వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బరాగావ్ ఖుర్ద్ గ్రామంలో ఆడవాళ్లంతా పొలాల్లోని మెత్తపడ్డ మట్టిని తెచ్చి వాళ్ళ మట్టి ఇళ్లపై అలుకుతున్నారు. ఇది వారి ఇంటిని బలపరచడమేగాక అందంగా కూడా చేస్తుంది. ఈ పనిని వీరు తరచుగా, ముఖ్యంగా పండుగల ముందు చేస్తారు.
ఇరవైరెండేళ్ల లీలావతి చుట్టుపక్కల ఆడవాళ్ళ లానే తను కూడా వెళ్లి మెత్తనైన మట్టిని తెచ్చుకుందామనుకుంది. కానీ ఆమె మూడు నెలల చంటి బాబు నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఇరవై నాలుగేళ్ల ఆమె భర్త అజయ్ ఓరాన్, దగ్గరలో ఉన్న కీరాణా కొట్టులో పనికి వెళ్ళాడు. ప్రతి కొద్ది నిముషాలకి ఆమె తన ఒళ్ళో పడుకున్న కొడుకు నుదుటిపై చేయి పెట్టి జ్వరం ఏమైనా ఉందేమో అని చూసి “ బానే ఉన్నాడనుకుంటా” అని తనకు తాను సర్ది చెప్పుకుంటోంది.
2018 లో పధ్నాలుగు నెలల లీలావతి కూతురు జ్వరం తగిలి చనిపోయింది. “అది రెండు రోజుల జ్వరమే, మరి ఎక్కువగా కూడా ఏమి లేదు.” అంది లీలావతి. అంతకు మించి కూతురు ఎలా చనిపోయిందో తలి తండ్రులు ఇద్దరికీ తెలియదు. వారి వద్ద హాస్పిటల్ రికార్డులు, మందుల చీటీలు, వాడిన మందులు - వంటి ఏ వివరాలు లేవు. జ్వరం ఇంకొన్ని రోజుల్లో తగ్గకపోతే దంపతులిద్దరూ పాప ని తమ గ్రామానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో, అధౌరా బ్లాక్ లో కైమూర్ జిల్లాలో ఉన్న PHC కి తీసుకుని వెళదామనుకున్నారు. కానీ తీసుకెళ్లలేకపోయారు.
ఆ PHC కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ కి దగ్గరగా, అడవి ప్రాంతంలో ఉంది. దానికి ప్రహరీ గోడ కూడా లేదు. బరాగావ్ ఖుర్ద్, ఆ పక్కనే ఉన్న బారాగావ్ కాలన్ గ్రామాల వారు అక్కడ తిరిగే అడవి జంతువుల గురించి బోల్డన్ని అనుభవాలను చెప్తారు- ఎలుగుబంట్లు, చిరుతపులులు, మనుబోతులు(నీల్ గాయ్)- ఆ భవనంలో తిరిగి (ఈ రెండు ఊర్లకు ఒకటే PHC ఉంది), పేషెంట్లనూ, బంధువులను భయపెడుతూ, ఆఖరుకి అక్కడ పని చేయడానికి ఇష్టపడని హెల్త్ కేర్ వర్కర్లని కూడా జడిపించేవి.
“బరాగావ్ ఖుర్ద్ లో ఒక సబ్ సెంటర్ కూడా ఉంది. కానీ ఆ భవనాన్ని ఎవరూ వాడరు. అది మేకలుకి , వేరే జంతువులకు విశ్రాంత కుటీరం గా పనికి వస్తుంది.” అన్నది ఫుల్వాసి దేవి అనే ఆశ వర్కర్. ఈమె 2014 నుంచి తన ఉద్యోగాన్ని ఎలాగోలా తన సొంత ప్రమాణాలతో లాక్కొస్తోంది.






