసుకోండి. పిటీషన్లను మార్చి, మహాత్మా గాంధీ గారిని సంబోధిస్తూ తయారు చేయండి. అప్పుడు మేము వాటిని పరిగణిస్తాము."
అరవై ఏళ్ల తర్వాత, దాదాపు అదే తారీఖున చమరు ఆ గాథను ఎంతో ఉత్సాహంతో మాకు చెప్పారు. ఆయన వయసు ఇప్పుడు 91 సంవత్సరాలు. జితేంద్ర (81) ఆయన పక్కన కూర్చుని ఉన్నారు. పూర్ణచంద్ర మరణించారు. ఇప్పటికీ వారందరూ ఒడిషాలోని బార్‌ఘడ్ జిల్లాలోని పనిమారా గ్రామంలో నివసిస్తున్నారు. స్వాతంత్ర సమరం జోరుగా సాగిన సమయంలో ఈ గ్రామానికి చెందిన ఎందరో యువకులు, యువతులు అందులో పాల్గొన్నారు. 1942లో ఈ గ్రామానికే చెందిన 32 మంది జైలుకు వెళ్లారని రికార్డులు చెబుతున్నాయి. వారిలో కొందరైన చమరు మరియు జితేంద్ర ఇంకా సజీవంగా ఉన్నారు.
ఒకానొక సమయంలో, ఈ గ్రామానికి చెందిన ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక సత్యాగ్రాహి స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారిని బెంబేలెత్తించిన గ్రామం ఇది. ఈ గ్రామంలోని ప్రజల ఐకమత్యాన్ని ఎవ్వరూ విడగొట్టలేకపోయారు. వారి సంకల్పం గురించి ఎన్నో ఊళ్లలో కథలుగా చెప్పుకునే వారు. బ్రిటీష్ రాజ్యాన్ని ఎదురించిన వారు పేదలు, నిరక్షరాస్యులైన రైతు కూలీలు. రోజువారీ జీవితాన్ని అతికష్టం మీద నెగ్గుకొస్తోన్న చిన్నకారు రైతులు. చాలా మంది ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతున్నారు.
చరిత్ర పుస్తకాలలో వారి పేరు కనబడకపోవచ్చు. చివరికి ఒడిషా రాష్ట్ర వాసులే వారిని మరచిపోవచ్చు. బార్‌ఘడ్‌లో మాత్రం, దీనిని స్వేచ్ఛా గ్రామంగానే పిలుస్తారు. స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్లలో ఎవ్వరికీ స్వలాభం చేకూరలేదు. రివార్డులు, పోస్టులు గానీ ఏ ఇతర వృత్తిపరమైన లాభమూ అందలేదు. అయినా వాళ్లు ఎంతో ప్రమాదాలను ఎదుర్కొన్నారు, భారత స్వతంత్రం పోరాడారు.
వీళ్లంతా స్వతంత్ర పోరాటంలో క్షేత్ర స్థాయిలో పోరాడిన సైనికులు. అది కూడా చెప్పుల్లేకుండా. ఇక్కడి వారెవ్వరూ ఎన్నడూ చెప్పులు వేసుకున్న పాపాన పోలేదు.





