అప్పటికే చేస్తున్న పోరాటాలకు తోడు పనిమారా స్వాతంత్య్ర సమరయోధులు ఇతర రంగాల పోరాటాలలో కూడా భాగం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీటిలో కొన్ని ఆంతరంగికమైనవే.
అస్పృశ్యతకు వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన పిలుపుతో ప్రేరణ పొంది ఈ యోధులు ముందుకు నడిచారు.
"ఒక రోజు మేము సుమారు 400 మంది దళితులతో మా గ్రామంలోని జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించాం. అది కొందరు బ్రాహ్మణులకు నచ్చలేదు. కానీ కొందరు మాత్రం మాకు మద్దతు పలికారు. బహుశా అది కూడా బలవంతంగానే జరిగిందని నేననుకుంటున్నాను" అని చెప్పారు చామారు. ఆ సమయానికి అక్కడివారి పరిస్థితి అలావుంది మరి. ఆ ఆలయానికి గ్రామాధికారి (గౌంటియా) మేనేజింగ్ ట్రస్టీ. దళితుల ఈ చర్య ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇందుకు తన నిరసన తెలియజేస్తూ ఆయన వూరు విడిచి వెళ్లిపోయాడు. అనంతర కాలంలో ఆయన సొంత కుమారుడే తన తండ్రి చర్యలను నిరసిస్తూ, తమతో కలిసి పనిచేశాడని చామారు చెప్పారు.
“బ్రిటిష్ వస్తువులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఉధృతమవుతోంది. మేమందరం ఖద్దరు మాత్రమే ధరించాం. మేమే నేసేవారిమి. మా భావజాల స్రవంతిలో భాగమది. నిజానికి మేమంతా పేదవాళ్లం కావడం వల్ల ఖద్దరు బట్టలు మాకు సౌకర్యంగా అనిపించాయి.”
స్వాతంత్య్ర సమర యోధులంతా కొన్ని దశాబ్దాల పాటు ఖద్దరునే ధరిస్తూ వచ్చారు. కానీ, నేతపని చేయడం ఇక సాధ్యం కాదని మా వేళ్లు మొండికేశాయి. “90 ఏళ్ల వయసులో తప్పనిసరి స్థితిలో ఇక నేత పని మానేయాలని నిర్ణయించుకున్నాను”, అన్నారు చమారూ.
పనిమరా పోరాటం 1930లలో సంబల్‌పూర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన “శిక్షణ” కార్యక్రమం ప్రోద్బలంతో జరిగింది. “దీనికి `సేవ` అని పేరు పెట్టారు. కానీ, సేవ కంటే మాకక్కడ జైలు జీవితాల గురించే ఎక్కువ నేర్పారు. మరుగుదొడ్లను శుభ్రం చేయడం, నాణ్యత లేని ఆహారం- ఈ విషయాల గురించి చెప్పారు. కానీ ఈ శిక్షణ ఎందుకో మాకు మొదలే తెలుసు. మా గ్రామం నుంచి మేము తొమ్మిదిమందిమి ఈ శిబిరానికి హాజరయ్యాం.”
“గ్రామ ప్రజలు పూలు, దండలు, కుంకుమ హారతులతో మమ్మల్నిసాదరంగా ఆహ్వానించారు. పోరాట ప్రభావం ఆనాటికే అక్కడికి వ్యాపించి, నిండుగా గుబాళిస్తోంది.”
అంతేకాదు, ఈ నేపథ్యం వెనుక మహాత్ముని ప్రభావం కూడా బాగా వుంది. ఆయన సత్యాగ్రహ పిలుపు మమ్మల్ని ఉత్తేజపరిచింది. పేదలు, నిరక్షరాస్యులు నూతన ప్రస్థానానికి నాంది పలకాలని మాకక్కడ బోధించారు. మేమంతా అహింసా సిద్ధాంతానికి బద్ధులమై వుంటామని ప్రమాణం చేశాం. పనిమారా స్వతంత్ర యోధుల్లో ఎక్కువమంది తమ జీవిత పర్యంతం ఈ నిబంధనను పాటించి చూపారు.
వారప్పటికి గాంధీని ఎప్పుడూ చూసి ఎరుగరు. కానీ, లక్షలాదిమంది ఇతరుల్లాగే వారు కూడా గాంధీజీ పిలుపుకు ప్రభావితమై వచ్చినవారే. “మేము ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ చౌధురి, దయానిధిల ప్రసంగాల ప్రభావాలకు లోనైనవారే”. పనిమారా సమర యోధులు తమ తొలి జైలు అనుభవాల్ని 1942 ఆగస్టుకు ముందే సాధించారు. ఆ సమయంలోనే మేమొక ప్రమాణాన్ని తీసుకున్నాం. “ఎట్టి పరిస్థితుల్లోనూ (రెండవ ప్రపంచ) యుద్ధానికి వ్యక్తిగతంగా కానీ, ధన రూపేణా; ఇతర ఏ రూపాల్లోనూ సహకరించకూడదని; ఇలా సహకరించడమంటే దేశద్రోహమేనని. ఇదంతా కూడా అహింసా సిద్ధాంతానికి అనుగుణం గానే జరగాలని. గ్రామంలోని అందరూ ఇందుకు తమ మద్దతు తెలిపారు.
“మేము ఆరు వారాల పాటు కటక్ జైల్లో వున్నాం. వేలమంది జైళ్లకు తరలివస్తుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఎవరినీ ఎక్కువ కాలం పాటు జైల్లో నిర్బంధించలేకపోయింది. జైలుకు వెళ్లాలని తపన పడుతున్నవారి సంఖ్య మాత్రం బాగా పెరుగుతోంది.”




