ప్రవీణ్ కుమార్ స్కూటర్ మీద తన క్రచెస్ తో కూర్చొని, ఒక చేతిలో బ్రష్ ఉంచుకొని తన చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతున్నారు. ఆ పక్కనే అతను చిత్రించిన 18 అడుగుల పొడవున్న ఒక పెద్ద కాన్వాస్ లో రైతుల నిరసన చిత్రాలున్నాయి.
ప్రవీణ్ లూధియానా లో ఆర్ట్ టీచర్ మరియు ఆర్టిస్ట్.ఆయన లూథియానా నుండి సింగుకు 300 కిలోమీటర్లు ప్రయాణించి జనవరి 10 న హర్యానా- ఢిల్లీ సరిహద్దు వద్ద ఉన్న నిరసన స్థలానికి చేరుకుని తన సహకారం అందిస్తానని గట్టిగా చెప్పారు.
“నేను పబ్లిసిటీని కోరుకోవట్లేదు, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. ప్రచారం కావాలని నాకు ఆరాటమూ లేదు. నేను ఇప్పుడు ఈ ఆందోళనలో ఒక భాగమేననే సంగతి నాకు సంతోషం కలిగించే విషయం , ”అని ఆయన చెప్పారు.
"నేను 70 శాతం వికలాంగుడిని," ఆయన తన కాలును చూపించారు. ఆయనకి మూడు సంవత్సరాల వయస్సులో పోలియో సోకింది. ఆ ఇబ్బంది కానీ, ఈ ప్రయాణం పట్ల అతని కుటుంబం మొదట్లో చూపిన అయిష్టత కానీ, అతని ప్రయాణాన్ని ఆపలేకపోయాయి.
ప్రవీణ్, 43, లుధియానాలో పెద్ద కాన్వాస్ పెయింటింగ్ ప్రారంభించారు. ఆ పెయింటింగ్ ని తనతో పాటుగా సింఘు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నిరసనకారుల మధ్య ఒక వీధిలో కూర్చుని అది పూర్తి అయ్యేవరకు అతను తన పనిని కొనసాగించారు.




