“నన్ను ఎవరూ పనిలో పెట్టుకోవడానికి సిధ్ధంగా లేరు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నన్ను వారి ఇళ్ళల్లోకి రానివ్వడం లేదు” అని మహారాష్ట్రలోని లాతూరు నగరంలో ఇళ్లలో పని చేసుకుంటూ బతికే అరవై ఎనిమిదేళ్ల జెహెదబి సయెద్ చెప్పింది. “నేనెప్పుడూ ఈ గుడ్డ ( మాస్క్) తీసింది లేదు. సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు అన్ని నియమాలను పాటిస్తూనే ఉన్నాను”, అని వివరించింది.
జెహెదబి ఐదు ఇళ్ళలో పనిచేసేది. ఏప్రిల్ 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో వారిలో నాలుగు కుటుంబాల వారు ఆమెను పనికి రావద్దని చెప్పేశారు. “ నాకు ఒక్క ఇల్లే మిగిలింది పనిచేయడానికి. వాళ్ళేమో మరీ ఎక్కువ పని చేయించుకునేవారు” అని వాపోయింది.
జెహెదబి గత ముప్ఫై ఏళ్లుగా ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ బతుకుతోంది. కరోనాకు ముందు- జెహెదబి వంటి వారెందరో, ఇపుడు తమని పని మాన్పించిన ఇళ్ళలో గిన్నెలు కడగటం, గదులు ఊడ్వడం వంటి పనులు చేసుకునేవారు. ఢిల్లీలోని ఒక మసీదులో మార్చి 2020లో జరిగిన తబ్లిఘీ జమాత్ ధార్మిక సమ్మేళనం కోవిడ్ వెల్లువకు వేదిక అయిందన్న వివాదాస్పద వార్త తన యజమానుల మీద ప్రభావం వేసిందని ఆమె భావిస్తోంది. “ముస్లిములకు దూరంగా ఉండండని సాగిన గుసగుసలు కార్చిచ్చులా పాకాయి”, అని ఆమె గుర్తు చేసుకుంది. “జమాత్ మూలంగానే నా పనికి ఎసరు వచ్చిందని మా అల్లుడు అన్నాడు. కానీ దానితో నాకేమి సంబంధం?”, జెహెదబి ప్రశ్నించింది.
జెహెదబి ఆదాయం నెలకు ఐదు వేల రూపాయల నుంచి వెయ్యికి పడిపోయింది. “నన్ను పనిమాన్పించిన కుటుంబాలు ఇక నన్ను పనిలో పెట్టుకోవా?”, జెహెదబి అడిగింది. “నేను వారి కోసం ఎన్నో ఏళ్ళు పని చేశాను. కానీ ఆకస్మికంగా వాళ్ళు నన్ను వదిలేసి వేరేవాళ్లను పనిలో పెట్టుకున్నారు”, అని ఆమె వాపోయింది.
ఏడాదిలో ఆమె పరిస్థితులు ఏమీ సానుకూలంగా మారింది లేదు. “మరింత దుర్భరంగా మారాయంతే”, చెప్పింది జెహెదబి. మార్చి 2021 లో ఆమె మూడిళ్ళలో పనిచేస్తూ వచ్చింది. దాని మూలంగా ఆ నెలలో రూ. 3,000 సంపాదించింది. అయితే ఏప్రిల్ నెలలో కోవిడ్ రెండోసారి ఉధృతంగా మాహారాస్థ్రలో వ్యాపించడంతో రెండిళ్ళ వారు పనికి రావద్దని చెప్పేశారు. “నేను బస్తీలో (slum) నివాసం ఉంటున్నానననీ, అక్కడ మేమెవరం కోవిడ్ భద్రతా నియమాలు పాటించమనీ వారు అన్నారు”, చెప్పింది జెహెదబి.
ఒకే ఒక్క ఇంట్లో పని చేస్తూన్న ఫలితంగా ఆమె ఆదాయం నెలకు రూ. 700 కు పరిమితమయింది. మరి కొన్ని ఇళ్ళలో పని దొరికేవరకు ఆమె ఆదాయం అంతే ఇక.





