2020లో, కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించబడినప్పుడు, మా గ్రామం నుండి నాకొక సమాచారం వచ్చింది. దాదా , అంటే మా తాత, పడిపోవటంతో ఆయన కాలు విరిగింది. అక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యుడు కనిపించటం చాలా అరుదు. కరోనా కారణంగా సమీపంలోని ప్రైవేట్ క్లినిక్‌లను కూడా మూసివేశారు. నా కుటుంబం ఎలాగోలా ఆయన విరిగిన కాలుకు ప్లాస్టర్ వేసి, ఇంట్లోనే ఆయన్ని చూసుకుంది. కానీ ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ భరించలేని నొప్పితో అరిచేవారు. మరింత బలహీనపడ్డారు. చివరకు ఆ ఏడాది మే నెలాఖరున ఆయన తుది శ్వాస విడిచారు.

ఇదంతా జరిగినప్పుడు నేను ముంబైలో ఉన్నాను. ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో అందరికీ ఒకేసారి తుపాను దెబ్బకొట్టినట్లయింది. కరోనా భయం ఒకవైపు పెరుగుతోంటే, వీధుల్లో మాత్రం పోలీసులు లాఠీల వర్షం కురిపించారు. జీవనోపాధి స్తంభించిపోయింది. వలస కార్మికులు తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. నేను బతుకుదెరువు కోసం కూరగాయలు అమ్ముతుంటాను. అందువల్ల మాకు పని చేయడానికి అనుమతి లభించింది. అలా నేను ముంబైలో ఉండిపోయాను. కానీ మా దాదా చనిపోయారని వినగానే, వెంటనే ఉత్తరప్రదేశ్‌, జౌన్‌పూర్ జిల్లాలోని మా స్వగ్రామానికి వెళ్లాలని చాలా అనిపించింది. నాకు ఆయనతో ఒక భావోద్వేగభరితమైన అనుబంధం ఉండింది. దానికి తోడు అక్కడ మా అమ్మ తప్ప బాధ్యత తీసుకోగల వ్యక్తి ఇంకెవరూ లేరు.

అవి చాలా కష్టంతో కూడుకున్న సమయాలు. దేశం నలుమూలల నుండి వార్తలు వెల్లువెత్తుతున్నాయి: ఇంటికి వేళ్ళేందుకు కాలి నడకన వస్తున్న కొంతమంది కార్మికులు పూర్తిగా అలసిపోయి రైల్వే ట్రాక్ పై నిద్రపోయారు. రైలు వారి మీదుగా వెళ్లి, వారంతా చితికిపోయారు. ఒక తల్లి తన పాలుతాగే బిడ్డను చేతుల్లో పట్టుకుని ఆహారం, నీరు లేకుండా నడుస్తోంది. దాదా చనిపోయిన తర్వాత, నేను నా బ్యాగ్‌ సర్దుకుని, ఇంటికి వెళ్ళేందుకు రైళ్ల గురించి ఆరా తీయడానికి సమీప రైలు స్టేషన్,‌ అంధేరి (పశ్చిమ)కి వెళ్లాను. అలహాబాద్‌కి వెళ్లే రైలు నడవడం లేదని అక్కడ నాకు తెలిసింది. వారణాసి వద్ద ఒక రైలు నుంచి రెండు మృతదేహాలు లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. యూపీకి వెళ్లాల్సిన రైలు ఒడిశాకు బయలుదేరింది. నేను మా గ్రామానికి చేరుకోవడానికి అలహాబాద్ [ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు] దాటి ఇంకా 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఈ సంఘటనలు అప్పటికే బలహీనపడిన నా మనోధైర్యాన్ని మరింత దెబ్బతీశాయి. టాక్సీలో ప్రయాణించవచ్చు, కానీ అందుకు 40,000 నుండి 50,000 రూపాయలు ఖర్చవుతుంది. అంత స్థోమత లేకపోవడంతో ఇంటికి వెళ్లాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకున్నాను. ఇంక వేరే అవకాశమే లేదు.

Mithun Kumar (facing the camera) in a BEST bus, on his way to the vegetable market
PHOTO • Sumer Singh Rathore
Inspecting lemons at the mandi in Dadar, Mumbai
PHOTO • Sumer Singh Rathore

ఎడమ : మిథున్ కుమార్ ( కెమెరాకు ఎదురుగా ) ఒక బెస్ట్ బస్సులో , కూరగాయల మార్కెట్ కి వెళుతున్నప్పుడు . కుడి : ముంబై , దాదర్ లోని మండిలో నిమ్మకాయలను పరిశీలిస్తున్నారు

అంత్యక్రియల కోసం, దాదా ను అలహాబాద్‌లోని ఝూసీ పట్టణానికి తీసుకెళ్లారు. అప్పుడు వాహనాలు నడపడానికి అనుమతించలేదనీ, పోలీసులు రకరకాల ప్రశ్నలు అడిగారనీ మా అమ్మ చెప్పింది. వాస్తవానికి, చాలా చోట్ల దహన ఘాట్‌ల వద్ద అంత్యక్రియలను నిషేధించారు. భయం నీడలో ఎలాగోలా దాదా అంత్యక్రియలు జరిగాయి.

అనుకోకుండా నేను ముంబైలోనే పుట్టాను. కానీ నా బాల్యం జౌన్‌పూర్‌లో గడిచింది; నేను అక్కడే పాఠశాలకు వెళ్లాను. పప్పా , అంటే మా నాన్న, 1975లో దాదాపు 15 ఏళ్ల వయసులో ముంబైకి వచ్చారు. అయితే, ముంబైకి రావడం ఆయనకు అంత సులభం కాలేదు. అతను పుట్టిన వెంటనే తన తల్లిని కోల్పోయారు. ఉపాధి కోసం అతని తండ్రి, అంటే మా దాదా , ఇతరుల పొలాల్లో శ్రమించేవారు. అతను మట్టి కుండలు, ఇళ్ళ పైకప్పుగా వేసే పలకలను కూడా తయారుచేసేవారు. ఇవి తప్ప వేరే పని లేదు. ఇతరుల పొలాలను దున్నీ, కలుపులు తీసీ ఆయన తన మొత్తం కుటుంబాన్ని పోషించేందుకు తగినంత సంపాదించలేకపోయేవారు. బట్టలు ధరించడం పేరుతో, కుటుంబంలోని పురుషులు కేవలం జననాంగాలను కప్పి ఉంచే ధోవతి వంటి పొట్టి వస్త్రాన్ని దరించేవారు. దానిని భగాయ్ (గోచీ) అని పిలుస్తారు. ఆహారం కోసం గోధుమలు గానీ బియ్యం గానీ ఉండవు. సమీపంలోని పొలాల్లో పండించే సజ్జలు , మొక్కజొన్న, బంగాళాదుంప, మహువ(ఇప్ప)  ప్రధాన ఆహార వనరులు.

*****

మా దాదా ఎవరి ఇళ్లలో పనిచేశారో ప్రత్యేకంగా స్పష్టం చేయనవసరం లేదు
- భూమి యజమాని ఎవరు, అందులో శ్రమించినదెవరు

దాదా కు తాను చేసిన కష్టానికి తగ్గ వేతనం చాలాసార్లు లభించేదికాదు. అతని పూర్వీకులు చేసిన అప్పులు ఇంకా తీరనే లేదనీ, వాటిని అతనే తిరిగి చెల్లించాల్సి ఉందనీ అతనికి చెప్పేవారు. “మీ తాత ఇంత అప్పు చేశాడు, మీ ముత్తాత బకాయిలు ఇంత వరకు తీరలేదు…” బహుశా దాదా ఎవరి ఇళ్లలో పనిచేశారో స్పష్టం చేయాల్సిన అవసరం లేదు. భూమి యజమాని ఎవరు, అందులో శ్రమించినదెవరు. మా నాన్న కొద్దిగా పెద్దయ్యాక, మా దాదా పనిచేసిన కుటుంబంతో కలిసి జీవించడానికి వెళ్ళాడు. మా దాదా యే కష్టపడుతూ ఉండగా, తల్లిలేని బిడ్డలైన నాన్నను, ఆయన అన్నను చూసుకునే వారెవరూ లేరు. మా నాన్న వారి ఇంట్లో, వారి పొలాల్లో తనకు ఏ పని ఇచ్చినా చేస్తూ ఆ వ్యక్తులతో కలిసి జీవించేవాడు ఇక వేరే పని లేనప్పుడు వారి ఆవులను, గేదెలను మేపడానికి బయలుదేరేవాడు. ఇవన్నీ చేసినందుకు బదులుగా ఆయనకు తినడానికి కాస్త తిండి దొరికేది. అదే ఆయనకిచ్చిన ఏకైక వేతనం. ఇదంతా వదిలి వెళ్ళే అవకాశం లేదని నాన్న చెప్పారు.

PHOTO • Courtesy: Mithun Kumar
PHOTO • Courtesy: Mithun Kumar

ఉత్తరప్రదేశ్ , జౌన్ పూర్ జిల్లాలోని తమ గ్రామంలో పొలాల్లో పని చేస్తోన్న మిథున్ తల్లి . సుమారు 30 సంవత్సరాల క్రితం , తన భర్త నగరంలో కూరగాయలు అమ్ముతున్నప్పుడు , ఆమె గ్రామానికీ ముంబైకీ మధ్య తరచుగా ప్రయాణాలు చేస్తుండేవారు .

మా పొరుగింటాయన ఒకరు 1970లో ముంబైకి వచ్చి అరటిపండ్లు అమ్మడం ప్రారంభించాడు. అతని సహాయంతో, నా బడే పితాజీ (పెదనాన్న)- నాన్న కి అన్నయ్య- రెండు సంవత్సరాల తరువాత ముంబైకి వచ్చి అతనితో వ్యాపారంలో చేరాడు. ఆయన అతి తొందరలోనే అరటిపండ్లు అమ్మే స్వంత వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. కొంచెం డబ్బుతో ఆయన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మా ఇంట్లో మొదటిసారిగా ఉత్సాహం పొంగిపొరలింది. ఈసారి ముంబైకి తిరిగి వెళ్ళేటపుడు ఆయన మా నాన్నని కూడా తన వెంట తీసుకెళ్లాడు. కానీ మా నాన్న పనిచేస్తున్న కుటుంబం ఈ విషయం తెలుసుకుని మా పొరుగువారితో గొడవ పడింది. అతను 'తమ మనిషి'ని ప్రేరేపించి అవినీతికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. విషయం కాస్త పెరిగి తన్నులాటగా కూడా మారింది. మా రెండు కుటుంబాలకు బెదిరింపులు వచ్చాయి. కానీ ఇక్కడ అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసివున్నారు, కాబట్టి వారు ముంబైకి వెళ్లిపోయారు. వెట్టి చాకిరీ సంకెళ్లను తొలగించే దిశగా ఇది ఒక తొలి అడుగు. ఇది కేవలం 40-50 సంవత్సరాల క్రితం, స్వతంత్ర భారతదేశంలో జరిగిందంటే కొన్నిసార్లు నమ్మశక్యం కాదు కదా!.

తన అన్నతో కలిసి కొంతకాలం పనిచేసిన నాన్న తన సొంత పండ్ల దుకాణాన్ని ప్రారంభించారు. పరిస్థితులు చక్కబడడంతో అతని పెళ్లి తన ఊరిలోనే జరిపించారు. మా గ్రామంలో కొంతకాలం ఉండి, ఆ తర్వాత అక్కడికీ, ముంబైకీ మధ్య షటిల్ చేయడం ప్రారంభించారు. ఆమ్మ సంవత్సరంలో కొన్ని నెలలు ముంబైలో నాన్నతో గడిపి తిరిగి గామానికి వెళ్లేది. నేను 1990లో ముంబైలోని జుహు ప్రాంతంలోని కూపర్ హాస్పిటల్‌లో పుట్టాను.

మమ్మీ (అమ్మ) ఆర్థికంగా మెరుగైన కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి, అంటే మా నానా కు కొంత భూమి ఉంది. మా మామలు [తల్లి సోదరులు] ఇద్దరూ చదువుకున్నారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం, వారు 12వ తరగతి వరకు చదువుకోవడాన్ని ఒక ఘనతగా భావించవచ్చు. అంతే కాకుండా, వారి రాజకీయ ఒరవడి, సమాజం గురించిన ఆలోచనలు, దృక్పథాలు ఆధునికమైనవి. కానీ ఈ పితృస్వామ్య సమాజంలో, పురుషుల పరిస్థితులు ఎంత మెరుగుపడినా, మహిళల పోరాటాల వాటా మాత్రం ఎప్పటికీ అంతం కాదు. మా అమ్మ, ఆమె అక్కా చెల్లెళ్లు, వదినల జీవితాలు పొలాల్లో పని చేసుకోవడంలోనే గడిచిపోయాయి.

నా తల్లికి ఇంతకు ముందు ఒకసారి, వాళ్ళలాంటి ఆర్థిక స్థితి ఉన్న కుటుంబంలోనే వివాహం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చేసింది. ఎందుకో నాకు పూర్తిగా తెలియదు కానీ, నేను విన్నంత వరకూ అది ఆమెకు ఉన్న చర్మ వ్యాధి వల్ల కావచ్చు. నేనెప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆమె తన తండ్రి, సోదరులతోనే కొంతకాలం నివసించింది, ఆపై మా నాన్న తో మళ్లీ వివాహం జరిగింది. ఇది చాలా సింపుల్: నాన్న వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి అసలు బాగా లేదు. కాబట్టి మెరుగైన ప్రతిపాదన వచ్చినపుడు తిరస్కరించేందుకు ఎటువంటి కారణం ఉండదు.

PHOTO • Devesh
PHOTO • Sumer Singh Rathore

మిథున్ ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకు దాదర్ కూరగాయల మార్కెట్ కి వెళ్లి తన కొనుగోళ్లను టెంపోలో ( కుడివైపు ) భర్తీ చేసుకుంటారు . అది కూరగాయలను అతని దుకాణానికి చేరవేస్తుంది .

నేను పుట్టేంత వరకూ మా నాన్న దుకాణం బాగానే నడిచింది. కానీ కొన్ని సమస్యల కారణంగా ఆయన తన సొంత దుకాణాన్ని పోగొట్టుకున్నారు. అద్దె దుకాణం నుండి మళ్ళీ వ్యాపారాన్ని ప్రారంభించవలసి వచ్చింది. చివరికి, మేం ఐదుగురం పిల్లలం పుట్టిన తర్వాత, అమ్మ ముంబైకి వెళ్లడం దాదాపు ఆగిపోయింది. ఆమె గ్రామంలో మా దాదా కౌలుకు తీసుకున్న పొలాల్లో పనిచేయడం ప్రారంభించింది. మట్టి కుండల తయారీలో ఉపయోగించే మట్టిని సిద్ధం చేయడంలో కూడా ఆమె సహాయం చేసేది. కానీ ఆర్థిక ఒత్తిడి కారణంగా కుటుంబంలో విభేదాలు చాలా పెరిగాయి. అందుకని మా అమ్మ మా ఐదుగురం తోబుట్టువులను తీసుకుని కుటుంబం నుంచి విడిగా వచ్చి జీవించడం ప్రారంభించింది. ఆమె చేతిలో ఒక కచ్చా ఇల్లు, కొన్ని పాత్రలు, కొంత ధాన్యం తప్ప మరేమీ లేవు. అయితే, ఆమె సోదరులు మాకు కొంత డబ్బు సహాయం చేసి, ప్రారంభంలో మాకు రేషన్‌లు కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు మా అమ్మ గ్రామంలోని సవర్ణుల (హిందూ కులస్థులు) భూమిని కౌలుకు తీసుకుని సాగు చేయడం ప్రారంభించింది. మా అమ్మ శ్రమ ఫలితంగా ఒకటి రెండు సంవత్సరాలలోనే ఇంట్లో సరిపడా ఆహారం ఉండేది.అమ్మ ఇతరుల ఇళ్లలో కూడా పనిచేయడం ప్రారంభించింది. ఆమె అలా కష్టపడటం వల్లనే మా తిండీ బట్టల పరిస్థితి మెరుగుపడింది.

ఆ తర్వాతిసారి నాన్న ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నన్ను ఆయనతో ముంబైకి పంపింది. అది 1998-99వ సంవత్సరం అయి ఉండాలి. నాకు 8 లేదా 9 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. నేను ముంబైలో నా విచ్చలవిడి మార్గాలను విడిచిపెట్టి, నా తండ్రికి సహాయం చేస్తానని ఆమె ఆశించింది. ఇంతలో, నాన్న తన దుకాణాన్ని అటూ ఇటూ ప్రదేశాలు మారుస్తున్నారు. అయినా ఎక్కడా వ్యాపారం బాగా సాగలేదు. BMC [బృహణ్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్] మితిమీరిన చర్యలు కూడా అందుకు ఒక కారణం. ఆయనకు స్థిరమైన కార్యస్థలం లేదు. అయితే కొంతమంది ఒత్తిడికి తలొగ్గి నన్ను మున్సిపల్ స్కూల్‌లో చేర్పించాడు. నా వయస్సు ఆధారంగా, నన్ను 3వ తరగతిలో చేర్చారు. నేను అక్కడ కొత్త పిల్లలను కలుసుకున్నాను. మళ్లీ పాఠశాలకు వెళ్లాలనినిపించడం ప్రారంభమైంది.

*****

పరిస్థితులు నన్ను 3-4 సంవత్సరాలు చదువుకోడానికి అనుమతించలేదు .
ఇక కలను వదులుకోవాలని నిర్ణయించుకున్నాను

నాన్న పొద్దున్నే కూరగాయల మార్కెట్‌కి బయల్దేరతారు. నేను కొంచెం పాలు తాగి, బిస్కెట్లు తిని, ఆపై చేతిలో కొంత డబ్బు తీసుకొని ఉదయం 7 గంటలకు పాఠశాలకు బయలుదేరతాను. ఉదయం 10 గంటలకు భోజన సమయం కాగానే, పాఠశాల క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్న సమోసా లేదా వడ తింటాను. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాక, మా నాన్న సూచనలను అనుసరించి కిరోసిన్ స్టవ్‌పై వంట చేస్తాను. పొద్దున ఇంటి నుండి బయలుదేరే ముందే, ఆయన సాధారణంగా నాకు దాల్ (పప్పు) అన్నం లేదా కొంత ఖిచిడీ చేసే పద్ధతిని చెప్పి వెళతారు. నా తొమ్మిదేళ్ల మెదడు గ్రహించగలిగిన దాని ఆధారంగా నేను వంటచేస్తాను. కొన్నిసార్లు అన్నం నీళ్ళగా ఉంటుంది. లేదా అడుగున మాడిపోతుంది, లేదా సగం సగం ఉడుకుతుంది. వంట పూర్తి చేసిన తర్వాత ఒక టిఫిన్ డబ్బాలో సర్దుకుని, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన దుకాణానికి వెళ్ళేందుకు బెస్ట్ [పౌర రవాణా] వాళ్ళ బస్సు ఎక్కుతాను. భోజనం చేస్తున్నప్పుడు ఆయన తరచుగా నా మీద అరిచేవారు, “ఏంటిలా చేశావు? నేనిది చేయమని చెప్పానా? నువ్వు దాన్ని నాశనం చేసేశావు,” మొదలైనవి.

PHOTO • Sumer Singh Rathore
PHOTO • Devesh

ఎడమ : మిథున్ ఉదయం 6:30 గంటలకు రోడ్డు పక్కన ఉన్న తన కూరగాయల దుకాణాన్ని తెరిచారు . కుడివైపు : తర్వాత అతను దాని ముందున్న స్థలాన్ని శుభ్రం చేస్తారు

మధ్యాహ్నం, నాన్న ఫుట్‌పాత్‌పై పడుకునేవారు. అప్పుడు నేను దుకాణాన్ని నడిపేవాణ్ని. అయితే ఇంతటితో అయిపోలేదు. ఆయన సాయంత్రం మేల్కొన్న తర్వాత, నేను సమీపంలోని లేన్లలో తాజా కొత్తిమీర, నిమ్మకాయలు అమ్మడానికి బయలుదేరేవాణ్ని. నా ఎడమ మణికట్టు మీద కొత్తిమీర కట్టలు పేర్చుకొని, రెండు అరచేతులలో నిమ్మకాయలు పట్టుకుని దారినపోయేవారికి అమ్మే కళను నేర్చుకున్నాను. కొత్తిమీర, నిమ్మకాయలు అమ్మి రోజూ 50 నుంచి 80 రూపాయలు సంపాదించేవాణ్ని. ఇలా దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగింది. అప్పుడు నాన్న హఠాత్తుగా ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది, దాంతో నేనూ ఆయనతోపాటు వెళ్ళాల్సివచ్చింది. నా చదువు 5వ తరగతి మధ్యలోనే ఆగిపోయింది.

ఈసారి మా అమ్మ నన్ను గ్రామంలోనే ఉంచేసింది. నాకు విద్య అవసరమని ఆమె భావించింది. కనీసం తన పిల్లలలో ఒక్కరైనా చదువుకోవాలనుకున్నది. బహుశా ఆమె నన్ను వెనక్కి వెళ్లకుండా ఆపడానికి కారణం ముంబైలో నేను పడుతున్న కష్టాలే అనుకుంటాను. నేనెప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు, ఆమె కూడా నేనెక్కడ ఉండాలనుకుంటున్నానో నన్ను అడగలేదు. అయితే ఆమె నాకు ఏది మంచిదని అనుకుందో అదే చేసింది.

మా మామ ఇంట్లో వాతావరణం చదువుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మా అమ్మ తన సోదరుడితో ఒక మాట చెప్పటంతో, నేను 11 సంవత్సరాల వయస్సులో ఆయన ఇంట్లో ఉండటానికి వెళ్ళాను. అక్కడున్న పిల్లలంతా బళ్ళోకి వెళ్తున్నారు; చదువుకోవడానికి అలాంటి ఏర్పాటు కలిగి ఉండటం నాకు అదే మొదటిసారి. మా మామయ్యలు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి నా చుట్టూ ఉండే వాతావరణం తరచుగా రాజకీయంగా ఉండేది. అక్కడే నేను మొదటిసారిగా రాజకీయ పార్టీల పేర్లు విన్నాను. ప్రాంతీయ నాయకుల పేర్లను తెలుసుకున్నాను. ఒక మధ్యాహ్నం, మాకు పొరుగింటి 'అంకుల్', ఇతరులకు 'కామ్రేడ్' అయిన ఆయన ఎర్ర జెండాల గుత్తితో ఇంటి గుమ్మం వద్ద నిల్చునివున్నారు. ఆరా తీస్తే, అది కమ్యూనిస్ట్ పార్టీ జెండా అనీ, రైతుల కార్మికుల జెండా అనీ నాకు తెలిసింది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా వారు ప్రదర్శనకు వెళ్లారు. ప్రభుత్వాన్ని ప్రతిఘటించడం కూడా సాధ్యమేనని నేను మొదటిసారిగా అర్థం చేసుకున్నాను.

నేను 2008లో 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడినయ్యాక, మా మామ నన్ను పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సంగతి మా అమ్మతో చర్చించినప్పుడు ఇంట్లో పరిస్థితులు మునుపటిలా లేవని చెప్పింది. ఆమె ఆ ఆలోచనకు ఒప్పుకోకపోయినా, మా మామ తానే స్వయంగా దరఖాస్తు చేశారు. నేను మొదటి ప్రయత్నంలో మంచి ర్యాంక్ సాధించలేదు. దాంతో మరుసటి సంవత్సరం మళ్లీ ప్రయత్నించాను. నా ఏడాది ప్రయత్నాల కారణంగా, మంచి ర్యాంక్ వచ్చింది. ఈసారి ప్రభుత్వ కళాశాలలో సీటు వచ్చింది. కౌన్సెలింగ్ లెటర్ [అడ్మిషన్ కోసం] వచ్చింది. పూర్తి సంవత్సరం ఫీజు రూ. 6,000. నేను మా అమ్మని మరోసారి అడిగాను, కానీ ఆమె ఒప్పుకోలేదు. మామయ్య, "చూద్దాం..." అన్నారు. కానీ నా చెల్లెళ్ళు ఎదుగుతున్నారనీ, నాన్న మునుపటిలా సంపాదించలేకపోతున్నారనీ అమ్మ మళ్లీ చెప్పింది. ఆమె చెప్పింది నిజమే. మేము ఎలా నెట్టుకురాగలం? పరిస్థితులు నన్ను 3-4 సంవత్సరాలపాటు చదువుకోడానికి అనుమతించలేదు. ఇక ఆ కలను వదిలేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

PHOTO • Sumer Singh Rathore
PHOTO • Sumer Singh Rathore

ఎడమ : అతను తన కస్టమర్లు రాకముందే కూరగాయలను అమరిక చేస్తారు . కుడివైపు : అమ్మకానికి ఉంచే ముందు పాలకూర కట్ట చివరలను కత్తిరిస్తున్నారు

ఆ తర్వాత చాలాసార్లు సైకిల్‌ ఎక్కి మా ఊరికి దూరంగా ఉండే మార్కెట్‌ ఏరియాల్లో పనికోసం వెతుక్కుంటూ వెళ్ళేవాణ్ని. నేనెవరో ఎవరికీ తెలియని ప్రదేశాలలో ఉద్యోగం వెతుక్కోవాలని ప్రయత్నించాను. నాకు తెలిసినవాళ్ళని అడగడానికి సంకోచించాను. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రక్రియలో నాకు ట్యూషన్లు చెప్పే ఉద్యోగం దొరికింది. కానీ 2-3 నెలల్లోనే నాకు రావలసిన పూర్తి డబ్బు వాళ్ళు చెల్లించడం లేదని గమనించాను. కలత చెందాను. ముంబై వెళ్లాలని అనుకున్నాను. నాన్న కూడా అక్కడే ఉన్నారు కాబట్టి నాకు ఏదో ఒక ఉద్యోగమో, లేదా పనో దొరకవచ్చు. ఇందుకు అమ్మ కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఒకరోజు మా పెదనాన్న మొదటిసారి ముంబైకి ఎవరితోనైతే కలిసివెళ్ళారో, అదే పొరుగింటాయన కొడుకుతో కలిసి నేనూ ముంబైకి వచ్చాను.

*****

ఉద్యోగం కోసం వేట మళ్ళీ మొదలయింది . ఉండటానికి ఒక చోటంటూ లేకుండా ,
పనికోసం వెదుకులాటలోనే రోజులు గడచిపోయాయి

ముంబైలోని అంధేరి (పశ్చిమ) ప్రాంతంలో, నాన్న తన కూరగాయల దుకాణాన్ని నడుపుతుంటారు. ఫుట్‌పాత్‌ పైననే ఒక మూలన భోజనం వండుకుని తిని, అక్కడే పడుకుంటారు. ఆయనతో కలిసి అలా ఉండడం కష్టంగా ఉండేది. నాకు పాల దుకాణంలో పని దొరికింది. నేను దుకాణాన్ని చూసుకుంటూ, కొన్నిసార్లు కొన్ని చోట్లకు వెళ్ళి వస్తువులు ఇచ్చి వస్తుండాలని, అందుకోసం అక్కడే ఉంటూ పని చేయాల్సివుంటుందని దుకాణం యజమాని చెప్పాడు. సెలవనేది లేకుండా నెలలో అన్ని రోజులూ పని చేయాల్సివస్తుంది. నా నెల జీతం 1,800 రూపాయలు. నేను అతని ప్రతిపాదనను అంగీకరించాను. అయితే వారం రోజుల్లోనే నా రెండు కాళ్లు ఒక్కసారిగా వాచిపోయాయి. నొప్పి భరించలేనంతగా ఉండింది. కూర్చున్నప్పుడు మాత్రమే నాకు ఉపశమనం కలిగేది. దాదాపు 20 రోజుల తర్వాత, ఆ నెలాఖరుకు మించి పని చేయలేనని నా యజమానితో చెప్పాను.

ఉద్యోగం కోసం వేట మళ్లీ మొదలైంది. ఉండడానికి స్థిరమైన స్థలం లేకపోవడంతో, పని కోసం వెతుకుతూ రోజంతా గడిపేవాణ్ని. ఆపైన బస్టాప్‌లోనో లేదా మూసివుండే దుకాణం వెలుపలో పడుకునేవాణ్ని. చివరకు జనం పందేలు కాసేందుకు వచ్చే లాటరీ షాపులో ఉద్యోగం వచ్చింది. లాటరీ నంబర్లను బోర్డు మీద రాయాలి. అందుకు నాకు రోజుకు 80 రూపాయలు చెల్లిస్తారు. ఒకసారి, మా దుకాణం యజమాని తానే స్వయంగా బెట్టింగ్‌లు వేయడం ప్రారంభించాడు. దాదాపు 7 లక్షల నుండి 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజులపాటు దుకాణం తెరవలేదు. మూడవ రోజు, నా యజమానిని అతని యజమాని కొట్టాడని, మరొక వ్యక్తి బాధ్యతలు స్వీకరించే వరకు దుకాణం మూసే ఉంటుందని నాకు చెప్పారు. కానీ కొత్త బాస్ రాలేదు. నాకు రావాల్సిన సుమారు 1,000 రూపాయలు మునిగిపోయాయి. నేను పని కోసం మరోసారి వీధుల్లో పడ్డాను.

PHOTO • Devesh
PHOTO • Devesh

మిథున్ కస్టమర్లలో చాలామంది క్రమం తప్పని కొనుగోలుదారులు ; మరికొందరు స్నేహితులుగా మారారు . అతను 2008 నుండి ముంబైలో కూరగాయలు విక్రయిస్తున్నారు

ఇంతలో, నాన్న కాళ్ళు ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. ఆయన్ని తిరిగి ఇంటికి వెళ్లమనీ, నన్నిక్కడ దుకాణాన్ని నడపనివ్వమనీ నేనాయన్ని అడిగాను. నేను దుకాణాన్ని నడపలేననీ, వీధుల్లో జీవితం సమస్యలతో నిండి ఉంటుందనీ నాన్న అన్నారు. కానీ ఆయన తిరిగి వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి, నేను వ్యాపారాన్ని నడిపించడానికి ఆయనను ఒప్పించగలిగాను.

బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే దాదాపు 1,500 రూపాయలు ఆదా చేశాను. ఇది నాకు చాలా పెద్ద మొత్తం; అది పని పట్ల నాలో అంకితభావాన్ని రేకెత్తించింది. ఒక నెల రోజులపాటు కష్టపడిన తర్వాత 5,000 రూపాయలు ఆదా చేయగలిగాను. నేను పోస్టులో మనియార్డర్ ఇంటికి పంపినప్పుడు మా అమ్మ చాలా సంతోషించింది. ఆయన చేయలేని చోట నేను చాలా పొదుపు చేసినందుకు నా తండ్రి చాలా ఆశ్చర్యపోయారు.

నేను కూరగాయలమ్మే చోటికి ఎదురుగానే నా వయస్సే ఉన్న ఒక యువకుడు మరొక కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాడు. మేమిద్దరం మెల్లగా మంచి స్నేహితులమయ్యాం. అతను మొదటిసారిగా నాకు ఒక ప్లేట్ భోజనం అందించటం నాకు గుర్తుంది. అతని పేరు ఆమిర్. అతనితో స్నేహం అయినతర్వాత, నాకు భోజనం గురించి ఒత్తిడి లేకుండా పోయింది. ఇప్పుడు ఏం వండాలో ప్రతిరోజూ ఆమిర్ నన్ను అడుగుతాడు. నాకు వంట చేయడం రాదు కాబట్టి, మేం తిన్న తర్వాత నేను ఆ గిన్నెలను శుభ్రం చేస్తాను. మేము వీధిలో, బహిరంగ ప్రదేశంలో పడుకునే చోట డబ్బులు పోవటం మొదలైంది. ఒకసారి జేబులో పెట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ని ఎవరో తీసేసుకున్నారు. దాంతో, కొన్ని రోజుల తర్వాత, ఒక గదిని అద్దెకు తీసుకోవాలని నేనూ ఆమిర్ నిర్ణయించుకున్నాం. మాకు తెలిసిన ఒకాయన మేముండే చోటుకు దగ్గరలోని ఒక చాల్(భవనం)‌లో ఉండేందుకు గది చూసిపెట్టాడు. మేము డిపాజిట్ చెల్లించాల్సి వచ్చింది, అద్దె నెలకు 3,000 రూపాయలు. ఆ మొత్తాన్ని నేనూ ఆమిర్ చెరిసగం పంచుకున్నాం.

ఊరిలో ఉండే మా ఇల్లు కచ్చా ఇల్లు. కొంతకాలం క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లంతా పాడయింది. మరమ్మతులు చేసినప్పటికీ ఇంకా బలహీన స్థితిలోనే ఉంది. అందుకని మేం దాని స్థానంలో అదే ప్లాట్‌లో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాము. ఆ సమయంలో, 2013లో, నా రెండు కాళ్లలో ఒక విచిత్రమైన నొప్పి మొదలయింది. కాల్షియం లోపం వల్లనే ఇలా జరిగిందని గ్రామ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్‌ చెప్పాడు. నా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడనందున ఆయన అనేక పరీక్షలు రాశాడు. పోలియో అని రిపోర్టులో తేలింది. చికిత్స చేసినప్పటికీ నా ఆరోగ్యం క్షీణించింది. ఉపశమనం లేనందున, నా కుటుంబం ఓజా - సోఖా [నమ్మకాల మీద వైద్యం చేసేవారు, మంత్రగాళ్ళు] లను సందర్శిస్తూనే ఉంది. దవా , దువా [మందులు, ప్రార్థనలు] రెండింటి మీదా డబ్బు ఖర్చవుతోంది. కానీ ఉపయోగం లేదు. నేను పొదుపు చేసినదంతా ఖర్చయిపోయింది. నా అవస్థని చూసి, కొంతమంది బంధువులు ముందుకువచ్చారు. నేను ముంబైకి తిరిగి వచ్చాను.

PHOTO • Sumer Singh Rathore
PHOTO • Sumer Singh Rathore

ఎడమ : అతను జిమ్ లో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు . ఇది చాలామందిని ఆశ్చర్యపరుస్తుందని అతనంటారు . ' కూరగాయల వ్యాపారులకు ఆరోగ్యంగా ఉండే హక్కు లేదా ?' కుడి : ఇంట్లో వంటచేస్తూ

నా మనసు రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడుతోంది. కొన్నిసార్లు నేను మా గ్రామంలో ఉన్నట్లు అనిపించేది, మరికొన్నిసార్లు నేను ముంబైలోనే ఉన్నట్లు అనిపించేది. స్నేహితురాలిగా మారిన కస్టమర్‌ కవితా మల్హోత్రా ఈ విషయం తెలుసుకుని ఆందోళనకు గురైంది. ఆమె వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. తనకు తెలిసిన వైద్యులను కలవడానికి నన్ను తీసుకువెళ్లింది. వారి ఫీజు కూడా స్వయంగా ఆమే చెల్లించింది. కొంతమంది గోల పెట్టడంతో ఆమిర్ నన్ను దర్గాకు తీసుకెళ్లాడు. కొన్నిసార్లు నేను నా బట్టలన్నీ తీసేసి గందరగోళంగా పరుగెత్తుతుంటానని జనం నాకు చెప్పేవారు. ఆ తర్వాత ఒకరోజు, ఒక పరిచయస్తుడి సహాయంతో, నాన్న నన్ను రైలులో తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడ, నన్ను మరోసారి వైద్యుల దగ్గరకూ, నాటువైద్యుల వద్దకూ తిప్పారు. మమ్మల్ని అలహాబాద్‌లోని వైద్యుల వద్దకు వెళ్ళమని కొందరు చెప్పారు. ఒక బొలెరోని [పికప్ ట్రక్] బుక్ చేసుకుని, నాతో పాటు మా అమ్మ బయలుదేరేది. ఆమె వద్ద డబ్బు లేదు; కొందరు బంధువులు ఆర్థిక సహాయం చేశారు. నా బరువు 40 కిలోలకు తగ్గింది. మంచం మీద పడుకుని ఉన్న నేను ఒక ఎముకల సంచిలా కనిపించేవాణ్ని. నేను బతుకుతాననే ఆశ ఎవరికీ లేదు. ఒక్క నా తల్లి మాత్రం ఆశను కోల్పోలేదు. నా చికిత్స కోసం ఆమె తన నగలను ఒక్కటొక్కటిగా అమ్మేసింది.

ఇంతలో, ఒకరి సిఫార్సుపై నేను అలహాబాద్‌లోని మానసిక వైద్యుడు డాక్టర్ టాండన్‌ వద్ద చికిత్స ప్రారంభించాను. ఆగస్ట్ 15, 2013న ఆయన మాకు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. అయితే మేము ప్రయాణిస్తున్న బస్సు మార్గమధ్యంలో చెడిపోయింది. మేము అలహాబాద్‌కు వేళ్ళే బస్సును పట్టుకునే క్రాసింగ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఇది జరిగింది. నేను దృఢంగా నిశయించుకుని, నడవడం ప్రారంభించాను. కానీ కొంచెం దూరం నడిచిన తరువాత ఇక నడవలేక రోడ్డు పక్కన కూర్చున్నాను. మా అమ్మ, “వెళ్దాం. నేను నిన్ను నా వీపుపై మోస్తాను." అంది. ఆమె ఇలా అనడంతో నేను ఏడవడం మొదలుపెట్టాను. మా అమ్మ అభ్యర్థిస్తున్నట్టుగా చేతులు జోడించటం చూసి ఆ దారిలో వెళుతున్న టెంపో ఆగింది. డ్రైవర్ మమ్మల్ని బస్సులో ఎక్కించి కూడా డబ్బులు తీసుకోలేదు. నా అనారోగ్యం గురించి నాకు జ్ఞాపకం లేదు కానీ, ఈ సంఘటన మాత్రం నాకు స్పష్టంగా గుర్తుంది. అప్పటి నుంచి నా ఆరోగ్యం కుదుటపడటం మొదలైంది. నెమ్మదిగా బరువు పెరగడం ప్రారంభించాను, కానీ బలహీనత ఇంకా ఉంది. నేను పెద్దగా బరువులు ఎత్తలేకపోయేవాణ్ని. కానీ నన్ను నేను గట్టిపరచుకొని ముంబైకి తిరిగి వచ్చి మళ్లీ పని ప్రారంభించాను. పనిలో వేగం పుంజుకోవడం మొదలయింది. తరువాతి రెండేళ్లలో పరిస్థితి మెరుగుపడింది. ఆ తర్వాత 2016లో పెద్దనోట్ల రద్దు (డీమోనిటైజేషన్) ప్రకటించబడింది. నా వ్యాపారం కుప్పకూలింది.

*****

భగత్ సింగ్ రచనలు చదివిన తర్వాత , భగత్‌సింగ్‌ కలలు కన్న భారతదేశమేనా నేటి భారతదేశం అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

నేను సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం మొదలెట్టాను. వాట్సాప్‌లో వచ్చిన సందేశాలు చదవడం వల్ల నా మనసు పూర్తిగా మితవాద ధోరణుల వైపు మళ్లింది. కేవలం ఏడాదిన్నర వ్యవధిలో, సోషల్ మీడియా నన్ను ఎంతగా పట్టుకుందంటే, నేనొక ముస్లిమ్ కుటుంబంతో కలిసి జీవిస్తున్నప్పటికీ, నేను ముస్లిమ్‌లను ద్వేషించడం మొదలుపెట్టాను. ఆమిర్ నా మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ నాకు ఇతర ముస్లిమ్‌లతో పెద్ద సమస్య ఉంది. పాకిస్తాన్, కశ్మీర్, ఈశాన్య [భారతదేశం]తో నాకు పెద్ద సమస్యలు ఉన్నాయి. నేను పుట్టిన మతాన్ని అనుసరించని వారితో నాకు సమస్యలు ఉన్నాయి. జీన్స్ వేసుకున్న మహిళను చూడగానే ఆమె సమాజాన్ని పాడుచేస్తోందని అనిపించేది. ప్రధానమంత్రిపై ఏదైనా విమర్శలు వినపడినప్పుడు, నా మెస్సయా(దేవుడు)ను ఎవరో దూషిస్తున్నట్టుగా నాకు అనిపించేది.

నేను నా అభిప్రాయాలను వ్యక్తంచేయాలని భావించాను. సోషల్ మీడియాలో నా స్వంత అనుభవాలను కథలుగా రాయడం మొదలుపెట్టాను. పాఠకులు నాతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు

వీడియోను చూడండి : కూరగాయలను అమ్మటం , సమానత్వం గురించి ఆలోచించడం

ఒకరోజు ఆమిర్ మయాంక్ సక్సేనా అనే జర్నలిస్టును గురించి ప్రస్తావించాడు. ఫేస్‌బుక్‌లో అతని కొన్ని పోస్ట్‌లను కూడా నాకు చూపించాడు. అతను అర్థంలేని మాటలు మాట్లాడాడని నేను అనుకున్నాను. ప్రధానిని విమర్శిస్తున్న వ్యక్తిని ఆమిర్ ప్రశంసించాడు. అది నేను తట్టుకోలేకపోయాను. కానీ నేను ఆమిర్‌ని ఏమీ అనలేదు. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు మయాంక్‌ని కలవడం జరిగింది. పొట్టిగా, పొడవాటి జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి చిరునవ్వుతో నన్ను కలిశాడు. కానీ నేను అప్పటికే అతనిని అసహ్యించుకున్నాను.

మయాంక్ ఇతర స్నేహితులు కూడా అతనిలాగే ఆలోచించేవారు. వాళ్ళు వాదించుకోవడం నేను చూస్తూ ఉండేవాణ్ని. నేనెన్నడూ వినని పుస్తకాలు, వ్యక్తులు, ప్రదేశాలు, గణాంకాలు, వారు బయటకు తీసేవారు. మయాంక్ నాకు సత్య కే సాథ్ మేరే ప్రయోగ్ [The Story of My Experiments with Truth - సత్యంతో నా ప్రయోగాలు] అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది గాంధీ రాసిన పుస్తకం. గాంధీ, నెహ్రూలకు వ్యతిరేకంగా నా మనస్సు ఇంకా విషపూరితమయ్యే ఉంది; నేను ఆ ఇద్దరిపై తీవ్రమైన పగతో ఉన్నాను. అయితే, నాకు ఆ పుస్తకం బోర్ అనిపించినా చదువుతూనే ఉన్నాను. మొదటిసారిగా నేను గాంధీ గురించి చాలా నేర్చుకున్నాను. ఇంకా చదవడానికీ, నేర్చుకోవడానికీ చాలా ఉంది. మెల్లమెల్లగా నా మదిలో నిండిన చెత్త బయటకు పోవడం ప్రారంభించింది.

దాదర్‌లో ఒకసారి ఒక నిరసన ప్రదర్శన జరిగింది. మయాంక్ అక్కడికి వెళ్తున్నాడు. నువ్వు కూడా వస్తావా, అని నన్నడిగాడు. అందుకే నేనతని వెంట వెళ్ళాను. దాదర్ రైల్వే స్టేషన్‌ను పెద్ద ఎత్తున ప్రజలు చుట్టుముట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలను వారు నిరసిస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఎర్రజెండాను చూశాను. మయాంక్ ఒక డఫ్లీ [కంజీర] తీసుకొని ప్రజానుకూలమైన పాటలు, ప్రతిఘటన పాటలు పాడటం ప్రారంభించాడు. ఇలా నిరసనలో ఉండటం నాకు ఇదే మొదటిసారి. ఆ అనుభవం అధ్బుతానికి తక్కువేమీ కాదు. మయాంక్‌కి కాస్త ఖాళీ దొరికిన తర్వాత, ఇక్కడికి రావడానికి ఇంతమంది జనానికి డబ్బులెవరిచ్చారు, అని అడిగాను. అతను వెనక్కి తిరిగి, నువ్వు రావడానికి నీకెవరు డబ్బులిచ్చారని.నన్ను అడిగాడు. ఆ ప్రశ్నలోనే, నాకు సమాధానం దొరికింది.

PHOTO • Devesh
PHOTO • Devesh

మిథున్ తన కస్టమర్లకు కూరగాయలు అమ్ముతూనే మధ్యమధ్యలో చదువుతారు . ' చాలా చదవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే , నాకూ రాయాలనే కోరిక మొదలయింది.'
అతను ఏడు సంవత్సరాలకు పైగా సోషల్ మీడియాలో రాస్తున్నారు . పాఠకుల నమ్మకమైన ఫాలోయింగ్ ఆయనకుంది

అదే నిరసనలో నేను అన్వర్ హుస్సేన్‌ని కలిశాను. అతను కూరగాయలు కొనడానికి దుకాణం దగ్గరికి రావడం ప్రారంభించాడు. నాకు చదవటమంటే ఇష్టమని తెలిసి, నా కోసం కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చాడు. అందులో చాలా పుస్తకాలు మంటో, భగత్ సింగ్, మున్షీ ప్రేమ్‌చంద్ రాసినవి. స్త్రీల పట్ల నా వైఖరిని మార్చుకోవడం ప్రారంభించేంతగా మంటో నన్ను కదిలించాడు. భగత్‌సింగ్‌ని చదివాక, భగత్‌సింగ్‌ కలలు కన్న భారతదేశమేనా నేటి భారతదేశం అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మున్షీ ప్రేమ్‌చంద్‌ను చదవడం వల్ల నేను నా జీవితాన్ని, నా ప్రజలను, నా సమాజాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది. తర్వాత హరిశంకర్ పర్సాయీని చదవడం మొదలుపెట్టాను. ఆయన రచన నన్ను నేను మార్చుకునేలా, సమాజాన్ని కూడా మార్చే విధంగా నన్ను కదిలించింది. ఈ వ్యక్తి ఈ సమయంలో ఇక్కడ ఉండాలని నేను తరచుగా కోరుకుంటున్నాను - అతను ఉండివుంటే, ప్రతి ఒక్కరి గుట్టు బట్టబయలు చేసి ఉండేవాడు.

ఒక సమాజం, లింగం, ప్రాంతం లేదా జాతి పట్ల నాకున్న ద్వేషం ఇప్పుడు ఆవిరైపోతోంది. చాలా చదివినందువలన ప్రయోజనం ఏమిటంటే, నాకు రాయాలనే కోరిక మొదలయింది. ఫేస్‌బుక్‌లో కొంతమంది ప్రముఖ రచయితల పోస్ట్‌లు చదివినప్పుడు, ఆ రచనలు నాకు డాంబికంగా అనిపించాయి. నా అభిప్రాయాలను చెప్పాలనిపించింది. సోషల్ మీడియాలో నా స్వంత అనుభవాలను కథలుగా రాయడంమొదలుపెట్టాను. పాఠకులు నాతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. నేను కూడా కొంతమంది మంచి రచయితలను ఫాలో అవుతున్నాను. అలా నేర్చుకునే ప్రక్రియ కొనసాగింది.

*****

మా పెళ్లిలో మంగళసూత్రం లేదు , కన్యాదానం లేదు , కట్నం లేదు .
నేను డాలీ నుదుటిపై సిందూరం పెట్టాను ఆమె తిరిగి అదే పని చేసింది

నేను వీధిలో పని చేస్తుంటాను కాబట్టి లెక్కలేనన్ని పోలీసు దౌర్జన్యాలను అనుభవించాను. దోపిడీ, దౌర్జన్యం, మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి గంటల తరబడి అక్కడే ఉంచడం, ఒక పద్ధతంటూ లేకుండా 1250 రూపాయల జరిమానా విధించడం - ఇలా చాలా జరిగాయి. వీటన్నిటినీ నేను రాయడం ప్రారంభిస్తే, అది ఒక పేద్ద పుస్తకంలోని పేజీలను నింపుతుంది. ఎంతమంది పోలీసులు నన్ను కొట్టారో, బెదిరించారో! నేను హఫ్తా [రక్షణ ఇచ్చే పేరుతో బలవంతంగా వసూలు చేసే సొమ్ము] చెల్లించడానికి నిరాకరించినప్పుడు, వారు నన్ను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించి, గంటల తరబడి నగరంలో ఈడ్చుకుంటూ వెళ్లారు. ఇదంతా మామూలే. ఈ అనుభవాల గురించి సోషల్ మీడియాలో రాయడానికి భయంగా ఉంటుంది. కానీ నేను ఆ పోలీసుల పేరు గానీ, నగరం, లేదా రాష్ట్రం గురించి గానీ ప్రస్తావించకుండా రాశాను. పెద్ద నోట్ల రద్దు తర్వాత, సీనియర్ జర్నలిస్ట్, చిత్ర నిర్మాత రుక్మిణి సేన్ నా రచనలను గమనించి సబ్‌రంగ్ ఇండియా కోసం రాయమని నన్ను ఆహ్వానించారు. దానికి రాయడాన్ని నేను కొనసాగిస్తున్నాను.

PHOTO • Courtesy: Mithun Kumar
PHOTO • Sumer Singh Rathore

2019 లో జరిగిన వారి వివాహ వేడుకలో మిథున్ నుదిటిపై సిందూరాన్ని పూస్తున్న డాలీ ( ఎడమవైపు ). వారి వివాహ ప్రమాణంలో జంట , తమ మధ్య సమానత్వాన్ని ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు

2017లో నా రెండో చెల్లెలు పెళ్లి కూడా అయిపోయింది. నాపై కూడా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి మొదలైంది. పెళ్లి వంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని సామాజిక ఒత్తిడితో తీసుకోకూడదని నేను అప్పటికే గ్రహించాను. ఈ సమయంలోనే నా జీవితంలోకి డాలీ వచ్చింది. మేము సమయాన్ని కలిసి గడిపేవాళ్ళం. అది తరచుగా ప్రజలను ఇబ్బంది పెట్టేది. ఆమె ఎవరు? ఆమెదే కులం? వంటి రకరకాల ప్రశ్నలు వేసేవారు. నా కులంలో పుట్టినవారు ఆమె కులాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఆమె వేరే కులానికి చెందినవారు కావడంతో వారు ముక్కువిరిచేవారు. కానీ నేను వీటన్నింటికీ మించి ఎదిగాను.

డాలీ తన కుటుంబానికి నా గురించి చెప్పింది. కొన్ని రోజుల తర్వాత  నేను వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిశాను. వీలైనంత త్వరగా మాకు పెళ్లి చేయాలని మా కుటుంబ సభ్యులు కోరుకున్నారు. డాలీ, నేనూ కూడా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిగానే ఉన్నాం కానీ, అది మేం కొంచెం స్థిరపడిన తర్వాత జరిగితే బాగుంటుందనుకున్నాం. ఇలా రెండు, రెండున్నరేళ్లు గడిచిపోయాయి, అప్పుడు డాలీ తల్లిదండ్రులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. వారు అమ్మాయి తల్లిదండ్రులు, వారిపై ఉండే సామాజిక భారం వేరే విధంగా ఉంటుంది. సంప్రదాయ వివాహాన్ని చేయాలని వారి కోరిక; నా కుటుంబం కూడా అదే కోరుకుంది. కానీ నేను కోర్టు వివాహాన్ని కోరుకున్నాను. డాలీ కూడా అదే కోరుకుంది. నేను తమ కూతురిని వదిలేసి పారిపోతానేమోనని ఆమె తల్లిదండ్రులు భయపడ్డారు. తమ కొడుకు పెళ్లి చేసుకున్నాడని ప్రజలు తెలుసుకోవాలని నా తల్లిదండ్రులు భావించారు. ఈ ఆందోళనల మధ్యే మేం ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఆమె తరఫువారు ఒక చిన్న హాలులో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

కానీ మా కుటుంబాలు మా ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. మా పెళ్లిలో మంగళసూత్రం లేదు, కన్యాదానం లేదు, కట్నం లేదు. నేను డాలీ నుదుటిపై సిందూరం పెట్టాను; ఆమె తిరిగి అదే పని చేసింది. మేము సాత్ ఫేరే [అగ్ని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేయటం] చేశాము. పూజారి తన మంత్రాలను తాను జపించాడు; ప్రతి ప్రదక్షిణం తర్వాత మయాంక్ మా ప్రమాణాలను చదివాడు - మేము ఒకరికొకరం సమానత్వాన్ని వాగ్దానం చేసుకున్నాము. హాలులో గుమిగూడిన అతిథులకిది వినోదంగా తోచింది కానీ, తామేదో భిన్నమైన సంగతిని చూస్తున్నామనీ, కొన్ని సంకెళ్ళు సడలిపోతున్నాయనీ వారు గ్రహించారు. కొంతమంది కలత చెందారు. కానీ దీర్ఘకాల సంప్రదాయాలైన అసమానత, బ్రాహ్మణవాదం, స్త్రీ వ్యతిరేక నియమాల వంటివన్నీ విచ్ఛిన్నం కావడం మనకు చాలా ముఖ్యం. పెళ్లయ్యాక డాలీ, నేనూ కొత్త ఇంటికి మారాం. మేము 2019లో పెళ్లి చేసుకున్నప్పుడు మా ఇల్లు బోసిగా ఉండేది. నెమ్మదిగా, మేం ప్రాథమికంగా అవసరమైన వస్తువులను ఒక్కొక్కటిగా సమకూర్చుకోవడం ప్రారంభించాం. సూది నుండి అల్మైరా వరకు, మేము కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కొనుగోలు చేశాం.

PHOTO • Sumer Singh Rathore
PHOTO • Sumer Singh Rathore
PHOTO • Devesh

ఎడమ : కోవిడ్ -19 లాక్ డౌన్ కాలమంతా మిథున్ , డాలీలు ముంబైలోనే ఉన్నారు . మధ్య : " మేము జీవితంతో పోరాడుతాము " అని మిథున్ చెప్పారు . కుడి : అతని సోదరుడు రవి

2020 మార్చిలో, కరోనావైరస్ ప్రవేశంతో లాక్‌డౌన్ విధించినప్పుడు, ప్రజలు నిత్యావసరాలను కొనడానికి పరుగులు తీశారు. నా షాపులోని కూరగాయలన్నీ నిమిషాల్లో ఖాళీ అయిపోయాయి. కొందరు వాటిని దోచుకున్నారు, మరికొందరు మాత్రమే వాటికి డబ్బు చెల్లించారు. అన్ని దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు కొద్దిసేపటిలో మా దుకాణాలను మూసివేశారు. అవి తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయో ఎటువంటి సమాచారం లేదు. ప్రజలు తమ గ్రామాలకు, స్వస్థలాలకు పరుగులు తీయడం ప్రారంభించారు. మేము ఉన్న భవనం కేవలం రెండు రోజుల్లో ఖాళీ అయిపోయింది. కరోనా భయంతో పారిపోవడం కంటే, ఆదాయ వనరులేమీ లేకుండా ఏమి తిని బతకాలో తెలియక పారిపోవడమే ఎక్కువగా ఉంది. డాలీ ట్రెక్కింగ్ జాకెట్లు విక్రయించే దుకాణంలో పనిచేసేది. అది కూడా మార్చి 15, 2020న మూతపడింది.

మేము ముందు ఇంటికి వచ్చేసి, ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోవాలని నా కుటుంబం పట్టుబట్టింది. కానీ మా దగ్గర డబ్బేమీ లేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇక్కడే ఉండిపోవడం మంచిదనిపించింది. నా పని కూరగాయలతో కాబట్టి, మాకు పని చేయడానికి అనుమతి ఉంది. అయితే మేము కూరగాయలను కొనడమే పెద్ద ఇబ్బంది అయింది. దాదర్‌లోని ప్రధాన మార్కెట్‌కు తాళాలు వేశారు. మేము వాటిని హైవేకి దూరంగా ఉన్న చునా భట్టి, సోమయ్య గ్రౌండ్ వంటి ప్రదేశాలలో పొందవచ్చు. కానీ ఈ ప్రదేశాలు రద్దీగా ఉంటాయి. నేను వైరస్ బారిన పడతానేమోనని భయపడ్డాను. నేను దానిని ఇంట్లో ఉన్న డాలీకి అంటించాలని అనుకోలేదు. కానీ జనంలోకి వెళ్లడం కంటే వేరే మార్గం లేదు - మేము మా ఖర్చులను భరించే స్థితిలో లేము. మే [2020] నెలలో, మునిసిపల్ కార్పొరేషన్ – BMC - దుకాణాలు తెరిచే సమయాన్ని మూడు గంటలకు- మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు- పరిమితం చేసింది. మీరు ఏ కొంచెం సమయం మీరినా, పోలీసులు తమ లాఠీలతో దెబ్బల వర్షం కురిపిస్తారు. కూరగాయలు విక్రయించే ఆన్‌లైన్ పోర్టల్‌లు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయి కాబట్టి వాటి నుండి ఆర్డర్ చేయడం సులభం అని ప్రజలు భావించారు. దాంతో నా వ్యాపారం బాగా దెబ్బతింది. ఈ సమయంలోనే ఊరిలో దాదా కిందపడి, ఆయన కాలు విరిగింది. లాక్‌డౌన్ సమయంలో ఆయన ఎలా చనిపోయారో నేను ఇప్పటికే చెప్పాను.

కొన్ని నెలల తర్వాత, దుకాణాలను తెరచి ఉంచే సమయాన్ని రాత్రి 7 గంటల వరకు పొడిగించారు. ఒకరోజు సాయంత్రం ఏడు గంటల తర్వాత మా తమ్ముడు రవి బస్ బండి మీద ఉంచిన పండ్ల నుండి కుళ్ళిన మామిడికాయలను వేరు చేస్తున్నాడు. ఒక పోలీసు వచ్చి వీడియో తీయడం ప్రారంభించాడు. భయపడిన రవి అతనికి కొంత డబ్బు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆ పోలీసు భారీ మొత్తం అడిగాడు, ఇవ్వకుంటే కేసు పెడతానని బెదిరించాడు. రవిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి దాటాక, రాత్రి ఒకటిన్నర సమయంలో రవి జేబులో ఉన్న ఆరు వేల రూపాయలను పోలీసు తీసుకొని అతనిని విడిచిపెట్టాడు. అదే రవి వద్ద ఉన్న డబ్బు, అతను పొదుపు చేసుకున్నవి. కొన్ని రోజుల తర్వాత, మాకు తెలిసిన వారి ద్వారా జరిగిన సంఘటన గురించి ఒక సీనియర్ పోలీసు అధికారికి తెలియజేశాము. ఆ తర్వాత రెండు రోజులకు అదే పోలీసు రవిని వెతుక్కుంటూ వచ్చి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు.

కరోనా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ వ్యాపారం మెరుగుపడలేదు. ప్రపంచంతో పోరాడుతూనే, మా జీవితాలను తిరిగి దారిలోకి తీసుకురావడానికి మేమింకా కష్టపడుతూనే ఉన్నాము. నేను ఈ కథనాన్ని రాసేటప్పటికి, నేను కరోనా-పాజిటివ్‌గా ఉన్నాను. డాలీ కూడా. మేం ఇంట్లోనే తాళం వేసుకుని ఉంటున్నాం. నా దుకాణానికి సమీపంలో ఉన్న ఇతర అమ్మకందారులు దుకాణంలో మిగిలి ఉన్న కూరగాయలను విక్రయించడంలో సహాయపడ్డారు. మా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు మందులకు, కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ఖర్చు పెట్టాం. అయినా మరేం ఫరవాలేదు. ఒకసారి మాకు నెగెటివ్‌ రాగానే మేం బయటకు వస్తాం. మేం మళ్ళీ ప్రయత్నిస్తాం, మేం జీవితంతో పోరాడుతాం. అదిగాక ఇంక మిగిలినదేముంది?

వారి ప్రైవసీని కాపాడటం కోసం కొంతమంది మనుషుల పేర్లనూ, ప్రదేశాల పేర్లనూ ఇవ్వలేదు

కథనాన్ని రచయిత హిందీలో రాశారు . దేవేశ్ దీనికి సంపాదకులుగా ఉన్నారు

కవర్ ఫోటో: సుమేర్ సింగ్ రాథోడ్

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mithun Kumar

ਮਿਥੁਨ ਕੁਮਾਰ, ਮੁੰਬਈ ਵਿਖੇ ਸਬਜ਼ੀ ਦੀ ਦੁਕਾਨ ਚਲਾਉਂਦੇ ਹਨ ਅਤੇ ਸੋਸ਼ਲ ਮੀਡਿਆ ਮਾਧਿਅਮਾਂ ਰਾਹੀਂ ਅਤੇ ਵੱਖ-ਵੱਖ ਵੈੱਬਸਾਈਟਾਂ ਲਈ ਸਮਾਜਿਕ ਵਿਸ਼ਿਆਂ ਨੂੰ ਲੈ ਕੇ ਲਿਖਦੇ ਹਨ।

Other stories by Mithun Kumar
Photographs : Devesh

ਦੇਵੇਸ਼ ਇੱਕ ਕਵੀ, ਪੱਤਰਕਾਰ, ਫ਼ਿਲਮ ਨਿਰਮਾਤਾ ਤੇ ਅਨੁਵਾਦਕ ਹਨ। ਉਹ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਹਿੰਦੀ ਅਨੁਵਾਦ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ।

Other stories by Devesh
Photographs : Sumer Singh Rathore

ਸੁਮੇਰ, ਵਿਜੂਅਲ ਸਟੋਰੀਟੈਲਰ, ਲੇਖਕ ਅਤੇ ਪੱਤਰਕਾਰ ਹਨ ਅਤੇ ਰਾਜਸਥਾਨ ਦੇ ਜੈਸਲਮੇਰ ਨਾਲ਼ ਤਾਅਲੁੱਕ ਰੱਖਦੇ ਹਨ।

Other stories by Sumer Singh Rathore
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli