ఏ స్త్రీకైనా న్యాయం ఇలా ఎలా ముగుస్తుంది?
– బిల్కిస్‌బానో
మార్చి 2002లో గోద్రాలో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో, గుజరాత్‌లోని రంధిక్‌పూర్ గ్రామంలో బిల్కిస్ యాకూబ్ రసూల్ (19) కుటుంబానికి చెందిన పద్నాలుగు మంది సభ్యులను - ఆమె మూడేళ్ల కుమార్తె సలేహాతో సహా - ఒక గుంపు హత్య చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసింది. ఆ సమయంలో బిల్కిస్ బానో ఐదు నెలల గర్భవతి.
తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2003, డిసెంబర్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఈ కేసును విచారించింది. ఒక నెల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు. 2004, ఆగస్ట్ నెలలో సుప్రీమ్ కోర్టు ఈ కేసు విచారణను ముంబైకి బదలాయించింది. 2008, జనవరిలో ముంబైలోని ప్రత్యేక సిబిఐ కోర్టు 20 మంది నిందుతులలో 13 మందిని దోషులుగా నిర్ధారించి, వారిలో 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.
2017, మే నెలలో బాంబే హైకోర్టు మొత్తం 11 మందికి పడిన జీవిత ఖైదు శిక్షను సమర్థించింది. విడుదలైన ఏడుగురు నిందితుల నిర్దోషిత్వాన్ని రద్దు చేసింది.
ఐదు సంవత్సరాల తరువాత, 2022 ఆగస్టు 15న, గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జైలు సలహా కమిటీ సిఫార్సు ఆధారంగా 11 మంది జీవిత ఖైదీలకు ఉపశమనం లభించింది
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ఖైదీలను విడుదల చేయడానికి హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఎచ్ఎ) విడుదల చేసిన మార్గదర్శకాలు- జీవిత ఖైదు పడినవారు, అత్యాచారం కేసులో శిక్ష పడినవారు ప్రత్యేక ఉపశమనం పొందటానికి వీలులేని దోషుల వర్గంలోకి వస్తారని పేర్కొంది.
ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఉపశమనానికి గల చట్టబద్ధతను గురించి అనేకమంది న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు.ఇక్కడ కవి, తన సొంత వేదనకు గొంతునిచ్చి బిల్కిస్‌తో మాట్లాడుతున్నారు
నా పేరవ్వు బిల్కిస్!
నా కవితలోంచి ఎగసిపడాలని చూస్తున్నది
మందమైన దాని చెవులలోంచి రక్తం
కారుతున్నది
నీ పేరులో ఉన్నదదేమిటి బిల్కిస్?
నరం లేని నాలుకను స్తంభింపజేస్తున్నది
మాట మధ్యలో గడ్డకట్టుకు పోతున్నది
నీ పేరులో ఉన్నదదేమిటి బిల్కిస్?
నీ కళ్ళల్లో ఎర్రెర్రగా జ్వలిస్తోన్న
దుఃఖపు సూర్యుళ్లు,
నీ నొప్పిని చూపే ప్రతి దృశ్యాన్నీ
మసకబారుస్తున్నాయి
ఆ నిప్పులుకక్కే అంతులేని
ఎడారి తీర్థయాత్ర,
సుడులు తిరుగుతోన్న జ్ఞాపకాల
సముద్రాలూ
పొగలు కక్కుతోన్న ఆ చూపు వేసిన
అడ్డుకట్ట
నా ప్రతి నమ్మకాన్నీ ఆవిరి
చేస్తున్నాయి
ఈ పేకమేడని,
అందరూ అంగీకరించిన ఈ అబద్ధాన్ని
నాగరికత అనే ఈ డొల్లని ధ్వంసం
చేస్తున్నాయి
నీ పేరులో ఉన్నదదేమిటి బిల్కిస్?
సముచిత న్యాయపు సూర్యకాంత
పూముఖం పైన సిరా బుడ్డీని
చిమ్మినదదేమిటి?
నీ పేరులో ఉన్నదదమేటి బిల్కిస్?
ముక్కలుగా పగులుతోన్న సలేహా
మృదు కపాలంలాగే
శ్వాసించే నీ రక్తంలో తడిసి
ఈ సిగ్గులేని భూగోళం ఒకనాడు
బద్దలవుతుంది
కేవలం ఒంటిపై మిగిలిన ఒకే
ఒక లోదుస్తుతో
నువ్వెక్కిన కొండ
బహుశా,
యుగాల తరబడి ఒక్క గడ్డి పోచయినా
మొలవక
నగ్నంగా మిగిలిపోతుంది
ఈ నేల మీదుగా వీచే ప్రతిగాలీ
నిస్సహాయతను శపిస్తూ సాగిపోతుంది
నిటారు పురుషాంగంలాంటి నా
కలం కూడా
పొడవైన ఈ విశ్వచాపం మధ్యలో
ఆగి
దాని సౌశీల్యపు పాళీని విరగ్గొట్టుకుంటున్నది
నీ పేరులో ఉన్నదదేమిటి బిల్కిస్?
నువు తాకి, ఊపిర్లూది ప్రాణనివ్వకపోతే
-
ఒక మృత క్షమా విధానంలా, ఒక
చీకటి చట్టంలా
ఈ కవిత కూడా నిష్పలమవుతుంది
దీనికి నీ పేరివ్వు బిల్కిస్.
పేరొక్కటే కాదు,
వయసుడిగి నీరసించిపోయిన నా
కవితావస్తువులకు
క్రియలు నువ్వవ్వు బిల్కిస్
నిస్తేజమైన నా నామవాచకాలను
విశేషణాలుగా మార్చు
ప్రశ్నార్థక క్రియా విశేషణాలై
ఎగసిపడేలా
పోరాటరీతుల్ని బోధించు బిల్కిస్.
నా భాషలోని అవిటితనాన్ని
మెలితిరిగిన, మృదువైన అలంకారాలతో
పూరించు.
ధీరోదాత్తతకు ఉపమవు నువ్వు
స్వేచ్ఛకు అర్థపల్లవం నువ్వు
న్యాయానికి పునరుక్తి శబ్దం
నువ్వు, బిల్కిస్,
ప్రతీకారానికి వ్యతిరేకాలంకారం
నువ్వు
ఈ కవితకు నీ చూపునివ్వు బిల్కిస్
నీ నుంచి ప్రవహిస్తున్న రాత్రి
దీని కాటుకవ్వనీ
దీని యతిప్రాసలు బిల్కిస్
స్వరతాళాలు బిల్కిస్
దీని హృదయాంతరాళంలో ధ్వనించే
పాట బిల్కిస్
కాగితాల పంజరాన్ని తెంచుకుని
ఈ కవిత విస్తరించనీ
స్వేచ్ఛగా పైకెగరనీ
మనిషితనమొక తెల్లపావురమై
ఈ రక్తాశ్రిత భువిని రెక్కలక్రిందకు
అదుముకోనీ
మందురాసి గాయాన్ని మాన్పనీ
బిల్కిస్, అంతా నీ పేరుమీదే
జరగనీ
ప్రార్థిస్తున్నాను -
ఈ ఒక్కసారి నా పేరవ్వు బిల్కిస్!
వచనానువాదం:
సుధామయి సత్తెనపల్లి
కవితానువాదం:
కె.
నవీన్
కుమార్