"ఈ రోజుల్లో మీరు ప్రతిదీ దుకాణాల్లో కొనుక్కోవచ్చు, కానీ గిరిజన తెగలు తమ మతపరమైన ఆచారాల్లో ఉపయోగించే మట్టి కుండలు మాత్రం కోట తెగలోని మహిళా కుమ్మరులు మాత్రమే తయారు చేయగలరు." అని 63 ఏళ్ల సుగి రాధాకృష్ణన్ అన్నది. ఆమె సుదీర్ఘమైన వారసత్వం గల తిరుచిగాడి మహిళా కుమ్మరి వర్గానికి చెందింది. తిరుచిగాడి అనేది ఒక గిరిజన తండా. దాన్ని మన సుగి రాధాకృష్ణన్ “తీర్చికాడ్” అని అంటుంది ఎందుకంటే, కోట తెగ ప్రజలు తమ తండాలను మామూలుగా కాక కాస్త వేరే పేర్లతో పిలుస్తారు. ఈ తండా తమిళనాడు నీలగిరి జిల్లాలోని ఉదగమండలం తాలూకా లో కోటగిరి అనే నగరానికి దగ్గర్లో ఉంది..
సాధారణంగా ఇంటి దగ్గర, సుగి కోట మహిళల సాంప్రదాయ దుస్తులైన టోగా (పై వస్త్రం) లాగా ముడివేసిన మందపాటి తెల్లని దుప్పటి (దాన్ని కోట భాషలో దుప్పిట్ అని అంటారు) మరియు వరాడ్ అనే తెల్లని శాలువా ధరిస్తుంది. తిరుచిగాడికి చెందిన స్త్రీ పురుషులు, కోటగిరి మరియు ఇతర నగరాల్లో పనిచేసేటప్పుడు తమ తండాలో వేసుకొనే సాంప్రదాయ దుస్తులను ప్రతిసారి వేసుకోరు. సుగి నూనె అంటిన తన జుట్టును అడ్డంగా వేలాడే కొప్పులాగా, ఆ తెగ మహిళలకు మాత్రమే కుదిరే ప్రత్యేకమైన శైలిలో చుట్టుకుంది. ఆమె మా అందరిని తన ఇంటికి పక్కనే వున్న చిన్న కుమ్మరి గదికి ఆహ్వానించింది.
"నేనేమి ఒక పద్దతి ప్రకారం మట్టి పాత్రలు ఎలా తయారు చేయాలో ‘నేర్చుకోలేదు’. నేను మా అమ్మమ్మను, ఆమె చేతులు తిప్పే విధానాన్ని గమనించేదాన్ని, అలా ఈ పాత్రలు చేయడం నేర్చుకున్నాను. ఒక స్థూపాకారంలోని మట్టి కుండను వృత్తాకారంలోకి మార్చడానికి కొన్ని గంటల పాటు బయటి వైపు నుండి ఒక చెక్క తెడ్డుతో కొడుతూ నున్నగా చేయాలి. అదే సమయంలో నున్నగా వున్న గుండ్రని రాయితో లోపలి వైపు రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రంధ్రయుక్తత (అతిసూక్ష్మామైన రంధ్రాలు కలిగి వుండే స్వభావం) తగ్గుతుంది. అలాగే మట్టికుండ కు రెండు వైపులా, పైన చెప్పిన చెక్క తెడ్డు బయటి వైపు, నున్నని రాయి, లోపల వైపు సమాంతరంగా కదుల్చుతూ ఉండాలి. అలా కదల్చకపోతే ఒత్తిడివల్ల పాత్రలో పగుళ్లు వస్తాయి. చక్కగా తయారైన ఈ పాత్రలలో వండిన అన్నం అత్యంత రుచిగా ఉంటుంది. కొద్దిగా చిన్న మూత గల పాత్రల్లో సాంబారు వండుతారు. ఒకసారి మీరు కచ్చితంగా రుచిచూడాలి." అంటూ ముగించింది సుగి.









