వేడి సబ్బునీటిలో నానబెట్టిన ఒక దుప్పటిని యువ తాలబ్ హుస్సేన్ లయబద్ధంగా తొక్కుతున్నాడు. ఆ తొక్కడం అతను నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది; అతని ముఖంలో పెద్ద చిరునవ్వు ఉంది. "మీరు పడిపోకుండా సమతుల్యతను కాపాడుకుంటూ నానబెట్టిన దుప్పటిపై నిలబడాలి, " అన్నాడు తాలబ్. మరొక వ్యక్తి దుప్పటి నానబెట్టివున భారీ ఘమేలా (పాత్ర) లోకి మరింత వేడి సబ్బు నీటిని పోస్తుండగా, దన్ను కోసం తాలబ్ తన ముందున్న చెట్టును పట్టుకున్నాడు.
జమ్మూలోని సాంబా జిల్లాలో ఉన్న ఆ చిన్న బకర్‌వాల్ సెటిల్‌మెంట్‌లో చీకటిగా ఉన్న ఒక శీతాకాలపు రాత్రి. అప్పటి అవసరం కోసం సమీపంలో ఏర్పాటుచేసిన కట్టెల పొయ్యి నుండి మాత్రమే కొద్దిగా వెలుతురు వస్తోంది. ఆ పొయ్యి మీద అప్పుడే నేయటం పూర్తిచేసిన ఉన్ని దుప్పట్లను ఉతకడం కోసం ఒక కుండలో నీళ్ళు కాగుతున్నాయి.
ఈ ఉన్ని దుప్పట్లను షెడ్యూల్డ్ జాతుల సముదాయానికి చెందినవారు తయారుచేస్తారు. వీరిలో మేఘ్, మీహ్‌ఘ్ సముదాయానికి చెందినవారు ఈ ఉన్ని పనితనానికి ప్రసిద్ధి చెందారు. దుప్పట్లు తయారైన తర్వాత, వాటిని బకర్‌వాల్ పురుషులు ఉతికి ఆరబెడతారు. దుప్పట్ల తయారీకి అవసరమైన దారాన్నీ నూలునూ సాధారణంగా బకర్‌వాల్ మహిళలు తయారుచేస్తారు; బకర్‌వాల్ కుటుంబాలు ఇంట్లోనే ఆ నూలుకు రంగులద్దుతారు.












