ఆదివారం ఉదయం 10:30 అయింది. హనీ పనికి వెళ్ళడానికి తయారవుతోంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి, ఆమె జాగ్రత్తగా ఎర్రటి లిప్‌స్టిక్‌ను పూసుకుంది. "ఇది నా డ్రెస్ కి బాగా మ్యాచ్ అవుతుంది," అంటూనే, తన కూతురికి అన్నం పెట్టాలని గుర్తొచ్చి కంగారుగా పరిగెత్తింది. డ్రెస్సింగ్ టేబుల్‌కి పక్కగా కొన్నిమాస్కులు, ఒక జత ఇయర్‌ఫోన్‌లు తగిలించి ఉన్నాయి . కాస్మెటిక్స్, మేకప్ వస్తువులు టేబుల్ పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అద్దంలోంచి గది మూలలో వేలాడదీసిన దేవుళ్ల బొమ్మలు, బంధువుల ఫొటోలు కనిపిస్తున్నాయి.
హనీ (పేరు మార్చబడింది) తన ఇంటి నుండి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హోటల్‌లో తన క్లయింట్‌ను కలవడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీ మంగోల్‌పురి ప్రాంతంలోని బస్తీలో ఒక గది సెట్- ఆమె ఇల్లు. 32 సంవత్సరాల ఆమె వృత్తిరీత్యా సెక్స్ వర్కర్ గా రాజధాని సమీపంలోని నాంగ్లోయి జాట్ ప్రాంతంలో పనిచేస్తోంది. ఆమె హర్యానాలో గ్రామీణ ప్రాంతానికి చెందినది. “నేను 10 సంవత్సరాల క్రితం వచ్చాను, కాబట్టి ఇక్కడి మనిషినే అని చెప్పుకోవచ్చు. కానీ ఢిల్లీ వచ్చినప్పటి నుండి నా జీవితాన్ని దురదృష్టం వెంటాడింది.”
దురదృష్టం వెంటాడడం అంటే ?
“నాలుగు గర్భస్రావాలు తోహ్ బహుత్ బడి బాత్ హై [చాలా పెద్ద విషయం]! అవన్నీ నాకు తిండి పెట్టడానికి, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఎవ్వరూ లేనప్పుడు, జరిగాయి. ”అని హనీ నవ్వుతూ చెప్పింది, ఆమె నవ్వు, తాను చేసిన సుదూర ప్రయాణానికి సంకేతం.
"నేను ఈ పనిని మొదలు పెట్టడానికి ఇదే కారణం. నా లోపల పెరుగుతున్న నా బిడ్డను పోషించడానికి నా దగ్గర డబ్బు లేదు. నేను ఐదవసారి కడుపుతో ఉన్నాను. నేను రెండు నెలల గర్భవతి గా ఉన్నప్పుడు నా భర్త నన్ను విడిచిపెట్టాడు. నేను ప్లాస్టిక్ కంటైనర్లను తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేస్తే నెలకు 10,000 రూపాయలు వచ్చేవి. కానీ అస్తమానం జబ్బుపడుతూ ఉండడం వలన నా యజమాని నన్ను పని నుంచి వెళ్లగొట్టేసాడు. ”అని ఆమె చెప్పింది.
హనీకి 16 సంవత్సరాల వయస్సు దాటకుండానే పెళ్లి చేసారు ఆమె తల్లిదండ్రులు. కొన్ని సంవత్సరాలు ఆమె, ఆమె భర్త హర్యానాలోనే ఉన్నారు.అక్కడ అతను డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆమెకు 22 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వారు ఢిల్లీకి వచ్చారు. కాని అక్కడకు వచ్చాక, ఆమె భర్త తాగుడుకు అలవాటుపడి ఇంటికి సరిగ్గా వచ్చేవాడుకాదు. "అతను నెలలు తరబడి వెళ్లిపోతాడు. ఎక్కడకో నాకు తెలియదు. అతను ఇప్పటికీ అలానే చేస్తాడు. ఎప్పుడూ చెప్పడు. వేరే ఆడవాళ్ళతో వెళ్లిపోయి, తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినప్పుడు మాత్రమే తిరిగి వస్తాడు. అతను ఫుడ్ సర్వీస్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తాడు. వచ్చిన డబ్బులు ఎక్కువగా తనపైనే ఖర్చుపెట్టుకుంటాడు. నాకు నాలుగు గర్భస్రావాలు జరగడానికి అసలు కారణం అదే. అతను నాకు అవసరమైన మందులను, మంచి తిండిని తీసుకురాలేదు. అప్పట్లో నేను చాలా బలహీనంగా ఉండేదాన్ని,” అని హనీ అంది.







